సీబీఐ విచారణకు హాజరైన ఎస్పీ త్యాగి
న్యూఢిల్లీ : అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాఫ్టర్ల కుంభకోణం కేసుకు సంబంధించి మాజీ వాయుసేన చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్పీ త్యాగి సోమవారం ఉదయం సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఈ విచారణ జరుగుతోంది. త్యాగి వివరణను సీబీఐ రికార్డు చేయనుంది. హెలికాఫ్టర్ల కొనుగోలులో త్యాగి ముడుపుపుల అందుకున్నట్లు ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు సీబీఐ శుక్రవారం నోటీసులు జారి చేసింది.
అలాగే ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ వైమానిక దళాధికారి జేఎస్ గుజ్రాల్‌ను కూడా సీబీఐ అధికారులు విచారణ చేశారు. మరోవైపు త్యాగి సోదరుడితో పాటు ఆయన ఇద్దరి బంధువులను కూడా సీబీఐ విచారణ చేపట్టనుంది. కాగా భారత ప్రభుత్వం మన్మోహన్సింగ్ ప్రధానిగా ఉన్నపుడు ఉన్నతస్థాయి రాజకీయ నేతల వినియోగం కోసం 2010లో రూ. 3,600 కోట్లతో 12 హెలికాప్టర్ల కొనుగోలుకు ఆదేశమిచ్చింది. ఆ చాపర్లను అగస్టావెస్ట్‌ల్యాండ్ సరఫరా చేసింది.
దాని మాతృ సంస్థ ఫిన్మెక్కానికా ఇటలీలో ముడుపులు చెల్లించిందన్న ఆరోపణలన్నాయి. దర్యాప్తులో భారత్‌లోనూ ముడుపులు చెల్లించినట్లు ఆరోపణలు తోడయ్యాయి. భారత అధికారులు అగస్టా చాపర్లను ఎంపిక చేసేలా బ్రిటిష్ వ్యాపారవేత్త మైఖేల్‌తో పాటు, స్విస్-ఇటలీ దేశస్తుడైన గౌడో హష్కేలు ప్రభావితం చేశారని ఇటలీ కోర్టులో ఆ దేశ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. అగస్టా భారత అధికారులకు రూ. 330 కోట్ల మేర ముడుపులను చేరవేసేందుకు బ్రిటిష్ వ్యాపారి మైఖేల్‌ను కన్సల్టెంట్‌గా నియమించుకుందని పేర్కొన్నారు.