ABCL
-
రవిప్రకాశ్‌వన్నీ అసత్యాలే!
సాక్షి, హైదరాబాద్: తమ సంస్థలపై అసత్య, పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు చేయడంపై టీవీ9 కొత్త యాజమాన్యం అలంద మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, పాత యాజమాన్యం శ్రీనిరాజు సంస్థలైన చింతలపాటి హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఐల్యాబ్స్ వెంచర్ క్యాపిటల్ ఫండ్ న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించాయి. ప్రధానంగా టీవీ 9 ప్రస్తుత ప్రమోటర్లైన అలంద మీడియా, పాత ప్రమోటర్లైన శ్రీనిరాజు సంస్థల మధ్య లావాదేవీల్లో చెల్లింపులు అక్రమంగా హవాలా మార్గంలో జరిగాయని టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ చేసిన వాదనలు అవాస్తవం అని ప్రకటించాయి. ఫోర్జరీకి పాల్పడి క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుని, అరెస్టును ఎదుర్కొంటున్న రవిప్రకాశ్, ఎలాగైనా బెయిల్‌ను పొందడం కోసం తమపై నిరాధార ఆరోపణలు ప్రచారంలోకి తీసుకురావడాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నాయి. విచారణ అధికారుల ముందు, కోర్టులోనూ రవిప్రకాశ్ చేసిన ఆరోపణలకు ఎలాం టి ఆధారాలు లేవని ఒక ప్రకటనలో తెలిపాయి. కోర్టులో రవిప్రకాశ్ తరఫు న్యాయవాది చేసిన వాదనల ఆధారంగా మీడియాలో వచ్చిన వార్తలను ఖం డించాయి. ఫోర్జరీ, చీటింగ్ కేసుల్లో తాను ఎదుర్కొంటున్న విచారణను పక్కదారి పట్టించడం కోసమే రవిప్రకాశ్ ఈ ఆరోపణలకు దిగారంటూ విమర్శిం చా యి. వాస్తవాలను వెల్లడించడంలో భాగంగా టీవీ9 విక్రయ లావాదేవీల వివరాలను కొత్త, పాత యాజమాన్యాలు సంయుక్త ప్రకటనలో తెలిపాయి. డీల్ విలువ రూ.414 కోట్లు... ‘2018, ఆగస్టు నాటికి చింతలపాటి హోల్డింగ్స్, ఐ ల్యాబ్స్, క్లిపోర్డ్ ఫెరీరా, ఎంవీకేఎన్ మూర్తిలకు టీవీ9 మాతృసంస్థ ఏబీసీఎల్లో 90.54 శాతం వాటా ఉండేది. ఈ వాటా మొత్తాన్ని ఆగస్టు 24, 2018న అలంద మీడియా కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ రూ.414 కోట్లు. దీనికి సంబంధించిన షేర్ పర్చేజ్ ఒప్పందాన్ని చట్టబద్ధంగా చేసుకుని, నిధుల బదిలీని పూర్తిగా బ్యాంకుల ద్వారానే జరిపింది. రవిప్రకాశ్ ఆరోపిస్తున్నట్లు ఇందులో ఎలాంటి నగదు లావాదేవీ అన్నదే జరగలేదు. ఏబీసీఎల్కు అప్పటికి ఉన్న బకాయిలను చెల్లించడానికి అలంద మీడియా రూ.150 కోట్లు నేరుగా సంస్థ ఖాతాల్లోకి బదిలీ చేయగా, మిగిలిన రూ.264 కోట్లు పాత ప్రమోటర్లకు బ్యాంకుల ద్వారా చెల్లింపులు జరిగాయి. ఈ లావాదేవీలు పాత, కొత్త ప్రమోటర్ల రికార్డుల్లో నమోదయ్యాయి. సంస్థ యాజమాన్య బదిలీపై కేంద్ర సమాచార ప్రసార మం త్రిత్వ శాఖకు కూడా సమాచారమిచ్చాం. ఈ వ్యవహారమంతా చట్టపరిధిలోనే జరిగింది తప్ప, ఎలాంటి చట్ట ఉల్లంఘనలకు పాల్పడలేదు’అని వివరించాయి. ‘ఈ బదిలీ వ్యవహారం ఆగస్టు 2018 లోనే జరిగింది. ఆ సమయంలో టీవీ9 సీఈవోగా ఉన్న రవిప్రకాశ్, షేర్‌పర్చేజ్ అగ్రిమెంట్‌పై సంతకం కూడా చేశారు. అయినప్పటికీ, 9 నెలల తర్వాత, రవిప్రకాశ్ ఈ ఆరోపణలు చేయడం చూస్తుంటే, ఫోర్జరీ కేసుల విషయంలో తాను ఎదుర్కొంటున్న క్రిమినల్ విచారణను పక్కదారి పట్టించడానికి, తనను తాను కాపా డుకోవడానికి చేస్తున్న పనే అని అర్థమవుతోంది. సైఫ్ త్రీ మారిషస్‌తో కుదిరిన సెటిల్మెంట్ వ్యవహారం పైనా రవిప్రకాశ్ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. వాటికి ఎలాంటి ఆధారాలు లేవు. టీవీ9 విక్రయం జరిగే సమయానికి హైదాబాద్‌లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో సైఫ్ త్రీ కంపెనీ వేసిన ఓ కేసు పెండింగ్‌లో ఉంది. ఐ విజన్‌లో ఉన్న వాటాల విషయంలో సైఫ్ త్రీ ఈ కేసు వేసింది. అయితే.. ఇది సెటిల్మెంట్ అగ్రిమెంట్ ద్వారా పరిష్కారం అయ్యింది. దీనికి సంబంధించి ఆర్బీఐ నియమ నిబంధనలకు లోబడి బ్యాంకుల ద్వారానే చెల్లింపు జరిగింది. నిధులను స్వీకరించిన తర్వాత, సైఫ్ త్రీ కేసును ఉపసంహరించుకోవడానికి ఎస్‌సీఎల్‌టీ అనుమతి కూడా ఇచ్చింది. వాస్తవాలు ఇలా ఉంటే, రవిప్రకాశ్ మాత్రం ఈ ఒప్పందంలో అక్రమాలు జరిగినట్లుగా అవాస్తవమైన, అసంబద్ధమైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలతో ప్రభావితం కావొద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. తమ పరువుకు భంగం కలిగించేలా అసత్యమైన, పూర్తిగా అవాస్తమైన ఆరోపణలను రవిప్రకాశ్ చేసినందుకు న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం’అని స్పష్టం చేశాయి. -
రవిప్రకాశ్‌కు చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: టీవీ9 టేకోవర్ విషయంలో సైఫ్ మారిషస్ కంపెనీ లిమిటెడ్–ఐ విజన్ మీడియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ల మధ్య తలెత్తిన వివాదం సమసిపోయింది. కోర్టు వెలుపల ఈ రెండు కంపెనీలు రాజీ చేసుకోవడంతో ఐ విజన్‌పై సైఫ్ మారిషస్ దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరణకు హైదరాబాద్‌లోని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ ) శుక్రవారం అనుమతిచ్చింది. ఈ పిటిషన్‌పై టీవీ9 మాజీ సీఈవో వి. రవిబాబు అలియాస్ రవిప్రకాశ్ చేసిన అభ్యంతరాలను ఎన్సీఎల్టీ తోసిపుచ్చింది. రవిప్రకాశ్ లేవనెత్తిన అభ్యంతరాలన్నీ అలందా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ (ఏబీసీఎల్)కు సంబంధించిన అంతర్గత వివాదాలని గుర్తుచేసింది. ఏబీసీఎల్ టేకోవర్, ఆ కంపెనీ నుంచి రవిప్రకాశ్, ఇతరులు డైరెక్టర్లుగా తొలగింపు తదితర వివాదాలను ఈ వ్యాజ్యంలో లేవనెత్తడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ వివాదాలు సైఫ్ మారిషస్ పిటిషన్ ఉపసంహరణను తిరస్కరించడానికి ఎంతమాత్రం కారణాలు కాజాలవని పేర్కొంది. ఈ అంశాలన్నింటిపై రవిప్రకాశ్ ఇప్పటికే ఇదే ట్రిబ్యునల్‌లో మరో పిటిషన్ దాఖలు చేశారని తెలిపింది. ఆ పిటిషన్ విచారణపై జూన్ 12 వరకు స్టే విధిస్తూ ఢిల్లీలోని జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుం టూ ఐ విజన్ మీడియాపై దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు సైఫ్ మారిషస్ కు అనుమతినిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ట్రిబ్యునల్ సభ్యులు (జ్యూడీషియల్) కె.అనంత పద్మనాభస్వామి ఉత్తర్వులు జారీ చేశారు. ఇదీ సైఫ్–ఐ విజన్ మధ్య వివాదం... తమతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఐ విజన్ వాటాల బదలాయింపు చేయలేదని, అదే విధంగా ఎన్సీఎల్టీ ఆదేశాల మేరకు నడుచుకోలేదంటూ సైఫ్ మారిషస్ గత ఏడాది ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే, ఈ రెండు కంపెనీల మధ్య ట్రిబ్యునల్ వెలుపల రాజీ కుదిరింది. దీంతో ఐ విజన్ మీడియాపై తాము దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతి కోరింది. అయితే దీనిపై రాతపూర్వకంగా పిటిషన్ దాఖలు చేసుకోవాలని సైఫ్ మారిషస్‌కు ఎన్సీఎల్టీ స్పష్టం చేసింది. దీంతో సైఫ్ పిటిషన్ ఉపసంహరణ నిమిత్తం పిటిషన్ దాఖలు చేసింది. ఇదే సమయంలో రంగ ప్రవేశం చేసిన రవిప్రకాశ్ సైఫ్ మారిషస్ పిటిషన్ ఉపసంహరణకు అనుమతించవద్దంటూ అభ్యంతరాలు లేవనెత్తారు. టీవీ 9లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలన్నింటినీ అందులో ప్రస్తావించారు. రవిప్రకాశ్ జోక్యంపై అభ్యంతరాలు... రవిప్రకాశ్ దాఖలు లేవనెత్తిన ఈ అభ్యంతరాలపై అటు సైఫ్ మారిషస్, ఐ విజన్ మీడియా, ఇటు ఏబీసీఎల్లు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అసలు తమ మధ్య లావాదేవీల్లో రవిప్రకాశ్‌కు ఏమాత్రం సంబంధం లేదని తెలిపాయి. సంబంధం లేని వ్యక్తి లేవనెత్తే అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాయి. అందరి వాదనలు విన్న ట్రిబ్యునల్ సభ్యులు అనంత పద్మనాభస్వామి సైఫ్ మారిషస్ పిటిషన్ ఉపసంహరణకు అనుమతిచ్చారు. చట్ట ప్రకారం పిటిషన్‌ను ఉపసంహరించుకునే హక్కు పిటిషనర్‌కు ఉందన్నారు. సైఫ్–ఐ విజన్లు రాజీకొచ్చిన నేపథ్యంలో ఈ పిటిషన్‌ను పెండింగ్‌లో ఉంచాల్సిన అవసరం లేదని ఆయన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే సంబంధం లేని వ్యక్తి లేవనెత్తిన అభ్యంతరాల ఆధారంగా పిటిషన్‌ను పెండింగ్‌లో ఉంచాల్సిన అవసరం లేదని వీఎల్ఎస్ వర్సెస్ సౌత్ ఎండ్ ఇన్ఫ్రా కేసులో ఎన్సీఎల్ఏటీ ఇచ్చిన తీర్పును ఉదహరించారు. -
పరిస్థితులు అనుకూలించకే టీవీ9 ఎగ్జిట్‌లో జాప్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మార్కెట్ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్లే మీడియా కంపెనీ టీవీ9 గ్రూప్ మాతృ సంస్థ అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ (ఏబీసీఎల్) నుంచి వైదొలగడంలో జాప్యం జరుగుతోందని వెంచర్ క్యాపిటలిస్ట్, పీపుల్ క్యాపిటల్ ఎండీ శ్రీని రాజు చెప్పారు. ప్రస్తుతం ఈ సంస్థలో తమతో పాటు మరికొందరు ఇన్వెస్టర్లకు సుమారు 80 శాతం వాటాలు ఉన్నాయని వివరించారు. మొత్తం మీద ఇందులో రూ. 100 కోట్ల దాకా ఇన్వెస్ట్మెంట్ ఉన్నట్లు పేర్కొన్నారు. బుధవారం ఇక్కడ జరిగిన ‘టై ఎంట్రప్రెన్యూరియల్ సమిట్’ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా శ్రీని రాజు ఈ విషయాలు వివరించారు. రుణ సంక్షోభంలో చిక్కుకున్న డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ వ్యవహారం చాలా సంక్లిష్టమైనదని రాజు చెప్పారు. ఇది తమలాంటి ఇన్వెస్టర్లకు అనువైనది కాదన్నారు. గతంలో ఇన్వెస్ట్ చేసిన కొన్ని సంస్థల నుంచి వచ్చే రెండు, మూడేళ్లలో వైదొలుగుతున్నామని రాజు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంతో పాటు దేశం గడ్డు కాలం ఎదుర్కొంటోందని ఆయన చెప్పారు. భారత ఎకానమీకి అంత మంచిది కాదని చెప్పారు. అయితే, కష్టకాలంలోనే నైపుణ్యాలు వెలుగులోకి వస్తాయని, పేరొందిన అనేక కంపెనీలు ఇలాంటి సమయాల్లోనే ఆవిర్భవించాయని రాజు వివరించారు. పరిస్థితులకు భిన్నంగా ఆర్థిక వ్యవస్థ 7-8 శాతం వృద్ధి సాధిస్తున్న పక్షంలో అందరికీ అవకాశాలు మెరుగ్గా ఉంటాయని ఆయన చెప్పారు. ‘టై’ సదస్సు.. ఔత్సాహిక వ్యాపారవేత్తలకు తగిన వేదిక కల్పించే ఉద్దేశంతో డిసెంబర్ 18-20 దాకా ది ఇండస్ ఎంట్రప్రెన్యూర్స్ (టై) సంస్థ 7వ ఎంట్రప్రెన్యూరియల్ సదస్సు (టెస్ 2013) నిర్వహిస్తోంది. అమెరికా, యురప్ సహా పలు దేశాల నుంచి సుమారు 2,000 నుంచి 3,000 మంది పైచిలుకు డెలిగేట్లు, సుమారు 100 మంది ఏంజెల్ ఇన్వెస్టర్లు ఇందులో పాల్గొంటున్నారని టై హైదరాబాద్ ప్రెసిడెంట్ మురళి బుక్కపట్నం చెప్పారు. ఇలాంటి సదస్సు హైదరాబాద్‌లో నిర్వహించడం ఇదే ప్రథమమని ఆయన పేర్కొన్నారు. ఔత్సాహిక వ్యాపారవేత్తలు.. ఇన్వెస్టర్లను కలుసుకునేందుకు, అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలపై అవగాహన పెంచుకునేందుకు ఇది తోడ్పడగలదని మురళి వివరించారు.