
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా- పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ల విడాకులు ఇరు దేశాల క్రీడావర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.

అన్యోన్యంగా కనిపించే ఈ జంట మధ్య చిచ్చు రేపిందెవరంటూ పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

తాను పాకిస్తానీ నటి సనా జావెద్‌ను పెళ్లాడినట్లు తెలుపుతూ షోయబ్ మాలిక్ సోషల్ మీడియాలో ప్రకటించడమే ఇందుకు కారణం.

సానియా- షోయబ్ విడిపోనున్నానరంటూ గత కొన్నాళ్లుగా వదంతులు వ్యాపించాయి.

ఈ క్రమంలో తాజాగా షోయబ్.. సనాతో తన పెళ్లిని ధ్రువీకరిస్తూ అవి రూమర్లుకావు నిజాలని తేల్చాడు.

ఈ నేపథ్యంలో సానియాకు విడాకులు ఇచ్చిన తర్వాత.. ఈ వివాహం చేసుకున్నాడా? లేదంటే.. సానియానే షోయబ్‌తో బంధం తెంచుకుందా? అనే చర్చ మొదలైంది.

ఈ నేపథ్యంలో సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా ఈ కూతురి గురించి వస్తున్న వార్తలపై స్పందించారు.

ఖులా పద్ధతి ప్రకారం సానియా షోయబ్‌కు విడాకులు ఇచ్చిందని స్పష్టం చేశారు.

కాగా 2010లో సానియా- షోయబ్‌ల వివాహం జరుగగా.. 2018లో ఈ జంటకు కుమారుడు ఇజహాన్ జన్మించాడు.

ఇస్లామిక్ షరియా చట్టాల ప్రకారం.. వివాహిత తన భర్త నుంచి విడిపోవాలనుకుంటే ఖులా పద్ధతి పాటించవచ్చు.

ఇందులో ఏకపక్షంగానే స్త్రీ తనంతట తాను నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉంటుంది.

వివాహ సమయంలో భర్త తనకు ఇచ్చిన కానుకను తిరిగి పంపడం ద్వారా విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలియజేయవచ్చు.





