వెన్నపూస విజయకేతనం | YSRCP Candidate Vennapusa Gopal Reddy Win in Graduate MLC elections | Sakshi
Sakshi News home page

వెన్నపూస విజయకేతనం

Published Thu, Mar 23 2017 2:54 PM | Last Updated on Wed, Aug 29 2018 6:26 PM

వెన్నపూస విజయకేతనం - Sakshi

వెన్నపూస విజయకేతనం

► మండలి ఎన్నికల్లో  వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గోపాల్‌రెడ్డి గెలుపు
► టీడీపీ అభ్యర్థి కేజేరెడ్డిని ఎలిమినేట్‌ చేసిన అధికారులు
► వెన్నపూసకు టీడీపీ అభ్యర్థిపై 14,367 ఓట్ల మెజార్టీ

(సాక్షి ప్రతినిధి, అనంతపురం): అందరూ అనుకున్నట్లే జరిగింది. పట్టభద్రులు ‘ఓటెత్తిన’ చైతన్యంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి పట్టం కట్టారు. తద్వారా ప్రభుత్వంపై వ్యతిరేకతను చాటిచెప్పారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్ర నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల కౌంటింగ్‌లో తొలిరౌండ్‌ నుంచి నిలకడైన ఆధిక్యత ప్రదర్శించిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి తిరుగులేని విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ తమకు బలమైన జిల్లాగా భావిస్తున్న అనంతపురం నుంచి, అందులోనూ రాప్తాడు నియోజకవర్గానికి చెందిన గోపాల్‌రెడ్డి ఘన విజయం సాధించడంతో అనంతతో పాటు కర్నూలు, వైఎస్సార్‌ జిల్లా వాసుల్లో టీడీపీ ప్రభుత్వంపై ఏస్థాయిలో వ్యతిరేకత ఉందో స్పష్టమవుతోంది. ఇదే తరుణంలో వైఎస్సార్‌సీపీపై గట్టి నమ్మకం ఉంచారన్న విషయాన్ని ఈ ఎన్నికలు సుస్పష్టం చేస్తున్నాయి.

పశ్చిమ రాయలసీమ పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ ఈ నెల 20న మొదలైంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తొలి రౌండ్‌ నుంచి ప్రతి రౌండ్‌లోనూ గోపాల్‌రెడ్డి నిలకడగా ఆధిక్యత ప్రదర్శించారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి ఆరు రౌండ్లలో 53,714 ఓట్లు దక్కించుకున్నారు. అప్పటికి తన సమీప ప్రత్యర్థి కేజేరెడ్డిపై 12,677 ఓట్ల ఆధిక్యత సాధించారు. అయితే విజయానికి అవసరమయ్యే ‘మ్యాజిక్‌ ఫిగర్  67,887. దీని కంటే 14,173 ఓట్లు తక్కువ రావడంతో ఎన్నికల అధికారులు మంగళవారం ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. బరిలోని 25మంది అభ్యర్థులలో తక్కువ ఓట్లు పోలైన వారి నుంచి ప్రాధాన్యత క్రమంలో ఒక్కొక్కరిని ఎలిమినేట్‌ చేస్తూ వచ్చారు. వారి ఓట్లను ఇతర అభ్యర్థులకు జత పరుస్తూ వచ్చారు. గోపాల్‌రెడ్డి, కేజేరెడ్డి, గేయానంద్‌ మినహా తక్కిన 23 మంది అభ్యర్థులకు తొలి ప్రాధాన్యత ఓట్లు 8,239  పోలయ్యాయి. ఎలిమినేషన్‌లో ఈ ఓట్లలో 23వ రౌండ్‌ ముగిసే సరికి గోపాల్‌రెడ్డికి మరో 1,771 లభించాయి. ఆపై 23వ రౌండ్‌లో గేయానంద్‌ను ఎలిమినేట్‌ చేశారు.  ఆయనకు లభించిన మొత్తం 34,910 (22వ రౌండ్‌ పూర్తయ్యే సరికి) ఓట్లలో ద్వితీయ ప్రాధాన్యతను లెక్కించారు. ఇందులో 10,798 ఓట్లు గోపాల్‌రెడ్డికి దక్కాయి. ఇవి కలిపి గోపాల్‌రెడ్డికి వచ్చిన ఓట్ల సంఖ్య  66,283కు చేరింది. అయినప్పటికీ మ్యాజిక్‌ ఫిగర్‌కు 1,827 ఓట్ల దూరంలో నిలిచారు. దీంతో చివరకు టీడీపీ అభ్యర్థి కేజేరెడ్డిని ఎలిమినేట్‌ చేసి ఆయనకు పోలైన ద్వితీయ ప్రాధాన్యత, ఆ తర్వాత ప్రాధాన్యత ఓట్లను 24వ రౌండ్‌గా అధికారులు లెక్కించారు. ఈ ప్రక్రియలో ఒక్కో టేబుల్‌ పరిధిలోని ఓట్లు లెక్కిస్తూ మ్యాజిక్‌ ఫిగర్‌కు గోపాల్‌రెడ్డి చేరువయ్యారా, లేదా అని అధికారులు పరిశీలిస్తూ వచ్చారు. కొన్ని టేబుళ్లలోని ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక గోపాల్‌రెడ్డికి పోలైన ఓట్లను పరిశీలించగా 68,110కి చేరాయి. ఆయన విజయానికి అవసరమైన ఓట్లు 67,887 మాత్రమే. మ్యాజిక్‌ ఫిగర్‌ కంటే 223 ఓట్లు ఎక్కువ లభించడంతో ఎన్నికల అధికారులు గోపాల్‌రెడ్డి విజయాన్ని ఖరారు చేశారు. ఈ విజయంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు కదనో త్సాహంతో ఉన్నాయి. వచ్చే ఏడాది జరగబోయే సర్పంచ్‌ ఎన్నికలతో పాటు ఆపై  జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కూడా మెజార్టీ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement