మహిళలు ఏర్పాటు చేసుకున్న పాడి పరిశ్రమ
ఉద్యోగస్తులమైతేనే అభివృద్ధి సాధ్యం అని చాలా మంది మహిళలు అనుకుంటారు... తమకు ఉద్యోగం చేసే పరిస్థితి లేదు కనుక.. ఇక జీవితం ఇంతే అని కొందరు భావిస్తుంటారు... అయితే చేయాలే గానీ ఎన్నో అవకాశాలు ఉన్నామని మరికొందరు నిరూపిస్తున్నారు... మూడో కోవకు చెందిన వారే మైలవరం మండల మహిళలు... పాడి పరిశ్రమను ఎంచుకుని కుటుంబాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్తున్నారు.
మైలవరం : మండలంలోని మహిళలు ఆర్థిక స్వావలంబన కోసం అహర్నిషలు కృషి చేస్తున్నారు. తమకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముందడుగు వేస్తున్నారు. పాడి పరిశ్రమను ఎంపిక చేసుకొని తద్వారా లబ్ధి పొందుతున్నారు. పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నారు. తమ జీవన మనుగడను అభివృద్ధి వైపు పయనింప చేయుటకు దాల్మియా సీయస్‌ఆర్, నాబార్డ్, ఏపీజీబీ దోహద పడుతున్నాయని వారు చెబుతున్నారు. దాదాపు 309 మంది మహిళలకు పాడి పరిశ్రమ ఏర్పాటు కోసం దాల్మియా సీయస్‌ఆర్.. బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు చేయించి పంపిణీ చేసింది.
నవాబుపేట గ్రామానికి చెందిన 175 మంది మహిళలకు రూ.లక్ష చొప్పున, దుగ్గనపల్లి గ్రామంలోని 38 మందికి రూ.50 వేలు, తలమంచిపట్నంలోని 40 మందికి రూ.15 వేలు, చిన్నకొమెర్ల గ్రామానికి చెందిన 60 మందికి రూ.50 వేలు, పెద్దకొమెర్లలోని ఐదుగురికి 60 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. దీంతో మహిళలు పాడి గేదెలను కొని తద్వారా జీవన మనుగడ సాగిస్తున్నారు.
ఇద్దరు పిల్లలను చదివిస్తున్నా
పాడిగేదెలు పెట్టుకొని వచ్చే డబ్బుతో ఇద్దరు పిల్లలను చదివిస్తున్నా. దాల్మియా సీయస్‌ఆర్ సహకారంతో పాడి గేదెలను కొన్నాం. మేము బతుకుటకు ఓ దారిని చూపించిన దాల్మియా యాజమాన్యానికి ఎప్పు డూ రుణపడి ఉంటాం. మరికొన్ని రుణాలను ఇస్తే మరిన్ని గేదెలు కొని జీవనం సాగిస్తాం. – చీపాటి శాంతమ్మ, మహిళా రైతు, దుగ్గనపల్లె
మహిళా సంఘాలుగా ఏర్పడ్డాం
మా గ్రామంలో 34 మంది మహిళలం రైతు సంఘాలుగా ఏర్పడ్డాం. ఒక్కొక్క సంఘంలో ఐదుగురు మహిళా రైతులు ఉన్నారు. దాల్మియా సీయస్‌ఆర్ మహిళా సంఘాలకు పంపిణీ చేసిన ఆర్థిక సహకారంతో గేదెలను కొని తద్వారా జీవనం సాగిస్తున్నాం. – ఓబులమ్మ, మహిళా రైతు, నవాబుపేట
జీవనోపాధుల పెంపుదలతోనే అభివృద్ధి
ఆర్థిక సుస్థిరత్వం సాధించాలంటే జీవనోపాధుల పెంపుదల ద్వారానే సుసాధ్యం అవుతుంది. అందులో భాగంగానే దాల్మియా సీయస్‌ఆర్ ద్వారా మహిళలు, మహిళా సంఘాలకు పాడి పరిశ్రమలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాం. మహిళలు సంఘటితంగా పాడిపరిశ్రమ ఏర్పాటు కోసం సుముఖత చూపారు. ఆయా బ్యాంకుల ద్వారా ఆర్థిక సాయం అందేటట్లు కృషి చేశాం. భవిష్యత్తులో ఇంకొన్ని కార్యక్రమాలు చేపడుతాం.
– రాజశేఖర్‌రాజు, దాల్మియా సీయస్‌ఆర్ విభాగాధిపతి
Comments
Please login to add a commentAdd a comment