‘ఉమా’ఉన్నంత కాలం నీళ్లు రావు
♦ మంత్రికి అవగాహన లేకే కృష్ణా బోర్డులో వాదన వినిపించలేదు
♦ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి
కడప కార్పొరేషన్: రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రిగా దేవినేని ఉమామహేశ్వరరావు ఉన్నంత కాలం రాయలసీమకు మేలు జరగదని, సాగునీరు రావడం కష్టమేనని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి విమర్శించారు. శనివారం స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా, మేయర్ సురేష్‌బాబుతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాయలసీమలోని జీఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్, తెలుగుగంగ వంటి ప్రాజెక్టులకు నీరందించడానికి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచాలని అప్పటి సీఎం వైఎస్సార్ నిర్ణయించిన నేపథ్యంలో.. దానికి వ్యతిరేకంగా ఉమా నాడు ధర్నా నిర్వహించారని, ప్రస్తుతం ఆయనే మంత్రిగా ఉన్నందున రాయలసీమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఇక్కడి రైతుల్లో లేదన్నారు. నదీ జలాల విషయంలో ఎక్కువ శాతం నీటిని తెలంగాణ రాష్ట్రం వాడుకుంటూ కూడా ఢిల్లీలో జరిగిన కృష్ణాబోర్డు ఎదుట తమకు అన్యాయం జరిగిందని వివరించిందన్నారు. తెలంగాణ ఇరిగేషన్ మంత్రి హరీష్‌రావు సమగ్ర అవగాహనతో బోర్డు మీటింగ్‌కు హాజరు కాగా, ఏపీ మంత్రి మాత్రం అవగాహన లేకుండా వెళ్లినట్లు తెలుస్తోందన్నారు.
శ్వేతపత్రం విడుదల చేయాలి
ఉత్తరాంధ్ర, రాయలసీమలో ఉన్న జనాభా నిష్పత్తి ఆధారంగా డెరైక్టరేట్, సెక్రటేరియేట్‌లోని అన్ని శాఖల్లో ఉద్యోగాలు ఇవ్వాలని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలిగొండ ప్రాజెక్టుల గురించి బోర్డు మీటింగ్‌లో ఒక్క మాట కూడా మాట్లాడకోవడం దారుణమన్నారు.
అవే తప్పులు చేస్తున్న ప్రభుత్వం
విభజన సమయంలో జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని, ఈనాటికీ ఆ ఊసే లేదని కడప ఎమ్మెల్యే ఎస్బీ అంజద్‌బాషా అన్నారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని కేంద్రాన్ని నిలదీయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. సమావేశంలో నగర అధ్యక్షుడు నిత్యానందరెడ్డి పాల్గొన్నారు.