మరో 2,850మంది ఉద్యోగులు ఔట్!
న్యూయార్క్: నోకియా సంస్థకు ఉన్న విస్తృతమైన రిటైల్ నెట్వర్క్ను వాడుకొని మార్కెట్లో ఎదగాలన్న మైక్రోసాఫ్ట్ వ్యూహం బెడిసికొట్టిన నేపథ్యంలో క్రమంగా ఉద్యోగులను తొలగిస్తోంది. స్మార్ట్ ఫోన్ హార్డ్ వేర్ వ్యాపార విభాగంలో పెరుగుతున్న నష్టాలతో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఉద్యోగాల్లో కోత పెడుతోంది నోకియా ప్రయోగం ద్వారా 7.6 బిలియన్ల డాలర్ల నష్టాన్ని మూటగట్టుకున్న సంస్థ స్మార్ట్ ఫోన్ సెక్టార్ లో మరో 2,850మంది ఉద్యోగులను తొలిగిస్తున్నట్టు మార్కెట్ రెగ్యులేటరీ ఫైలింగ్ లో తెలిపింది. దీంతోపాటుగా 2017 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా మరో 4,700 ఉద్యోగాల్లో కోత పెట్టనుంది. ఈ వివరాలను పీసీ వరల్డ్ శుక్రవారం నివేదించింది. అలాగే నోకియా ప్రయోగం తర్వాత చాలామంది నోకియా ఉద్యోగులు మైక్రోసాఫ్ట్ ను వీడినట్టు వెర్జ్ రిపోర్టు చేసింది.
మే నెలలో 1,850 ఉద్యోగులు తొలగిస్తున్న ప్రకటించిన సంస్థ నోకియా ప్రయోగానికి స్వస్తి పలుకుతున్న సంకేతాలిచ్చింది. మరోవైపు స్మార్ట్ ఫోన్ రంగంలో నెలకొన్న భారీ అంచనాలు, ప్రత్యర్థుల పోటీ, లూమియా, విండోస్ ఫోన్ల వైఫ్యలం కంపెనీని బాగా దెబ్బ తీసింది. దీంతో స్మార్ట్ ఫోన్ల తయారీని నిలిపివేస్తున్నట్టు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదేళ్ల ప్రకటించారు. ఇకమీదట సాఫ్ట్వేర్పైనే అధికంగా దృష్టి కేంద్రీకరిస్తామని తెలిపారు. విండోస్-10 మొబైల్ ప్లాట్ఫామ్ అభివృద్ధి, క్లౌడ్ సేవలకు ఇక ప్రాధాన్యమివ్వనున్నట్టు చెప్పారు. ఈ నేపథ్యంలోనే స్మార్ట్ ఫోన్ వ్యాపారానికి సంబంధించి గత జూన్ లో సుమారు 7,400 ఉద్యోగులను తొలగించనున్నట్టు కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే.