Aluri sambasivareddy
-
'పాఠశాల తీరుని బట్టి గ్రేడింగ్ ఇస్తాం'
సాక్షి, విజయవాడ : ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ఫీజులు నియంత్రిస్తామని ప్రాథమిక విద్యా కమిషన్ కార్యదర్శి ఆలూరి సాంబ శివారెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే అన్ని జూనియర్ కాలేజీలు, ప్రైవేట్ పాఠశాలల్లో తనికీలు నిర్వహిస్తామని తెలిపారు. పాఠశాల తీరుని బట్టి గ్రేడింగ్ నిర్ణయిస్తామని, మెరుగయిన సదుపాయాలు ఉన్నాయో లేదో పరిశీలిస్తామని తెలిపారు. ఫీజుల నియంత్రణ కోసం శాస్త్రీయ విధానం రూపొందిస్తామని పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలపై కమిషన్‌లో ప్రత్యేక గ్రీవెన్సు సెల్ ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. -
ఎమ్మెల్యే దంపతుల ఆధ్వర్యంలో వరుణయాగం
సాక్షి, శింగనమల: వరుణుడి కరుణ కోసం శింగనమలలోని ఆత్మారామాలయంలోని తలంబ్రాల మండపంలో శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆధ్వర్యంలో గురువారం వరుణయాగాన్ని ప్రారంభించారు. నాలుగు రోజుల పాటు ఈ యాగాన్ని నిర్వహించనున్నారు. ముందుగా గ్రామ దేవతలకు పూజలు చేశారు. బొడ్రాయికి పూజలు చేసి 101 బిందెలతో జలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఉడిపి నుంచి వచ్చిన వేద పండితులు వరుణయాగాన్ని ప్రారంభించారు. హోమం నిర్వహిస్తున్న వేద పండితులు పంచగవ్య సిద్ధి, పుణ్యాహ వచనం, పర్జన్య జపం, కంకణ బంధనం, గుణయాగం, నవగ్రహ హోమం, నవగ్రహ జపం, రుత్విక్ యాగం చేశారు. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆలూరి సాంబశివారెడ్డి దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలంతా సంతోషంగా ఉండాలని ప్రార్థించారు. తరలివచ్చిన భక్తజనం శింగనమలలో నిర్వహిస్తున్న వరుణయాగానికి శింగనమల, గార్లదిన్నె, బీకేఎస్, నార్పల, పుట్లూరు, యల్లనూరు మండలాలతో పాటు జిల్లా కేంద్రం నుంచి కూడా భారీగా భక్తులు తరలివచ్చారు. -
పోటా పోటీగా రాతిదూలం పోటీలు
గార్లదిన్నె : మండల పరిధిలోని కల్లూరులో శ్రీరామ నవమిని పురస్కరించుకొని గురువారం గ్రామస్తులు ఆధ్వర్యంలో ఎగువపల్లి వద్ద రాష్ట్రస్థాయి రాతిదూలం లాగుపోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో 16 జతల ఎద్దులు పాల్గొన్నాయి. పోటీలను వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి, జిల్లా వైఎస్సార్సీపీ నాయకులు అమరేంద్రనాథ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ ప్రదీప్‌రెడ్డి ప్రారంభించారు. పోటీల్లో అనంతపురముకు చెందిన ఆచారి ఎద్దులు మొదటి స్థానంలో, పెద్దవడుగూరుకు చెందిన దస్తగిరి, అనిమిరెడ్డి ఎద్దులు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. విజేతలకు వరుసగా రూ.25 వేలు, రూ.20 వేలు, రూ.15 వేలు ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు లక్ష్మినారాయణ, బృందావన్ రామాంజనేయులు, కేశవయ్య, నియోజకవర్గ ప్రచార కార్యదర్శి నరేంద్ర, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, చీమల రామక్రిష్ణ, తిరుపాల్, చితంబరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీలో కుల ప్రస్తావనే లేదు
అనంతపురం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ కుల ప్రస్తావన రాలేదని ఆపార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి అన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆలూరి సాంబశివారెడ్డి స్పందించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. జేసీకి కులపిచ్చి ఉండడంతోనే తెరపైకి తెచ్చారని ఆరోపించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అన్ని వర్గాల అభివృద్ధికీ పాటు పడ్డారని గుర్తు చేశారు. అదే అభిమానం, నమ్మకంతోనే ఆయన ఆశయాలు కొనసాగిస్తారని అన్ని వర్గాలు ప్రజలూ జగన్మోహన్రెడ్డికి అండగా నిలుస్తున్నాయన్నారు. ఆయనలా పదవులు, కాంట్రాక్ట్‌లను ఆశించిన వారెవరూ లేరన్నారు.నిజంగా వైఎస్ కుటుంబంతో జేసీ వ్యక్తిగతంగా అనుబంధం ఉంటే ఇళ్లవద్ద ఎలాగైనా మాట్లాడాలని, బహిరంగ సమావేశాల్లో ఇలా మాట్లాడడం తగదన్నారు.ఇలానే వ్యహరిస్తే ప్రజలు తిరగబడతారన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. అదేదో రాయలసీమ రెడ్డి కులస్తులకు ప్రతినిధి అన్నట్లు మాట్లాడడం కూడా సరికాదన్నారు. -
ఆయకట్టు దారులంటే నిర్లక్ష్యమా?
– శింగనమల నియోజకవర్గ వైఎస్సార్సీపీ నేత ఆలూరి సాంబశివారెడ్డి అనంతపురం : ఆయకట్టు దారుల పట్ల అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ నియోజకవర్గ నేత ఆలూరి సాంబశివారెడ్డి విమర్శించారు. శనివారం స్థానిక ఆర్టీసీ బస్టాండు సమీపంలోని ఎస్ఆర్ఐటీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. హెచ్ఎల్సీ కింద శింగనమల నియోజకవర్గం పరిధిలో సుమారు 55 వేల ఎకరాలు సాగు చేస్తున్నారన్నారు. గతేడాది నీరు ఇవ్వకపోవడంతో భూములన్నీ బీళ్లుగా మారాయన్నారు. ఈసారి అదే పరిస్థితి ఉందని, నీళ్లు అందుబాటులో ఉన్నా ఎందుకివ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. ఆయకట్టుదారులతో కలిసి కలెక్టరేట్ ఎదుట గత నెలలో ధర్నా కూడా చేశామని గుర్తు చేశారు. తుంగభద్ర కాకుండా శ్రీశైలం నుంచి కష్ణాజలాలు కూడా హంద్రీ–నీవా ద్వారా దాదాపు 6 టీఎంసీలు నీళ్లు అదనంగా వచ్చాయన్నారు. ఆ నీటిని వదిలినా ఆయకట్టు రైతులు పంటలు సాగుచేసుకునేందుకు వీలవుతుందన్నారు. కష్ణా జలాలు మరో 10 టీఎంసీలు జిల్లాకు వస్తాయని ప్రజాప్రతినిధులు చెబుతున్నారని, మరి అందుబాటులో ఉన్న 6 టీఎంసీల నీళ్లు ఎందుకు నిల్వ ఉంచారని ప్రశ్నించారు. మొత్తం నీటిని స్టోరేజీ చేసి కుప్పం తరలించేందుకు కుట్ర పన్నారా? అనే అనుమానాలను వ్యక్తం చేశారు. హక్కుగా రావాల్సిన నీటిని ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. రైతులు ఇబ్బందులు పడుతుంటే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నోరు మెదపకపోవడం బాధాకరమన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు రామ్మోహన్‌రెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు నాగలింగారెడ్డి, డీసీఎంఎస్ ఉపాధ్యక్షుడు జయరామిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ కొండన్న, మాజీ సర్పంచు నారాయణస్వామి, యువజన విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి గువ్వల శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. -
సాగునీటి కోసం పోరుబాట
మాట్లాడుతున్న వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలూరి సాంబశివారెడ్డి గార్లదిన్నె : మిడ్ పెన్నార్ (ఎంపీఆర్) డ్యాం కింద ఉన్న ఆయకట్టు భూములకు ఈ సంవత్సరం సాగునీటిని విడుదల చేయాలని వైఎస్సార్సీపీ పోరుబాట పట్టింది. ఇందులో భాగంగానే శుక్రవారం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నాకు సిద్ధమైంది. మంగళవారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలూరి సాంబశివారెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. ధర్నా కార్యక్రమంలో మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. రెండేళ్లుగా ఆయకట్టుకు నీరు రాకపోవడంతో శింగనమల నియోజక వర్గంలోని గార్లదిన్నె, శింగనమల, నార్పల, బుక్కరాయసముద్రం, పుట్లూరు, యల్లనూరు మండలాల్లో ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అలాగే మిడ్ పెన్నార్ డ్యాంలో నీళ్లు ఉన్నా ఆయకట్టుకు నీరు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రస్తుతం అధికార బలం ఉన్నవాళ్లే నీళ్లు తీసుకెళ్లే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్నే ప్రభుత్వ విప్ యామినీబాల పబ్లిక్ సమావేశాల్లో బలమున్న వాళ్లే నీరు తీసుకొనిపోతున్నారని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఆయకట్టు రైతుల బాధ అధికార పార్టీ నేతలకు పట్టడం లేదని ఆరోపించారు. వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ సుధాకర్‌రెడి,్డ అనంతపురము మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ నారాయణరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు సుబ్బిరెడ్డి, నియోజకవర్గ ప్రచార కార్యదర్శి నరేంద్రరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రమణరెడ్డి,కొండూరు కేశవరెడ్డి, జంబులదిన్నె సొసైటీ ఉపాధ్యక్షులు ఈశ్వరయ్య, బండిఆంజనేయులు, నారపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏం ఒరగబెట్టారని వస్తున్నారు బాబూ
- నియోజకవర్గంలో సాగు, తాగు నీటిపై స్పష్టమైన హామీ ఇవ్వాలి - లేదంటే సీఎం పర్యటనను అడ్డుకుంటాం - వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ నాయకులు ఆలూరి సాంబశివారెడ్డి అనంతపురం : శింగనమల నియోజకవర్గానికి ఏం ఒరగబెట్టారని ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నారో చంద్రబాబు చెప్పాలని వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ నాయకులు ఆలూరి సాంబశివారెడ్డి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఈనెల 6న బుక్కరాయసముద్రంలో పర్యటిస్తున్న నేపథ్యంలో గురువారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రుణమాఫీ ఏ మేరకు చేశారో చంద్రబాబే చెప్పాలన్నారు. రుణమాఫీ చేసిన సొమ్ము వడ్డీలకు కూడా సరిపోలేదన్నారు. రూ. 2–3 వడ్డీకి తెచ్చుకుని బ్యాంకుల్లో రెన్యూవల్ చేసుకున్నారన్నారు. కొత్త అప్పులు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. పంటల పెట్టుబడులకు ప్రైవేటుగా అప్పులు చేశారన్నారు. వీటిపై నియోజకవర్గంలోని ఆరు మండలాల రైతులకు ఏం సమాధానం చెబుతారో చెప్పాలని డిమాండ్ చేశారు. డ్వాక్రా రుణాలు ఎవరూ కట్టొద్దని అన్నీ మాఫీ చేస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిన మాటలను నమ్మి ఓట్లేస్తే.. ఈరోజు ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదని మహిళలు వాపోతున్నారన్నారు. మోసపోయిన మహిళలకుS ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. బ్యాంకుల్లో కుదవపెట్టిన బంగారు బయటకు రావాలంటూ బాబు అధికారంలోకి రావాలంటూ ప్రచారాలు చేశారని, ఈరోజు ఒక్క మహిళ బంగారు కూడా విడిపించలేదన్నారు. చివరకు బ్యాంకుల నుంచి వేలం నోటీసులు వచ్చాయన్నారు. ఆ మహిళలకు ఏం సమాధానం చెబుతారని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. జాబు కావాలంటే బాబు రావాలని ఊదరగొట్టారని, కానీ రెండేళ్లు దాటినా ఒక్క ఉద్యోగమైనా ఇచ్చావా? అని చంద్రబాబును ప్రశ్నించారు. శింగనమల నియోజకవర్గంలో వేలాదిమంది ఉన్నత చదువులు చదివిన నిరుద్యోగులు ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారన్నారు. వారికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. వీటికితోడు నియోజకవర్గంలో తాగు, సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ, ఈ సమస్య తీర్చలేని చంద్రబాబు నియోజకవర్గంలో ఎలా పర్యటిస్తున్నారని ప్రశ్నించారు. ఆయకట్టుకు సంబంధించి రెండేళ్లుగా చుక్క నీరు రాకపోవడంతో రైతులు తమ భూములన్నీ బీళ్లు పెట్టారన్నారు. వెనుకబడిన అనంత జిల్లాకు కేంద్రం మంజూరు చేసిన రూ. 50 కోట్లు ఎక్కడ ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ, జిల్లా ప్రజల సమస్యలపై స్పష్టమైన హామీ ఇవ్వకపోతే ముఖ్యమత్రి పర్యటనను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. సమావేశంలో యువజన విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి చంద్రమోహన్, పుట్లూరు మండల కన్వీనర్ రాఘవరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు వెంకటరామిరెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా ప్రధానకార్యదర్శి బాబాసలాం తదితరులు పాల్గొన్నారు.