Ammamma Gari Illu
-
అమ్మమ్మగారి ఇల్లు అనుబంధాల హరివిల్లు
అతిథితో కాసేపు... ‘ఆప్యాయతలు.. అనుబంధాలంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. నేను పెరిగిన వాతావరణం అలాంటిది. అమ్మ ప్రోత్సాహంతోనే సినిమా రంగంలో రాణిస్తున్నా. 12 ఏళ్ల ప్రయాణంలో ఎంతో నేర్చుకున్నా. ఆనంద క్షణాల్ని గుర్తుచేసుకుంటూ ప్రస్తుత కాలాన్ని గడపాలనే చిన్నలైన్ ఆధారంగానే ‘అమ్మమ్మగారి ఇల్లు’ సినిమా తీశా’ అంటూ బోలెడు ముచ్చట్లు చెప్పారు చిత్ర దర్శకుడు సుందర్ సూర్య. కథా చర్చల కోసం నగరానికి వచ్చిన ఆయన్ని ‘సాక్షి’ పలకరించింది. విశాఖతో తన అనుబంధాన్ని వివరించారు సుందర్. మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే... – ఏయూక్యాంపస్(విశాఖ తూర్పు) అమ్మ ప్రోత్సాహం... చిన్నతనం నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. అందుకే సినీరంగాన్ని ఎంచుకున్నా. కుటుంబంలో పెద్దన్నయ్య ప్రభుత్వ ఉద్యోగి, చిన్నన్నయ్య వ్యాపారి. నాకు నచ్చిన రంగంలో రాణించాలని అమ్మ మణి ప్రోత్సహించింది. నా నమ్మకం అదే... మనసుకు నచ్చిన పనిచేయడంలో ఉన్న ఆనందం మరెక్కడా ఉండదు. దీనిని నేను బలంగా విశ్వసిస్తాను. అందుకే చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవాలనే బలమైన కాంక్షతో ముందుకు సాగా. ‘అమ్మమ్మగారి ఇల్లు’ చిత్రీకరణ నా బలమైన ఆకాంక్షను సాకారం చేసింది. ఆనంద క్షణాల్ని గుర్తుచేసుకుంటూ ప్రస్తుత కాలాన్ని గడపాలనే చిన్న లైన్‌ను ఆధారంగా చేసుకుని సిద్ధం చేసిన కథే ఇది. నటుడు రావు రమేష్‌కు సీన్ వివరిస్తూ సినిమా కోసం కాకినాడ నుంచి విశాఖకు... పిఠాపురంలో శివదుర్గా థియేటర్ మా మావయ్యది. చిన్నతనం నుంచి అక్కడ సినిమాలు చూడటం అలవాటైంది. డిగ్రీ చదివే రోజుల్లో విశాఖకు సినిమా చూసేందుకు వచ్చేవాడ్ని. ఉదయం కాకినాడ ప్యాసింజర్‌లో నగరానికి వచ్చి.. మధ్యాహ్నం భోజనం చేసి చిత్రాలయ థియేటర్లో సినిమా చూసి సాయంత్రం అదే పాసింజర్లో తిరిగి కాకినాడ వెళ్లేవాడ్ని. ఈ ఒక్క మాట చాలు నాకు సినిమాలంటే ఎంత ఆసక్తో చెప్పేందుకు..! కథలు రెడీ చేస్తున్నా.. ప్రస్తుతం యాక్షన్ థ్రిల్లర్, రొమాంటిక్, కామెడి కథల్ని సిద్ధం చేసుకుంటున్నాను. త్వరలో యూత్–యాక్షన్ ప్రధానంగా సాగే కథను సిద్ధం చేస్తున్నా. నా కథల్లో భావోద్వేగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తా. ప్రతీ మనిషిని కట్టిపడేసేది అనుబంధాలే. వీటికే అధిక ప్రాధాన్యం. పుష్కరకాలంగా... చిత్రపరిశ్రమలో 12 ఏళ్లుగా పనిచేస్తున్నాను. జి.నాగేశ్వరరెడ్డి, ఎన్.శంకర్, బొమ్మరిల్లు భాస్క ర్ల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను. టీవీ సీరియల్స్, పలు ప్రకటనలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను. అనంతరం పూర్తిస్థాయిలో దర్శకుడిగా మారాలని నిర్ణయించుకున్నాను. ‘అమ్మమ్మగారి ఇల్లు’ నా తొలి ప్రయత్నం. కుటుంబ సంబంధాల నేపథ్యంలో తెరకెక్కించాను. ‘సిరివెన్నెల’ శైలి చాలా ఇష్టం... ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి రచనా శైలి నాకు చాలా ఇష్టం. నేను చెప్పాలనుకున్న కథని ఆయన కేవలం తన పాటలో రెండు చరణాలతో చెప్పేస్తారు. అందుకే తొలి చిత్రానికి ఆయనతో పట్టుబట్టి, ఒప్పించి మరీ పాట రాయించుకున్నా. విశాఖ.. ఓ సెంటిమెంట్.. చిత్రపరిశ్రమకు అనుకూలమైన పరిస్థితులు విశాఖలో ఉన్నాయి. అదే విధంగా విశాఖలో చిత్రీకరణ చేసుకున్న ప్రతీ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకం చిత్ర పరిశ్రమలో ఉంది. వచ్చే నాలుగేళ్లలో చిత్రపరిశ్రమ నగరానికి వచ్చేస్తుందని నా నమ్మకం. కథలో బలం ఉంటే చాలు... తెలుగు నటులు కొత్తగా ఆలోచిస్తున్నారు. కేవలం కథను నమ్మి అవకాశాలు ఇస్తున్నారు. నూతన దర్శకుడైనా కథలో బలం ఉంటే వారు చేయడానికి వెంటనే ఆసక్తి చూపుతున్నారు. ఇది చాలా మంచి పరిణామం. ఈ చిత్రం నాకు విజయాన్నిస్తే, తరువాత చిత్రం నాకు బోనస్‌గా భావిస్తా. -
‘అమ్మమ్మ గారిల్లు’ మూవీ రివ్యూ
టైటిల్ : అమ్మమ్మగారిల్లు జానర్ : ఫ్యామిలీ ఎంటర్టైనర్ తారాగణం : నాగశౌర్య, షామిలి, రావు రమేశ్, శివాజీ రాజా, సుమిత్ర, సుధ, హేమ తదితరులు సంగీతం : కళ్యాణ్ రమణ దర్శకత్వం : సుందర్ సూర్య నిర్మాత : రాజేశ్ ఛలో సినిమాతో సక్సెస్ అందుకున్న యువహీరో నాగశౌర్య. ఈ కుర్ర హీరో ఛలో లాంటి మాస్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ తరువాత తన తదుపరి చిత్రంగా కుటుంబ నేపథ్యంలో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వేసవి సెలవుల్లో అందరూ అమ్మమ్మ గారింటికి వెళ్తారు. అయితే నాగశౌర్య ఈ వేసవిలో ‘అమ్మమ్మ గారిల్లు’కు వచ్చేలా చేశాడో లేదో తెలుసుకుందాం. కథ : రంగారావు (చలపతి), సీతా మహాలక్ష్మి (సుమిత్ర) గారిది పిఠాపురంలో ఓ పెద్ద కుటుంబం. వీరికి ఐదుగురు సంతానం. ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. పెద్ద కొడుకు (రావు రమేశ్) తండ్రిని ఆస్తి పంచమని అడుగుతూ ఉంటాడు. ఆస్తి కంటే అనుబంధాలు గొప్పవి, ఆస్తిని విడగొడితే అందరూ దూరమవుతారని కొడుక్కు నచ్చజెపుతాడు తండ్రి. కానీ బాబురావు(రావు రమేశ్) వినడు. అలా ఓసారి జరిగిన గొడవలో ఆ ఇంటి పెద్దల్లుడు (సుమన్)ను చేయిజేసుకుంటాడు బాబురావు. ఆ అవమానంతో సుమన్ తన మామగారి కుటుంబానికి దూరంగా ఉంటారు. అల్లుడు గారికి జరిగిన అవమానం, కొడుకు ఆస్తి కోసం చేసే అల్లరితో చలపతి చనిపోతాడు. కొడుకులు, కూతుళ్లు అందరూ సీతామహాలక్ష్మిని ఒంటరిగా వదిలేసి వెళ్లిపోతారు. చిన్నప్పటి నుంచి సుమన్ కొడుకు సంతోష్ (నాగశౌర్య)కు మాత్రం అమ్మమ్మ అంటే చాలా ఇష్టం. అయితే ఈ గొడవలన్నింటికి కారణమైన ఆస్తిని ఎవరు పంచారు? ఎప్పుడు పంచారు? తిరిగి వీరంతా ఎలా కలుసుకుంటారు? వీటన్నింటికి హీరో చేసిన పనులేంటి అనేదే కథ. నటీనటులు : ఎప్పటిలాగే నాగశౌర్య అందంగా కనిపించాడు. నిజంగా ఇంట్లో మనవడిలా అనిపిస్తాడు. అమ్మమ్మ బాధల్ని తీర్చే మంచి మనవడిగా, కుటుంబాన్ని కలిపే పెద్దమనిషిగా నటిస్తూ మెప్పించాడు. షామిలీ ఓయ్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చినా... మళ్లీ ఇన్నేళ్ల తరువాత ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. తన పాత్ర మేరకు ఉన్నంతలో అందంగానూ కనిపించారు. ప్రేక్షకులకు నచ్చేలాను నటించారు. రావు రమేశ్ నటనకు పేరు పెట్టలేం. మళ్లీ తన విశ్వరూపాన్ని చూపించారు. (సాక్షి రివ్యూస్) నాగశౌర్య తరువాత ఈ సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది రావు రమేశ్ పాత్ర గురించే. ఇలాంటి పాత్రల్లో నటించడం ఆయనకు కొత్తేంకాదు. అమ్మమ్మగా చేసిన సుమిత్ర కంటతడి పెట్టించారు. మిగతా పాత్రల్లో శివాజీ రాజా, హేమ, షకలక శంకర్, సుధా, సుమన్ అందరూ తమ పరిధి మేరకు నటించారు. విశ్లేషణ : అమ్మమ్మ గారిల్లు అని టైటిల్ చూసిన ప్రతి ఒక్కరికి కథేంటో అర్థమైపోతుంది. అయితే ఇలా అందరూ ఊహించే కథే అయినా.. సరిగా ప్రజెంట్ చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు అని నమ్మిన దర్శక నిర్మాతల గురించి మొదట చెప్పుకోవాలి. కొన్ని పదునైన మాటలతో మనసును తాకేలా చేశారు డైరెక్టర్ సుందర్ సూర్య. తులం బంగారం కాదు గుణం బంగారం కావాలి లాంటి మంచి మాటలు సినిమాలో బాగానే ఉన్నాయి. బరువైన బంధాలను అంతే బరువైన సంభాషణలతో నడిపించాడు. కథలో ఏ మాత్రం కొత్తదనం కనపడకపోయినా... కథకు ఇచ్చిన ట్రీట్మెంట్ వర్కౌట్ అయ్యేలా ఉంది. సెకండాఫ్‌లో ‘లాక్ ది ఏజ్’ అనే ఎపిసోడ్ కాసేపు నవ్వించి, కాసేపు ఏడిపించేసింది. ఆ ఎపిసోడ్ సినిమాకు కలిసొచ్చే అంశమే. (సాక్షి రివ్యూస్) ఈ విషయాల్లో డైరక్టర్ సక్సెస్ సాధించారు. తరువాతి అంశంగా సంగీతం గురించి చెప్పుకోవాలి. హీరోకు, హీరోయిన్‌కు అనవసరమైన ఇంట్రడక్షన్ సాంగ్స్ పెట్టకుండా.. ఉన్న రెండు మూడు పాటలు కూడా అలా కథతో పాటు వచ్చి వెళ్తాయి. రసూల్ అందించిన సినిమాటోగ్రఫీలో హీరో హీరోయిన్లు అందంగా కనిపించారు. ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. నాలుగు ఫైట్లు, ఐదు పాటలు, ఆరు మాస్ డైలాగ్‌లు లాంటి సినిమా కాదిది. ఈ బిజీ లైఫ్‌లో మనం ఏం కోల్పోతున్నామో తెలుసుకోవాలంటే.. చూడాల్సిన సినిమా. అయితే రెగ్యులర్ మాస్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. బలాలు : నాగశౌర్య, రావు రమేశ్ నటన సంగీతం కొన్ని డైలాగ్‌లు బలహీనతలు : కథలో కొత్తదనం లోపించడం ముగింపు : ఈ వేసవి సెలవుల్లో ‘అమ్మమ్మ గారిల్లు’ ను ఓసారి వెళ్లిచూడొచ్చు. - బండ కళ్యాణ్, ఇంటర్నెట్ డెస్క్ -
జీవితంలో కలిసి రావాలంటే కూతుర్ని కనాలి
-
‘అమ్మమ్మ గారిల్లు’ ట్రైలర్ విడుదల
కుటుంబ కథా చిత్రాలు, ఫ్యామిలీ ఎమోషన్స్, బంధాలు అనుబంధాల కాన్సెప్ట్‌తో సినిమా అంటే ప్రస్తుతం ప్రేక్షకుల ఆదరణ లభిస్తోంది. దీనికి ఉదాహరణే గతేడాది వచ్చిన శతమానం భవతి. ఈ సినిమా ఏకంగా జాతీయ అవార్డును సాధించింది. నాగశౌర్య హీరోగా నటిస్తున్న అమ్మమ్మ గారిల్లు కూడా కుటుంబం, ఎమోషన్స్ లాంటి ఫార్మాట్లోనే ఉండబోతోంది. ఈ సినిమా టీజర్, సాంగ్స్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా విడుదలైన అమ్మమ్మగారిల్లు సినిమా ట్రైలర్‌ను చూస్తే.. ఈ సినిమా కథను ఎవరైనా ఊహించవచ్చు. అయితే అందరికీ తెలిసిన కథే అయినా... తీసే విధానం, స్ర్కీన్ ప్రజెంటేషన్‌తో సినిమాను ప్రేక్షకుల మదిలోకి తీసుకెళ్లవచ్చు. ఈ ట్రైలర్లో.. జీవితంలో కలిసి రావాలంటే కూతుర్ని కనాలి... తెలిసిరావాలంటే కొడుకును కనాలి అంటూ రావు రమేశ్ చెప్పిన డైలాగ్‌లు బాగానే ఉన్నాయి. నాగశౌర్య, షామిలి జంటగా నటించిన ఈ సినిమాను స్వాజిత్ బ్యానర్‌పై రాజేశ్ నిర్మించగా... సుందర్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. ‘అమ్మమ్మ గారిల్లు’ సినిమా రేపు (మే 25) విడుదల కాబోతోంది. -
‘అమ్మమ్మ గారిల్లు’ సెన్సార్ పూర్తి
ఛలో సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు నాగశౌర్య. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో .. ఈ యువహీరో ఆచితూచి కథలను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం నాగశౌర్య ‘అమ్మమ్మ గారిల్లు’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఓయ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన షామిలి మళ్లీ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవలే విడుదల చేసిన అమ్మమ్మ గారిల్లు టీజర్, పోస్టర్స్, లిరికల్ సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాగా ఉండబోతోందని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు క్లీన్ యూ సర్టిఫికేట్‌ను జారీ చేసింది . స్వాజిత్ బ్యానర్‌పై రాజేశ్ ఈ చిత్రాన్ని నిర్మించగా, సుందర్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ మే 25న విడుదలవుతోంది.