సాక్షి, రాయచోటి: ఆదినుంచి రాయలసీమకు అన్యాయం జరుగుతూనే ఉందని, పెద్దల ఒప్పందాలను పాలకులు పట్టించుకోవడంలేదని రాయచోటి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెద్దల ఒప్పందం ప్రకారం రాయలసీమలో రాజధాని గాని, హైకోర్టుగాని ఏర్పాటు చేయాల్సి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. రాయలసీమకు నీళ్ళు తెచ్చామని గొప్పలు చెబుతున్న పెద్దలు నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నారో ఒక్కసారి గుర్తించాలన్నారు. తమ ప్రాంతంలోని కృష్ణా జలాలు పోతిరెడ్డిపాడు ద్వారా వస్తున్నాయే తప్ప పట్టిసీమతో గోదావరి నీళ్లు కాదన్నారు. భవిష్యత్తులో మరో ప్రాంతీయవాదం ఉండకూడదనే తమ బాధ అని చెప్పారు. వైజాగ్ రైల్వే జోన్ ఏర్పాటుపై సౌకర్యం లేదని కేంద్రం అంటున్నా బ్రిటిష్ కాలం నుంచి రైల్వే హబ్‌గా ఉన్న గుంతకల్లును ఎందుకు ప్రతిపాదించడం లేదని ప్రశ్నించారు. గతంలో ఎయిమ్స్ తరలించుకుపోయారు.. ఇపుడు కేంద్ర విశ్వవిద్యాలయం ఊసే లేదని తెలిపారు. బాబు తలుచుకుంటే ఏదీ పెద్ద సమస్య కాదంటూ రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేస్తామంటే ఎవరు వద్దంటారని ప్రశ్నించారు. గతంలో ప్రాంతీయవాదంతో హైదరాబాదును కోల్పోయామని, అలాంటి సమస్య పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పాలకులపై ఉందని ఆయన అన్నారు. నవరత్నాల నగరం అంటూ అభివృద్ధి అంతా ఒకేచోట కాకుండా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు అభివృద్ధిని వికేంద్రీకరించాలని సూచించారు. రాయలసీమలో పుట్టి, పెరిగి రాజకీయ నాయకుడిగా ఎదిగారు.. కనీసం హైకోర్టు అయినా ఏర్పాటు చేయించండంటూ చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. రాయలసీమ గురించి అసెంబ్లీలో ఎప్పుడు ప్రస్తావించినా తమ గొంతును అణదొక్కే ప్రయత్నం చేస్తున్నారని గడికోట విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment