చార్మీ దాదా ఎవరు?
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గురువారం నటి చార్మీ కౌర్‌ను ప్రశ్నించారు. డ్రగ్స్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న కెల్విన్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ విచారణ 8 గంటలపాటు సాగింది. కెల్విన్‌తో చార్మీ, పూరీ జగన్నాథ్ తదితరులకు సంబంధం ఉన్న అంశాల పైనా ఈడీ ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. ఉదయం 10.30 గంటలకు తన ఆడిటర్ సతీష్, న్యాయవాది, సహాయకుడితో కలిసి చార్మీ ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ అభిషేక్ గోయల్ నేతృత్వంలోని బృందం సాయంత్రం 6.30 గంటల వరకు చార్మీని ప్రశ్నించింది. అధికారులు కోరిన మేరకు తనతోపాటు తన సంస్థకు చెందిన రెండు బ్యాంకు ఖాతాల వివరాలను చార్మీ ఈడీ బృందానికి అందించింది.
తన సినిమాలకు ఈవెంట్ మేనేజర్‌గా..
ఎక్సైజ్ అధికారులు 2017లో నమోదు చేసిన డ్రగ్ కేసు ఆధారంగానే ఈడీ కేసు దర్యాప్తు సాగుతోంది. అప్పట్లో ఎక్సైజ్‌కు చెందిన సిట్ అధికారులూ చార్మీని ప్రశ్నించారు. నాటి వివరాలతోపాటు రెండు నెలల క్రితం ఈడీ విచారణలో కెల్విన్ చెప్పిన అంశాల ఆధారంగా చార్మీ విచారణ సాగింది. కెల్విన్ కాల్‌డేటాతోపాటు వాట్సాప్‌లో చార్మీ దాదా అనే పేరుతో కాల్స్, చాటింగ్స్ ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. వీటికి సంబంధించిన ఆధారాలను సేకరించిన అధికారులు చార్మీ దాదా ఎవరంటూ ఆమెను ప్రశ్నించారు.
2015–17 మధ్య కెల్విన్ ఖాతాలోకి చార్మీ ఓ దఫా రూ.2 లక్షలు, తర్వాత మరికొన్నిసార్లు మరికొంత మొత్తాన్ని బదిలీ చేశారు. ఈ ఆర్థిక లావాదేవీలకు కారణాలేంటని అధికారులు ప్రశ్నించారు. కెల్విన్ చార్మీ దాదా పేరుతో సేవ్ చేసుకున్న నంబర్ తనదేనని అంగీకరించిన చార్మీ.. తన సినిమాలకు అతడు ఈవెంట్ మేనేజర్‌గా పని చేసినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే సంప్రదింపులతోపాటు ఆర్థిక లావాదేవీలు జరిగాయని వివరించారు. ఎక్కడా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, మనీల్యాండరింగ్ జరగలేదని వివరణ ఇచ్చారు. ఈడీ అడిగిన కొన్ని అంశాలకు ఆమె తరఫున ఆడిటర్ సమాధానం ఇచ్చారని తెలిసింది.
పూరీ చెప్పిన సమాచారం పైనా...
ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు మంగళవారం దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను ప్రశ్నించారు. ఆయన చెప్పిన అంశాలకు సంబంధించి కూడా చార్మీని ఈడీ బృందం ప్రశ్నించింది. ప్రతి ప్రశ్నకూ కొన్ని అనుబంధ ప్రశ్నలు జోడిస్తూ చార్మీ విచారణ సాగింది. ఇప్పటికే చార్మీ బ్యాంకు స్టేట్మెంట్లు, ఐటీ రిటర్న్స్, బ్యాలెన్స్‌షీట్లను సేకరించిన ఈడీ అధికారులు చార్మీ చెప్పిన విషయాలతో వాటిని సరిచూడనున్నారు. అవసరమైతే ఆమెను మరోసారి విచారించే అవకాశం ఉంది.
అడిగిన వివరాలన్నీ ఇచ్చా: మీడియాతో చార్మీ
ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చా. బ్యాంకు ఖాతాల లావాదేవీలు, తదితరాలకు సంబంధించిన రికార్డులనూ సమర్పించా. మరోసారి విచారణకు రావాలని కోరితే తప్పకుండా వస్తా. విచారణకు పూర్తిగా సహకరిస్తా.
రకుల్ విజ్ఞప్తి మేరకు..
కేసు దర్యాప్తులో ఈడీ అధికారులు సినీ నటి రకుల్‌ప్రీత్ సింగ్‌కు సమన్లు జారీ చేశారు. షెడ్యూల్ ప్రకారం సోమవారం ఆమె ఈడీ కార్యాలయంలో విచారణకు రావాల్సి ఉంది. అనివార్య కారణాలతో తాను ఆ రోజు హాజరుకాలేనని, తేదీ మార్చాలని రకుల్ గురువారం ఈడీ అధికారులకు లేఖ రాశారు. దీంతో నేడు (శుక్రవారం) విచారణకు రావాల్సిందిగా రకుల్‌కు చెప్పినట్లు తెలుస్తోంది.