భీమవరం టౌన్: ప్రజా సమస్యలపై మునిసిపల్ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో ధర్నా చేస్తున్న వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్ కోడే యుగంధర్‌పై పోలీసుల సమక్షంలోనే టీడీపీకి చెందిన కౌన్సిలర్ నందమూరి ఆంజనేయులు దాడి చేయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలో ప్రధాన సమస్యల పరిష్కారంలో వైఫల్యం చెందుతున్న మునిసిపాలిటీ పండుగ రోజుల్లో వివిధ వర్గాల ప్రజలు ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలను, బ్యానర్లను తొలగించడంపై వైఎస్సార్ సీపీ నాయకులు శనివారం మునిసిపాలిటీలో శాంతియుతంగా ధర్నా చేపట్టారు. వైఎస్సార్ సీపీ భీమవరం నియోజకవర్గ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నివాసం నుంచి నాయకులు, కార్యకర్తలు ప్రదర్శనగా మునిసిపాలిటీకి చేరుకున్నారు. కమిషనర్ సీహెచ్ నాగనర్సింహరావు చాంబర్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. వన్‌టౌన్ సీఐ డి.వెంకటేశ్వరరావుఆధ్వర్యంలో పోలీసులు అక్కడకు చేరకుని విషయం తెలుసుకున్నారు.
చైర్మన్ కొటికలపూడి గోవిందరావు చాంబర్‌లో ఉన్న కమిషనర్ బయటకు వచ్చి పార్టీ శ్రేణులతో మాట్లాడారు. పోలీసులు ట్రాఫిక్‌సమస్యకు అవరోథంగా ఉన్న ఫ్లెక్సీలను, బ్యానర్లు తొలగించాలని మునిసిపాలిటీని కోరారని, అనుమతి లేకుండా పెట్టిన బ్యానర్లను తొలగించేందుకు జీఓ కూడా ఉందన్నారు. దీనిపై పార్టీ పట్టణ కన్వీనర్ కోడే యుగంధర్, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ గాదిరాజు తాతరాజు అభ్యంతరం తెలిపారు. సంక్రాంతి ముగిసే వరకూ ప్రజల మనోభావాలను గౌరవించాలని కోరడంతో ఉన్నతాధికారులతో మాట్లాడి అనుమతి కోరతామని నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. దీనికి వైఎస్సార్ సీపీ శ్రేణులు సానుకూలంగా స్పందిస్తుండగా టీడీపీ కౌన్సిలర్ నందమూరి ఆంజనేయులు దూకుడుగా ముందుకు వచ్చి కోడే యుగంధర్ మెడ పట్టుకుని వెనక్కి నెట్టి వేయడంతో అక్కడే ఉన్న సీఐ డి.వెంకటేశ్వరరావు, ఎస్సై పి.అప్పారావు వెంటనే తేరుకుని అడ్డుకున్నారు.
పార్టీ శ్రేణులు స్పందిస్తుండగానే కౌన్సిలర్ ఆంజనేయులను కొందరు అక్కడి నుంచి కమిషనర్ చాంబర్‌లోకి తీసుకువెళ్లి తలుపులు గడియ పెట్టారు. విషయం తెలుసుకున్న చైర్మన్ గోవిందరావు, వైస్ చైర్మన్ ముదునూరి సూర్యనారాయణరాజు అక్కడికి వచ్చి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. ప్రజా సమస్యలపై అడిగేందుకు వస్తే కౌన్సిలర్ రౌడీయుజంతో దాడి చేస్తే వెనకేసుకువస్తారా అంటూ చైర్మన్‌ను వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రశ్నించారు. సమస్యను సామరస్యంగా పరిష్కరిద్దామని చైర్మన్ సూచించగా కౌన్సిలర్ ఆంజనేయులతో క్షమాపణ చెప్పించాలని నాయకులు కామన నాగేశ్వరరావు, పేరిచర్ల సత్యనారాయణరాజు, కొల్లి ప్రసాద్, సుంకర బాబూరావు, గూడూరి ఓంకారం, భూసారపు సాయి సత్యనారాయణ, కొప్పర్తి జనార్థన్, చికిలే మంగతాయారు, నెల్సన్, కందికట్ల డేవిడ్ డిమాండ్ చేశారు.
చైర్మన్, వైస్ చైర్మన్లు వైఎస్సార్ సీపీ నాయకులను చర్చలకు ఆహ్వానించారు. కమిషనర్ చాంబర్‌లో ఇరువర్గాలు చర్చలు జరిపారు. బహిరంగంగా దాడి చేసిన కౌన్సిలర్ ఆంజనేయులు అందరి సమక్షంలో క్షమాపణ చెప్పాలని సుంకర బాబూరావు కోరడంతో చైర్మన్ దానికి అంగీకరించకుండా లేచి వెళ్లిపోయారు. దీంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు మళ్లీ ధర్నా చేపట్టారు. కౌన్సిల్ హాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా సీఐలు డి.వెంకటేశ్వరరావు, ఎ.చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల సమక్షంలోనే ప్రతిపక్ష నాయకులపై దాడి చేస్తే సామాన్యుల పరిస్థితి ఏమిటని పోలీసులను కోడే యుగంధర్ ప్రశ్నించడంతో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని సీఐ డి.వెంకటేశ్వరరావు చెప్పారు.
సమస్యలపై స్పందించమంటే దాడులు చేస్తారా?
ప్రజా సమస్యలపై స్పందిస్తే పీక నొక్కి టీడీపీ నాయకులు రౌడీయిజం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్ కోడే యుగంధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మునిసిపల్ కార్యాలయం ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పండుగ రోజుల్లో ప్రజల మనోభిప్రాయాన్ని గౌరవించి సంక్రాంతి వరకూ ఫ్లెక్సీలు తొలగించవద్దని ప్రజా స్వామ్య పద్ధతిలో శాంతియుతంగా ధర్నా చేస్తుంటే మునిసిపల్ కార్యాలయంలో అధికార పక్ష కౌన్సిలర్ దాడి చేయడం దారుణమన్నారు. కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ గాదిరాజు తాతరాజు, సీనియర్ నాయకుడు కామన నాగేశ్వరరావు, పేరిచర్ల సత్యనారాయణరాజు, నెల్సన్‌లు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రశ్నించే ప్రతిపక్షంపై రాష్ట్రంలో తెలుగు దేశం దాడులు చేసే విష సంస్కృతి భీమవరం మునిసిపాలిటీకి కూడా చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు. కౌన్సిలర్ నందమూరి ఆంజనేయులుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కౌన్సిలర్లు పాలవెల్లి మంగ, కానుబోయిన వెంకటరమణ, వేండ్ర విజయదుర్గ, విజ్జురోతి రాఘవకుమారి, సుంకర విజయలక్ష్మి, చెన్ను శాం తి, నాయకులు గంటా సుందర్‌కుమార్, రేవూరి గోగురాజు, పెనుమాల నర్సింహస్వామి, బి.గోపి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment