anantha premiur league
-
క్వార్టర్స్‌కు నార్పల, మడకశిర
- అనంత ప్రీమియర్ లీగ్ పోటీల్లో సత్తా అనంతపురం సప్తగిరిసర్కిల్ : జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఆర్డీటీ సహకారంతో స్థానిక అనంత క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న అండర్–16 బాలుర అనంత ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు ఆదివారం రసవత్తరంగా సాగాయి. క్రికెట్ పోటీల్లో నార్పల, మడకశిర జట్లు నాకౌట్ స్థాయి నుంచి క్వార్టర్‌కు చేరాయి. కాగా ఇప్పటికే ఆర్డీటీ అకాడమీ, కదిరి, ఆత్మకూరు, ధర్మవరం, గుంతకల్లు, కణేకల్లు జట్లు క్వార్టర్స్‌కు చేరిన విషయం తెలిసిందే. అయితే తాజాగా నార్పల, మడకశిర జట్లు క్వార్టర్స్‌కు చేరాయి. మ్యాచ్ వివరాలు విన్సెంట్ క్రీడా మైదానంలో పెనుకొండ, నార్పల జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన నార్పల జట్టు 38.3 ఓవర్లలో 227 పరుగులకు ఆలౌటైంది. జట్టులో విజయకృష్ణ (73) రాణించారు. పెనుకొండ బౌలర్లు బాబా ఫకృద్దీన్, ఖాదర్ తలా 4 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పెనుకొండ జట్టు 26.3 ఓవర్లలో 77 పరుగులకే కుప్పకూలింది. నార్పల జట్టు బౌలర్లు లక్ష్మీకాంత్ 4, విష్ణువర్ధన్ 3 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. అదేవిధంగా బీ గ్రౌండ్లో ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ మడకశిర, తాడిపత్రి జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన మడకశిర జట్టు 42 ఓవర్లలో 227 పరుగులు చేసింది. జట్టులో భీమానాయక్ (61), అల్తాఫ్ (51) అర్ధశతకాలతో రాణించారు. తాడిపత్రి జట్టులో రమేష్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన తాడిపత్రి నిర్ణీత 45 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసి ఓడింది. జట్టులో లక్ష్మణ్‌కుమార్ (96) త్రుటితో సెంచరీ మిస్సయ్యాడు. వచ్చే ఆదివారం క్వార్టర్స్ మ్యాచ్‌లు నిర్వహించనున్నట్టు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి బీఆర్ ప్రసన్న తెలిపారు. క్వార్టర్స్ మ్యాచ్‌ల వివరాలు కదిరి–నార్పల ధర్మవరం–ఆత్మకూరు గుంతకల్లు–కణేకల్లు ఆర్డీటీ అకాడమీ–ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ మడకశిర -
హోరాహోరీగా అనంత ప్రీమియర్ లీగ్
అనంతపురం సప్తగిరిసర్కిల్ : అనంత క్రీడా మైదానం, గుంతకల్లులోని రైల్వే క్రికెట్ మైదానంలో ఆదివారం నిర్వహించిన అనంత ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు హోరాహోరీగా సాగాయి. అనంత క్రీడా మైదానంలో నార్పల జట్టుతో మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన అనంత స్పోర్ట్స్ అకాడమీ జట్టు 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. జట్టులో జాన్ మైఖేల్ (89), రాఘవేంద్ర (69), మహేంద్రరెడ్డి (71) రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నార్పల జట్టు 31.5 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకూలింది. అనంత బౌలర్లలో భార్గవ్ 4, నవీన్ 2 వికెట్లు పడగొట్టారు. గుంతకల్లు రైల్వే క్రీడా మైదానంలో గుంతకల్లు మండల క్రికెట్ అకాడమీ, గుంతకల్లు క్రికెట్ అకాడమీ జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన గుంతకల్లు క్రికెట్ అకాడమీ జట్టు 40 ఓవర్లలో 213 పరుగులు చేసింది. జట్టులో ఆసిమ్ సెంచరీతో కదం తొక్కాడు. గుంతకల్లు మండల క్రికెట్ అకాడమీ జట్టు క్రీడాకారుడు మనోజ్ 6 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గుంతకల్లు మండల క్రికెట్ అకాడమీ జట్టు 42 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. జట్టులో అభిషేక్ 52, రియాజ్ 46 పరుగులు సాధించారు. -
అనంత ప్రీమియర్ లీగ్‌లో గుత్తి విజయం
అనంతపురం సప్తగిరిసర్కిల్ : జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఆర్డీటీ సహకారంతో నిర్వహిస్తున్న అనంత ప్రీమియర్ అండర్–16 క్రికెట్ పోటీల్లో గుత్తి జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం గుత్తి రైల్వే క్రీడా మైదానంలో గుత్తి, కొనకొండ్ల జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన కొనకొండ్ల జట్టు 92 పరుగులకే కుప్పకూలింది. గుత్తి బౌలర్ ఇమ్రాన్ 5 వికెట్లు తీసి జట్టును ఆదుకున్నాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గుత్తి జట్టు 5 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసి విజయం సాధించింది. వచ్చే ఆదివారం చివరి రౌండ్ లీగ్ పోటీలు జరుగుతాయని జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి బీఆర్ ప్రసన్న తెలిపారు. -
రసవత్తరంగా అనంత ప్రీమియర్ లీగ్ పోటీలు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : అనంతపురం జిల్లా క్రికెట్ అసోసియేషన్, ఆర్డీటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న అండర్–16 అనంత ప్రీమియర్ లీగ్ క్రికెట్ క్రీడా పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి. ఆదివారం ఆర్డీటీతో పాటు జిల్లాలోని పలు క్రీడా మైదానాల్లో ఈ పోటీలు జరిగాయి. ఆర్డీటీ బీ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో గుంతకల్లు, తాడిపత్రి జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన గుంతకల్లు 185 పరుగులు చేసింది. జట్టులో సూరి 31, సాయి 27 పరుగులు చేశారు. తాడిపత్రి జట్టులో వినయ్ 4, దీక్షత్ 2 వికెట్లు తీశారు. అనంతరం బరిలోకి దిగిన తాడిపత్రి జట్టు 27 ఓవర్లలో 71 పరుగులకే కుప్పకూలింది. గుంతకల్లు జట్టులోని సాహుల్, సాయిలు చెరీ 4 వికెట్లు పడగోట్టి జట్టు విజయానికి దోహదపడ్డారు. విన్సెంట్ మైదానంలో విశ్వనాథన్ ఆనంద్, బీకేఎస్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన విశ్వనాథన్ ఆనంద్ జట్టు 48 ఓవర్లలో 239 పరుగులు చేసింది. జట్టులో భరత్ 81, పవన్ కళ్యాణ్ 71, వీరేంద్ర 31 పరుగులు సాధించారు. బీకేఎస్ బౌలర్లలో రమేష్ 4, హరి 3 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బీకేఎస్ జట్టు 40 ఓవర్లలో 179 పరుగులు చేసి ఆలౌటైంది. జట్టులో రమేష్ 56 పరుగులు చేశారు. ఆత్మకూరు స్కూల్ మైదానంలో జరిగిన ఆత్మకూరు, కళ్యాణదుర్గం జట్లు పోటీపడ్డాయి. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆత్మకూరు జట్టు 37.4 ఓవర్లలో 158 పరుగులు చేసి ఆలౌటైంది. జట్టులో దిలీప్ 59 పరుగులు సాధించాడు. కళ్యాణదుర్గం జట్టులో ప్రశాంత్ 3 వికెట్లు తీశాడు. అనంతరం కళ్యాణదుర్గం జట్టు 30.2 ఓవర్లలో 98 పరుగులకే కుప్పకూలింది. ఆత్మకూరు జట్టులో అనిల్ 5, దిలీప్ 4 వికెట్లు పడగొట్టి జట్టు విజయానికి కీలకంగా మారారు. మరోమ్యాచ్‌లో పెనుకొండ, హిందూపురం జట్లు తలపడగా హిందూపురం జట్టు మొదట బ్యాటింగ్ చేసి 142 పరుగులు చేసింది. అనంతరం పెనుకొండ జట్టు 32.5 ఓవర్లలోనే విజయాన్నందుకుంది. జట్టులో మంజునాథ్ 49, ముదస్సిర్ 41 పరుగులు చేశారు. ఇంకో మ్యాచ్‌లో కణేకల్, రాయదుర్గం జట్లు తలపడగా మొదట రాయదుర్గం జట్టు 132 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కణేకల్ జట్టు 133 పరుగులు చేసి విజయం సాధించింది. జట్టులో హరిలాల్ నాయక్ 31 పరుగులు సాధించాడు. వచ్చే ఆదివారం కూడా మ్యాచ్‌లు కొనసాగుతాయని జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి ప్రసన్న తెలిపారు.