
మాట్లాడుతున్న ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలు శ్రీవాణి
సాక్షి, విశాఖపట్నం: సమాజంలో మహిళలపై రోజురోజుకు లైంగిక వేధింపులు పెచ్చుమీరుతున్నాయని ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలు కొయ్యాన శ్రీవాణి ఆందోళన వ్యక్తం చేశారు. మన దేశంలో ప్రతి మూడు నిమిషాలకు ఒకరు అత్యాచారానికి గురవుతూ ఉన్నారని, ప్రతి 10 నిమిషాలకు 498 కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. విశాఖలో సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఉద్యోగాలు చేసే వారు లైంగిక వేధింపులకు గురవుతున్నారని, ఐటీ రంగంలో పనిచేసే వారి పరిస్థితి మరీ దయనీయంగా ఉందన్నారు. మగవారి కంటే దీటుగా ఆడవారు అన్ని రంగాల్లో రాణిస్తునారని, అయితే ఈ లైంగికదాడుల వల్ల ఉద్యోగాలు చేసేందుకు వెనుకడుగు వేసే పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పనిచేసే చోట ఎక్కువగా ఈ లైంగిక దాడులు జరుగుతుండడం దారుణమని, మహిళలపై దాడులను అరికట్టేందుకు పదిమందికి తక్కువ కాకుండా మహిళలు పనిచేసే ప్రతి చోట అంతర్గత ఫిర్యాదుల కమటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. యాజమాన్యం ప్రతిపాదించిన ఓ సీనియర్ ఉద్యోగిని నేతృత్వంలో ఉండే ఈ కమిటీలో ఉద్యోగుల నుంచి ఇద్దరు, సామాజిక సేవలో అనుభవం ఉన్న ఇద్దర్ని సభ్యులుగా నియమించవచ్చన్నారు. ఈ కమిటీలు ఏర్పాటు చేయకపోతే ఆయా కంపెనీలు, సంస్థలకు రూ.50 వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా లీగల్ సర్వీసెస్ సి.ఉమాదేవి, డొమెస్టిక్ వైలెన్స్ కౌన్సిలర్స్ జ్యోతిలత, వన్ స్టాప్ సెంటర్ ఎడ్మినిస్ట్రేటర్ పద్మావతి, జిల్లా చైల్డ్ ప్రొటక్షన్ అధికారి సత్యనారాయణ పాల్గొన్నారు.