బలానికి కమలదళం కసరత్తు
⇒13 జిల్లాల్లో బీజేపీలో కొత్తగా చేరిన వారికి శిక్షణ
⇒ ప్రారంభించిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు
⇒ వేదిక సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల
జగ్గంపేట / గండేపల్లి : కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టిన భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో క్షేత్రస్థాయిలో బలోపేతమయ్యే దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం అధికారంలోకి రాగా కాంగ్రెస్ చావుదెబ్బ తింది. దీంతో గట్టి పునాదిని నిర్మించుకోవడానికి ఇదే తగిన సమయమని బీజేపీ భావిస్తోంది.
13 జిల్లాల పరిధిలో కొత్తవారిని చేర్చుకుంటూ వారికి బీజేపీ విధి విధానాలు, సిద్ధాంతాల గురించి తెలియజేసేందుకు శిక్షణ తరగతులకు తెరతీసింది. దీనిలో భాగంగా జిల్లాలోని గండేపల్లి మండలం సూరంపాలెంలోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో సీమాంధ్ర పరిధిలోని పార్టీ నాయకులు, కార్యకర్తలకు మూడురోజుల రాజకీయ శిక్షణ తరగతులను ప్రారంభించింది.
మీడియాను అనుమతించకుండా గోప్యత
పార్టీ సీనియర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు శుక్రవారం శిక్షణ తరగతులను ప్రారంభిర చారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రారంభోపన్యాసం చేశారు. అయితే ఈ కార్యక్రమానికి మీడియాను అనుమతించలేదు. శిక్షణ తరగతులు జరిగే సెమినార్ హాల్లోకి మీడియాను అనుమతించకుండా గోప్యత ప్రదర్శించారు. కాగా.. అందిన సమాచారం ప్రకారం.. శిక్షణ తరగతుల్లో వెంకయ్యనాయుడు పార్టీలోకి కొత్తగా చేరిన వారికి దిశానిర్దేశం చేశారు. పార్టీ విధివిధానాలు, సిద్ధాంతాలు, పనితీరుపై అవగాహన కల్పించేందుకు, బీజేపీని సంస్థాగతంగా సీమాంధ్రలో బలపర్చేందుకు పలు సూచనలు చేశారు. అలాగే బీజేపీని బలపర్చేందుకుగల అనేక మార్గాలు, ఆలోచనలు, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు కాంగ్రెస్, ఇతర పక్షాలు చేస్తున్న దుష్ర్పచారం పైన అవగాహన కల్పించారు.
తొలిరోజు శిక్షణ తరగతులకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు, రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, పైడికొండల మాణిక్యాలరావు, నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యేలు ఆకుల సత్యనారాయణ, విష్ణుకుమార్‌రాజు, మాజీ ఎంపీలు కన్నా లక్ష్మీనారాయణ, ఎర్నేని సీతాదేవి, మాజీ మంత్రులు పురందేశ్వరి, మారెప్ప, జిల్లా పార్టీ అధ్యక్షులు వేటుకూరి సూర్యనారాయణ రాజు, జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, పైడా సత్యమోహన్, మాలకొండయ్య, వత్సవాయి వరహాల బాబు, జిల్లా ఇన్చార్జి తిరుపతిరావు, ఆల్డా చైర్మన్ యాళ్ళ దొరబాబు, శ్రీకాకుళం, రాయలసీమ, గుంటూరు జిల్లాల మాజీ జెడ్పీ చైర్మన్లు, ప్రత్తిపాడు నియోజకవర్గ కన్వీనర్ సింగిలిదేవి సత్తిరాజు, జగ్గంపేట, గండేపల్లి మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా శిక్షణను ప్రారంభించేందుకు ఆదిత్య కళాశాలకు వచ్చిన కేంద్రమంత్రి వెంక య్యనాయుడికి విద్యాసంస్థల చైర్మన్, వైస్చైర్మన్లు ఎన్. శేషారెడ్డి, సతీష్‌రెడ్డి స్వాగతం పలికారు.