అమెరికాలో మహానేత వైఎస్ఆర్‌కి ఘన నివాళి
Published Thu, Sep 7 2017 10:03 PM | Last Updated on Sat, Jul 7 2018 3:22 PM
వాషింగ్టన్ డి.సి (వర్జీనియా) : ప్రజల నేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఎనిమిదో వర్ధంతి సందర్బంగా జోహార్ వైఎస్సార్... జోహార్ వైఎస్సార్ నినాదాలతో అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ దద్దరిల్లింది. ప్రియతమ నేత వైఎస్‌ఆర్ వర్థంతి కార్యక్రమంలో ఆయన అభిమానులు, కార్యకర్తలు వర్జీనియాలోని బంజారా ఇండియన్ కుసైన్ లో సమావేశమై ఆ మహనీయుడికి ఘన నివాళుర్పించారు వైఎస్సార్‌సీపీ అమెరికా ఎన్ఆర్ఐ కమిటీ అడ్వైజర్, మిడ్ అట్లాంటిక్ రీజియన్ కో-ఆర్డినేటర్ వల్లూరు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా ఏపీ నుంచి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు.
మొదట మహానేత వైఎస్ఆర్ చిత్ర పటం ముందు దివ్యలు వెలిగించి, పుష్పగుచ్చం సమర్పించి, మౌనము పాటించారు. అనంతరం ముఖ్యఅతిథులు వేణు జంగా, అమర్ కటిక రెడ్డి, రాంగోపాల్ దేవపట్ల, క్రిష్ణారెడ్డి చాగంటి, ప్రసన్న కాకుమానిని సత్కరించారు. రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘కరిగిపోయే కాలం వెంట చెరిగిపోని నీ చిరునవ్వు సాక్షిగా రాజన్న సువర్ణ రాజ్యాన్ని సాధించుకోవడమే మా తెలుగు ప్రజలు నీకిచ్చే నిజమైన నివాళి’ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం పతనావస్థలో ఉందని, వైఎస్ఆర్ సుపరిపాలనను ఈ రాష్ట్ర ప్రజలు చూశారు గనుకే ఇకపైన కూడా అలాంటి నేతలే రావాలని, కావాలని ప్రజలు కోరుకుంటున్నారని.. అది ఒక్క వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ద్వారానే సాధ్యమౌతుందన్నారు. అన్న వస్తున్నాడు మంచి రోజులు వస్తున్నాయి అంటూ ఇప్పటికే ప్రజల్లో బాగా బలపడిందని ప్రజల జీవితాలకు నవరత్నాలు భరోసా కల్పిస్తాయని విశ్వాసం ఉందని తెలిపారు.
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. వైఎస్ఆర్ గురించి చెప్పాలంటే ఒక జన్మ సరిపోదు అంటూ ‘అందరూ బాగుండాలి. అందులో నేను ఉండాలి. ఎన్ని రోజులు బితికామన్నది ముఖ్యం కాదు. జన్మనిచ్చిన మాతృభూమికి ఎంత మేలు చేసామన్నది ముఖ్యమనే సిద్ధాంతాన్ని ఆచరణలో చూపించిన ఒకే ఒక్క నేత డాక్టర్ వైఎస్ఆర్ అని’ పేర్కొన్నారు. ఎందరో సీఎంలు వచ్చారు, పోయారు. కానీ దేశ రాజకీయ పటంపై హిమశిఖర సదృశంగా సమున్నతమైన వ్యక్తిగా భాసిల్లిన మహా వ్యక్తిత్వం వైఎస్ఆర్ దని, ఎదిగిన కొద్దీ ఒదగమనే నీ నైజం, ప్రతి తెలుగువాడి ముఖాన చిరునవ్వు చూడాలన్నది నీ ఆశయం తప్పక నెరవేరుతుందన్నారు. నవ్యాంధ్రలోని ప్రజలందరి కుటుంబ సభ్యుడిగా, రైతులకు, పేదలకు సమాజంలోని అన్ని సామాజిక వర్గాల వారికి అండగా, భరోసా ఇచ్చే అన్నగా, అందరితో మమేకమవుతూ త్వరలోనే రాష్ట్రంలో వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న తెలుగుదేశం పార్టీకి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు
వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. వైఎస్ఆర్ చేసిన సంక్షేమ పథకాలు ఎన్నో కుటుంబాలకు వెలుగు నిచ్చిన దీపం లాంటివని, ఈ ప్రపంచం ఉన్నంత కాలం తెలుగు ప్రజలు గుండెల్లో వైఎస్ఆర్ చిరస్థాయిగా నిలిచి పోతారని కొనియాడారు. అభివృద్ధి, సంక్షేమ ఫలాలను రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించిన ఏకైక నాయకుడు వైఎస్ఆర్ అని గుర్తు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలు రాష్ట్ర ప్రజలందరికీ భరోసా కల్పించనున్నాయి, త్వరలోనే రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయని.. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ కచ్చితంగా విజయం సాధిస్తుందన్నారు.
వైఎస్ఆర్ సీపీ అమెరికా కో-కన్వినర్ రత్నాకర్ పండుగాయల మాట్లాడుతూ.. డాక్టర్ వైఎస్ఆర్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేశారు. వైఎస్ఆర్ వెళుతూ వెళుతూ ఆయన నిలువెత్తు రూపం లాంటి జగనన్నని మనకు ఇచ్చి వెళ్లారని చెప్పారు. జగనన్నని ముఖ్యమంత్రిని చేసేవరకు వైఎస్ఆర్ అమెరికా కమిటీ విభాగం కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలు పథకాలతో ప్రజల జీవితాల్లో వెలుగు వస్తుందన్నారు.
పెద్ద సంఖ్యలో హాజరైన సభికుల నుండి పలువురు వక్తలు వైఎస్ఆర్‌తో తమ సాన్నిహిత్యం, తెలుగు రాష్ట్రాలకు వైఎస్ఆర్ అందించిన సంక్షేమ పథకాలు తెలుపుతూ రాజశేఖరరెడ్డిని స్మరించుకున్నారు. వందలాది మంది ప్రవాసాంధ్రులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. సత్తిరాజు సోమేశ్వర రావు, సౌర్య ప్రసాద్ కొచ్చెర్ల, శ్రీధర్ నాగిరెడ్డి, మధుసూధన రెడ్డి పోళ్లుచల్లా, తదితరులు ఆంధ్ర జగతి సిగలో వైఎస్ఆర్ సీపీ పతాకాన్ని చిరస్థాయిగా నిలపడమే వైఎస్ఆర్ కు నిజమైన నివాళి అన్నారు.
అధికార టీడీపీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసిందన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు, ఆర్ధిక పరమైన ఇబ్బందులు తొలగించడం కోసం వైఎస్ జగన్ తొమ్మిది పథకాలు ప్రకటించారన్నారు. ఈ పథకాల ద్వారా పేదలు, మహిళలు, రైతులు, విద్యార్ధులుకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. వర్జీనియా, మేరీలాండ్, వాషింగ్టన్ డీసీ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అభిమానులు వైఎస్ రాజశేఖరరెడ్డి అమర్ రహే.. జై జగన్ అంటూ నినాదాలతో సందడి చేశారు.
చివరగా వందన సమర్పణలో భాగంగా ‘జగన్ కోసం మేము సైతం’ అంటూ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతికి తరలివచ్చిన ప్రతి వైఎస్ఆర్ కుటుంబం" సభ్యులకు హృదయ పూర్వకమైన ధన్యవాదాలు తెలుపడంతో రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సంస్మరణ దినోత్సవం ముగిసింది. అందరూ ఒక్కటై చక్కటి భోజనంతో రాజన్న జ్ఞాపకాలను మననం చేసుకున్నారు.
Advertisement