achampeta MLA
-
'ఎస్సీ వర్గీకరణపై కేంద్రం ఒరగబెట్టిందేమి లేదు'
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటిసారి మాదిగలకు ఉపముఖ్యమంత్రి పదవిఘిచ్చిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేర్కొన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ .. మంత్రి పదవి లేనంత మాత్రానా మాదిగలకు ఎలాంటి నష్టం జరగదని, కేసీఆర్ ఎన్నటికి మాదిగల వెన్నంటే ఉంటారని స్పస్టం చేశారు. ఎస్సీ వర్గీకరణపై ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఏం ఒరగబెట్టలేదని విమర్శించారు. ఎస్సీలకు సంబంధించిన ఎ,బి,సి,డిల వర్గీకరణ కేసీఆర్ హయాంలోనే జరుగుతుందని విశ్వసించారు. ఎస్సీ వర్గీకరణను తమకు వదిలేయాలంటున్న మందకృష్ణను, ఆయన చూపిస్తున్న కమట ప్రేమను మాదిగలు నమ్మొద్దని హితవు పలికారు. మందకృష్ణ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని, మాదిగ ఉపకులానికి చెందిన కడియం శ్రీహరికి ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చిన విషయం గుర్తులేదా అంటూ మరో ఎమ్మెల్యే ఆరూరూ రమేశ్ తెలిపారు. గత పాలకులు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను పక్కదారి పట్టించారని, సబ్‌ప్లాన్‌కు సంబంధించిన నిధులు దుర్వినియోగం కాకుండా కేసీఆర్ ప్రత్యేక చట్టం చేసిన సంగతి గుర్తు చేశారు. -
'అచ్చంపేట ఎమ్మెల్యే బెదిరిస్తున్నారు'
పంజగుట్ట: అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నుంచి తనకు ప్రాణహాని ఉందని తెలంగాణ స్టేట్ ఆయూష్ డాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు పానుగంటి మాథ్యూ జాన్సన్ ఆరోపించారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఆయూష్ డిపార్ట్మెంట్లోని కాంట్రాక్ట్ ఉద్యోగుల కాంట్రాక్ట్ రెన్యూవల్ విషయమై 2012 జనవరి 14న సెక్రెటరియేట్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కె.సమ్మయ్యను తాను సంప్రదించగా.. రూ.10 వేలు లంచం అడిగారని చెప్పారు. దీంతో తాను ఏసీబీతో సమ్మయ్యను పట్టించానని జాన్సన్ తెలిపారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో విచారణకు రావడంతో అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు జోక్యం చేసుకున్నారని తెలిపారు. ఈనెల 18న సాయంత్రం 7.53 నిమిషాలకు నం. 9912315315 నుంచి ఎమ్మెల్యే కాల్ చేసి.. సమ్మయ్య నాకు తమ్ముడు లాంటివాడని, అతడిని ఈ కేసు నుంచి బయటపడేందుకు సాయం చేయాలని కోరగా తాను నిరాకరించానని చెప్పాడు. దీంతో ఆయన తాను ఎమ్మెల్యే హోదాలో మాట్లాడుతున్నాననే విషయం గుర్తుంచుకోవాలని, నేను చెప్పినట్టు వినాలని బెదిరించారని ఆరోపించారు. ఎమ్మెల్యే బెదిరించిన ఆడియో రికార్డులను ఏసీబీ డీజీకి అందించగా, ఆయన తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారని చెప్పారు.