
నల్లజర్ల: ఆర్టీసీ బస్సును సిమెంట్ లారీ ఢీకొట్టడంతో ఇద్దరు పిల్లలు సహా ఐదుగురు మరణించారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందినవారు నలుగురు ఉన్నారు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి ఎర్రకాలువ బ్రిడ్జి సమీపంలో శుక్రవారం ఉదయం జరిగింది. ఆర్టీసీ బస్సు రాజమండ్రి నుంచి ఏలూరు వెళుతోంది. అదే సమయంలో రాజమండ్రి వైపు వేగంగా వెళ్తున్న సిమెంట్ లారీ అదుపుతప్పి బస్సును ఢీకొట్టి.. పొలాల్లోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో బస్సు కుడి వైపు భాగం నుజ్జునుజ్జయింది. బస్సులో 19 మంది ప్రయాణికులు ఉన్నారు.
వీరిలో తునికి చెందిన కాపుశెట్టి నాగేశ్వరరావు భార్య జ్యోతి (33), కుమారుడు శివసాయి (14), కుమార్తె అఖిల సత్య (12), ఆయన అత్త గేలం లక్ష్మి (50), ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన పల్లా సావిత్రమ్మ (62) అక్కడికక్కడే మృతి చెందారు. నాగేశ్వరరావుతోపాటు బస్సు డ్రైవర్ శేఖర్, కండక్టర్ కుమారి, దూబచర్లకు చెందిన మద్దు రుహాతి, నిడదవోలుకు చెందిన భవానీతోపాటు పలువురు గాయపడ్డారు. మరొక మహిళ తీవ్రంగా గాయపడి తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. క్షతగాత్రులకు నల్లజర్ల, తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రాథమిక చికిత్స చేశారు.