జబర్దస్ హాస్యనటుల ప్రదర్శన
సాక్షి, విశాఖపట్నం: అంతన్నారింతన్నారు..చివరకు గ్రామాల్లో తీర్థాల కంటే ఘోరంగా విశాఖ ఉత్సవ్ నిర్వహిస్తున్నారు. రెండో రోజూ కూడా ఉత్సాహాన్ని పుంజుకోలేదు. విశాఖ జనాన్నే కాదు.. ఇతర ప్రాంతాల వారిలోనూ ఆసక్తిని రేకెత్తించలేదు. గత ఏడాది విశాఖ ఉత్సవ్ మూడు రోజులూ కలిపి నాలుగున్నర లక్షల మంది వచ్చారని అధికారులు అంచనా వేశారు. అంటే సగటున రోజుకు లక్షన్నర మంది హాజరైనట్టు లెక్కకట్టారు. కానీ ఈసారి ఉత్సవ్‌కు తొలిరోజు గురువార, మలిరోజు శుక్రవారం కూడా సందర్శకుల తాకిడి నామమాత్రంగానే ఉంది. ఉత్సవాలను తిలకించడానికి జనం పోటెత్తలేదు. వచ్చిన వారంతా కొత్తగా ఏర్పాటు చేసిన టీయూ–142 యుద్ధవిమానం, సాగరతీరంలో ఉన్న కురుసుర సబ్‌మెరైన్ మ్యూజియాలను చూడడానికే ఆసక్తి చూపారు. దీంతో పలువురు సందర్శకులు, పర్యాటకులు అక్కడికే పరిమితమయ్యారు. వీటికి ఆనుకుని ఆర్కే బీచ్‌లో ఏర్పాటు చేసిన ప్రధాన వేదిక వద్ద ఒకింత కనిపించారు.
ఇక సాంస్కృతిక, సంప్రదాయ కార్యక్రమాల వేదిక వద్ద కూడా జనం అంతగా కనిపించలేదు. అక్కడ సాయంత్రం సద్గురు జగ్గీవాసుదేవన్ కుమార్తె రాధే జగ్గీ శాస్త్రీయ నృత్యంతో పాటు ఫ్యూజన్ రాక్‌బ్యాండ్‌లు ఒకింత ఆకట్టుకున్నాయి. ఇక ఎంతో అట్టహాసంగా ప్రచారం చేసిన ‘పరిమళ’ పుష్ప ప్రదర్శనకు స్పందన అంతంతమాత్రంగానే ఉంది. అయితే గురువారంతో పోల్చుకుంటే ఒకింత జనం పెరిగారు. అక్కడ 70–80 రకాల పూలను ప్రదర్శనలో ఉంచారు. ఇందులో విదేశీ పుష్పాలు కూడా ఉన్నాయి. ఎంజీఎం పార్కు స్థలంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో సందర్శకులను ఆకట్టుకునే రీతిలో వినూత్న పుష్పాలు తక్కువగా ఉండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఏటా ఎంతగానో ఆకట్టుకునే దేవాలయాల నమూనాల వద్ద కూడా సందర్శకుల కనిపించలేదు. ఏటా ఈ ఆలయాల వద్ద జనం క్యూ కట్టేవారు.
మరోవైపు ఎప్పట్నుంచో ఊరిస్తున్న హెలిటూరిజం తొలిరోజు ఉత్సవ్‌లో ఆఖరి క్షణంలో రద్దయింది. పరువు పోతుందన్న ఉద్దేశంతో దీనిని శుక్రవారం మధ్యాహ్నం రుషికొండ నుంచి మంత్రి గంటా శ్రీనివాసరావు దీనికి శ్రీకారం చుట్టారు. దీంతో కొంతమంది హెలికాప్టర్‌లో షికారు వెళ్లారు. యధావిధిగా రెండో రోజు కూడా జిల్లా, నగరానికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు (గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మినహా) ఎంపీలు, జిల్లా మంత్రి అయ్యన్నపాత్రుడు అటువైపు తొంగిచూడలేదు.
Comments
Please login to add a commentAdd a comment