సాక్షి ప్రతినిధి, ఏలూరు: గత ఏడాది జిల్లా ప్రగతి అంతంతమాత్రమే. సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అత్యధిక సీట్లు కట్టబెట్టినా.. ఆ పార్టీ జిల్లాకు చేసిందేమీ లేదు. పోలవరంపై నీలినీడలు కమ్ముకున్నాయి. పట్టిసీమ ఎత్తిపోతల వల్ల గోదావరి డెల్టాలో సాగునీటి ఎద్దడి నెలకొంది. ఇతర అభివృద్ధి పనులూ ఆశించిన స్థాయిలో జరగలేదు. ఈ నేపథ్యంలో 2018లోనైనా జిల్లా ప్రగతి బాట పడుతుందా.. ఎన్నికలు సమీపిస్తుండడంతో అధికారపార్టీ కటాక్షిస్తుందా అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.
అయోమయంలో పోలవరం
‘పోలవరం ఆంధ్రుల జీవనాడి. సోమవారాన్ని పోలవారంగా మార్చాం’ అని పదేపదే చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకెళ్లలేకపోయారు. ప్రస్తుతం ప్రధాన కాంట్రాక్టర్‌పై ఓ బ్యాంకు దివాళా దరఖాస్తు దాఖలు చేయడంతో ప్రాజెక్టు అయోమయంలో పడింది. నిన్నటి వరకూ ప్రాజెక్టును తామే నిర్మిస్తామని గొప్పలు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఆ బాధ్యతను కేంద్రంపైకి తోసే యత్నం చేస్తున్నారు.
రబీకి మరోసారి గండం
అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లలో ఏ అభివృద్ధి చేయని టీడీపీ నేతలు కొత్త సంవత్సరంలో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోనున్నారు. డెల్టా చరిత్రలోనే రెండోసారి రబీకి నీరివ్వలేని దుస్థి తి ప్రస్తుతం నెలకొంది. 2015లోనూ ఇదే పరిస్థితి ఎదురైన సంగతి తెలిసిం దే. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని తోడేసి కృష్ణాడెల్టాకు మళ్లించడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని రైతుల ఆందోళన.
మారనున్న రాజకీయ ముఖచిత్రం పోరుబాటన వైఎస్సార్ సీపీ
ఇదిలా ఉంటే జిల్లా రాజకీయ ముఖచిత్రం మారనుంది. సర్కారు ప్రజావ్యతిరేక విధానాలపై నిరంతర పోరాటాలు చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమరోత్సాహంతో ముందుకు దూసుకెళ్తోంది. 2017లో తుందుర్రు ఆక్వా ఫుడ్ పార్కుతోపాటు పలు ప్రజా ఉద్యమాలకు పార్టీ అండగా నిలబడి.. మంచి గుర్తింపు తెచ్చుకుంది. రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాలతో ప్రజలకు చేరువవుతోంది. రెండునెలల్లో ఆ పార్టీ అధినేత వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి పాదయాత్ర జిల్లాకు రానుంది.
కుమ్ములాటల్లో అధికార పక్షం
ఇసుక, మట్టి దేనినీ వదలకుండా దోచుకోవడంపైనే దృష్టిపెట్టిన అధికారపార్టీలో కుమ్ములాటలు మొదలయ్యాయి. ఆ పార్టీ ప్రజాప్రతినిధులు రూ.వందల కోట్లు సంపాదించారన్న విమర్శలు మిన్నంటుతున్నాయి. దీంతో ఆ పార్టీనేతలు ప్రజలకు దూరమయ్యారు.
ప్రజాపోరాటాలతో వామపక్షాలు
మారిన రాజకీయపరిస్థితుల నేపథ్యంలో తమ ఉనికే ప్రశ్నార్థకంగా మారిన వామపక్షాలు పూర్తిగా ప్రజా సమస్యలపైనే దృష్టిపెట్టాయి.
సొంతంగా ఎదగని బీజేపీ
ఓ ఎంపీ, ఓ మంత్రి ఉన్నా జిల్లా రాజకీయాలపై బీజేపీ తన ముద్ర వేయలేకపోయింది. సొంతంగా ఎదగలేకపోయింది.
అయోమయంలో జనసేన
2014 ఎన్నికలకు ముందే పుట్టినా తెలుగుదేశం, బీజేపీలకు మద్దతు ఇవ్వడానికే పరిమితమైన జనసేన ఇప్పటికీ ఒక రూపు తెచ్చుకోలేకపోయింది. పూర్తిగా అయోమయంలో ఉంది.
ప్రశాంతతే లక్ష్యం
జిల్లాలో ప్రశాంత వాతావరణం నెలకొల్పడమే మా లక్ష్యం. అసాంఘిక శక్తులను ఏరిపారేస్తాం. కొత్త సంవత్సరంలో ప్రజలతో మమేకమై వారికి మెరుగైన సేవలందిస్తాం. దీనికోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశాం. రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టిపెట్టాం. మహిళలు, బాలలపై అకృత్యాలను అడ్డుకుంటాం. మావోయిస్టుల కదలికలపై నిఘా పెంచుతాం. పోలవరం నిర్వాసితులను మధ్యవర్తులు, దళారులు మోసం చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. దీనిపై చర్యలు చేపడతాం.
– ఎం.రవిప్రకాష్, జిల్లా పోలీసు సూరింటెండెంట్
Comments
Please login to add a commentAdd a comment