Angola
-
అతిపెద్ద వజ్రం..
లేత గులాబీ రంగులో మెరిసిపోతున్న ఈ రాయిని చూశారా. అది మామూలు రాయి కాదు. అరుదైన పింక్ డైమండ్. దాని ఖరీదు వందలు లేదా వేల కోట్లు ఉండొచ్చని భావిస్తున్నారు. అత్యంత విలువైన ఈ వజ్రం అంగోలాలో బయటపడింది. లులో గనుల్లోని తవ్వకాల్లో బయటపడ్డ ఈ 170 క్యారట్ల పింక్ డైమండ్ ‘ద ల్యూలో రోస్’300 ఏళ్లలో దొరికిన అతిపెద్ద వజ్రంగా లుకాపా డైమండ్ కంపెనీ చెబుతోంది. చారిత్రాత్మకమైన టైప్ ఐఐఏకు చెందిన ఈ వజ్రం అరుదైనది, అత్యంత సహజమైనది కూడా. ఇది అంగోలాను ప్రపంచవేదిక మీద ప్రత్యేకస్థానంలో నిలబెడుతుందని లులో గనుల్లో భాగస్వామి అయిన అంగోలన్ ప్రభుత్వం చెబుతోంది. దాన్ని కట్ చేసి, పాలిష్ చేస్తే.. సగం రాయి పోయినా సగం వజ్రం ఉంటుందని, అది రికార్డు స్థాయి ధరకు అమ్ముడవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. 2017లో హాంగ్కాంగ్ ప్రభుత్వం 59.6 కేరెట్ల పింక్స్టార్ వజ్రాన్ని 71.2 మిలియన్ డాలర్లు అంటే... దాదాపు రూ.570 కోట్ల రూపాయలకు అమ్మింది. అదే అత్యంత ఖరీదైన వజ్రంగా చర్రితలో మిగిలిపోయింది. ఇక 170 కేరెట్ల ‘లులో రోస్’వందలు కాదు.. వేల కోట్లు పలుకుతుందని ప్రభుత్వం భావిస్తోంది. -
ముక్కు..సూటి మనిషి..
టర్కీకి చెందిన మెహ్మత్ నిజంగానే ముక్కుసూటి మనిషి.. మీకేమైనా డౌటా.. కావాలంటే ఆయన ముక్కును చూడండి.. ఎంత పొడవుగా ఉందో.. నోస్ బ్రిడ్జి నుంచి అంటే ముక్కును ముట్టుకుంటే మనకు ఎముక ఉన్నట్లు తగులుతుందే.. అక్కడి నుంచి చివరి వరకూ లెక్కేస్తే.. 3.46 అంగుళాలు ఉన్నట్లు తేలింది. దీంతో ఇంత పెద్ద ముక్కు మరెక్కడా చూడలేదంటూ గిన్నిస్ బుక్ వారు రికార్డును కట్టబెట్టేశారట. ఊరంత నోరు.. అంగోలాకు చెందిన ఫ్రాన్సిస్కోతో మాట్లాడటమంటే చాలా కష్టం. ఎందుకంటే.. ఆయన నోరు తెరిచాడంటే మన నోరు ఆటోమేటిగ్గా మూతపడిపోతుంది.. చూశారుగా.. ఆ నోరులో ఓ ఊరును సర్దేయొచ్చు. ఫ్రాన్సిస్కో నోరు తెరిస్తే.. 6.69 అంగుళాల వెడల్పు ఉందట. అయ్యబాబోయ్ అన్న గిన్నిసోళ్లు.. వెంటనే నోర్మూసుకుని.. రికార్డు ఆయన చేతికిచ్చి వెళ్లిపోయారట. -
స్టేడియంలో తొక్కిసలాట:తీవ్ర విషాదం
లువాండా: అంగోలాలో ఓ ఫుట్ బాల్ స్టేడియంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఉత్తర అంగోలా లో ఒక స్టేడియంలో శుక్రవారం జరిగిన తొక్కిసలాటలో 17 మంది ఫుట్ బాల్ అభిమానులు మరణించారు. చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అంగోలీ దేశీయలీగ్లో జరుగుతున్న ఫుట్బాల్ మ్యాచ్ సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్తత విషాదానికి దారి తీసింది. అంగోలా ఫుట్బాల్ చరిత్రలోనే ఇది తీరని విషాదమని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటపై అంగోలా అధ్యక్షుడు జోస్ ఎడ్వర్డో డాస్ శాంటోస్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన సాయం అందించాలని అ ధికారులు ఆదేశాలు జారీచేశారు. ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. భయం అంగోలా దేశీయ లీగ్ సీజన్ లో శాంతా రీటా డి కాసియా మరియు రిక్రేయేటివో డి లిబోలో మధ్య జరుగుతున్న మ్యాచ్ సందర్భంగా ప్రేక్షకుల తాకిడి భారీగా పెరిగింది. ఒక్కసారిగా జనం ఎగబడటంతో జనవరి 4 స్టేడియం ప్రవేశద్వారం వద్ద తోపులాట చోటు చేసుకుంది. 17మంది చనిపోయారనీ, పోలీసు ప్రతినిధి ఓర్లాండో బెర్నార్డో చెప్పారు. చనిపోయిన వారిలో పిల్లలు ఎంతమంది ఉన్నారో తెలియదని తెలిపారు. గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. కాగా ఫుట్బాల్ స్టేడియంలో తొక్కిసలాటలు, మరణాలుకు సంబంధించి ఫుట్ బాల్ క్రీడది విషాద చరిత్ర అనే చెప్పాలి. 2010 ప్రపంచ కప్ ముందు ఆతిథ్య ఐవరీ కోస్ట్, మాలావి మధ్య క్వాలిఫైయర్ మ్యాచ్ సందర్భంగా జరిగిన స్టాంపీడ్లో అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. విపరీతమైన రద్దీ కారణంగా జరిగిన ఈ తొక్కిసలాటలో ముందు 19 మృతి చెందారు. 2001లో ఘనాలో అక్ర స్పోర్ట్స్ స్టేడియంలో జరిగిన దుర్ఘటనలో మరో 127మంది మరణించారు. ఓడిపోయిన జట్టు అభిమానులు రెచ్చిపోయి గలాటా సృష్టించడంతో ఉద్రిక్తత రాజుకుంది. ఈ సమయంలో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడం తొక్కిసలాటకు దారితీసింది. ముఖ్యంగా 1964లో లిమా నేషనల్ స్టేడియంలో పెరూ-అర్జెంటీనా మ్యాచ్ తొక్కిసలాట సమయంలో320 మంది మరణించారు. సుమారు వెయ్యిమందికి పైగా గాయపడ్డారు. తప్పించుకునే వీలులేక చాలామంది కాళ్లకింద నలిగిపోయి ఊపిరాడక నిస్పహాయంగా ఫుట్బాల్ అభిమానులు ప్రాణాలు కోల్పోవడం మాయని మచ్చగా మిలిగిపోయింది. ఫిఫా వరల్డ్ ర్యాంకింగ్స్లో అంగోలాది 148 ర్యాంకు. -
ఐఫోన్లు చాలా చీప్ ఎక్కడో తెలుసా?
స్మార్ట్ ఫోన్లు ఎన్ని ఉన్నా చేతిలో ఐఫోన్ ఉంటే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది. అయితే ఐఫోన్ పై మోజు పడ్డా ధర ఎక్కువ ఉంటుందని ఇతర బ్రాండ్ స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేస్తుంటారు. ప్రపంచంలో అతి తక్కువ ధరకే ఐఫోన్లు ఎక్కడ దొరుకుతాయే తెలుసా..! దీనికి సమాధానం ఆఫ్రికాలోని అంగోలా దేశం. ఇతర దేశాలతో పోల్చిచూస్తూ అంగోలావాసులు కాస్త లక్కీ అని చెప్పవచ్చు. రాకెట్ ఇంటర్నెట్ ఆన్లైన్ రీటెయిలర్ సంస్థ లినియో ఇటీవల జరిపిన టెక్నాలజీ ప్రైస్ ఇండెక్స్ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. 72 దేశాల్లో కొన్ని అధిక ధర ఉండే స్మార్ట్ ఫోన్లపై ఈ-కామర్స్ సంస్థ లియోని సర్వే చేసింది. ఈ 72 దేశాల్లో కనీసం ఐదు ప్రధాన నగరాలలో ఆన్లైన్ మార్కెట్ సంస్థలు, రిటెయిలర్లు విక్రయాలు చేస్తున్న ధరల పట్టికను పరిశీలించి ఓ నివేదికను రూపొందించింది. ఆ పట్టికను గమనించినట్లయితే అంగోలాలో ఐఫోన్ సగటు ధర రూ.401.4 డాలర్లు (సుమారు రూ.27,300) ఉండగా, భారత్లో మాత్రం 505.25 డాలర్లు(రూ.34,420) ధర ఉంది. ఆంగోలా తర్వాత జపాన్ 413.58 డాలర్లు, చైనా 470.74 డాలర్లు, ఫిన్లాండ్ 475.94 డాలర్లు, యూఏఈ 498.25 డాలర్లతో వరుసగా తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి. భారత్ 505.25 డాలర్లతో ఆరో స్థానాన్ని దక్కించుకుంది. ఆర్థిక మాంద్యం సమస్యల్లో చిక్కుకున్న వెనిజులాలో మాత్రం కోటీశ్వరులు బెదిరిపోయే రేంజ్లో ఐఫోన్ ధరలు ఉన్నాయి. ఇక్కడ ఐఫోన్ల సగటు ధరలు 97,813.82 డాలర్లు(రూ.66.6 లక్షలు) ఉన్నట్లు లినియో సంస్థ పేర్కొంది. 2019 వరకు వెనిజులాలో ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉంటాయని సంస్థ అభిప్రాయపడింది. అంగోలాలో పన్నులు తక్కువ కావడమే అక్కడ ఐఫోన్ల సగటు ధర తక్కువగా ఉండటానికి ప్రధాన కారణమని లినియో బృందం తెలిపింది. -
నాడు అశాంతి... నేడు అభివృద్ధి!
అంగోలా అభివృద్ధిపథంలో దూసుకుపోవడానికి అవసరమైన వనరులు ఉన్నప్పటికీ అశాంతి కారణంగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండాల్సి వచ్చింది అంగోలా. ఆఫ్రికా ఖండంలో ఉన్న ఈ దేశం సుదీర్ఘకాలం పాటు పోర్చుగీసువారి వలస దేశంగా ఉంది. తమ ప్రయోజనాల కోసం ఈ భూభాగాన్ని వాడుకో వడం తప్ప అభివృద్ధిపై దృష్టి పెట్టలేదు పోర్చు గీసు పాలకులు. పదిహేడు, పద్దెనిమిది శతాబ్దాల్లో అంగోలా ... పోర్చుగీసు పాలకులకు ‘బానిసలు విరివిగా దొరికే ప్రాంతం’గానే ఉండిపోయింది. ఇక్కడి నుంచి బానిసలను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేవారు. తరువాతి కాలంలో ఈ బానిస వ్యాపారం రద్దయిపోయినప్పటికీ... తిరుగుబాటు ఉద్యమాలు వెల్లువెత్తాయి. గెరిల్లా యుద్ధం మొదలైంది. చిత్రమేమిటంటే, పోర్చుగీసు రాజ్యంపై సాయుధపోరాటానికి దిగిన వివిధ దళాల మధ్య ఐక్యత లేకపోగా ఒకరిపై ఒకరు దాడులకు దిగేవాళ్లు. ఈ అనైక్యత తరువాతి కాలంలో దేశంలో సామాజిక అశాంతికి దారి తీసింది. పోర్చుగల్ నుంచి 1975లో స్వాతంత్య్రం పొందింది అంగోలా. స్వాతంత్య్రం వచ్చిన మాటేగానీ శాంతి లేదు. దేశంలో అంతర్యుద్ధం తీవ్రరూపం దాల్చింది. రాజ్యాధికారం కోసం ‘పీపుల్స్ మూవ్ మెంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ అంగోలా’, ‘నేష నల్ యూనియన్ ఫర్ ది టోటల్ ఇండిపెండెన్స్ ఆఫ్ అంగోలా’ల మధ్య పోరు మొదలైంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిందనే సంతోషాన్ని ఈ పోరు మాయం చేసింది. దేశం అతలా కుతలం అయింది. దేశంలో శాంతిని నెలకొల్ప డానికి 1991లో కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ అది 1992లో విఫలమైంది. తిరిగి 1994లో కాల్పల విరమణ ఒప్పందం కుదిరింది. 1998లో ఈ ఒప్పదం విఫలమైంది. చాలాకాలం పాటు కొనసాగిన అంతర్యుద్ధం 2002లో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంతో ముగిసింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం భారీగా జరిగింది. అయినప్ప టికీ వెనక్కి తగ్గకుండా యుద్ధశిథిలాల్లో నుంచి లేచి తనను తాను పునర్నిర్మించుకుంటూ కొత్త అడుగులు వేసింది. 2010లో దేశంలో కొత్త రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. పాలనాపరంగా చెప్పాలంటే... అంగోలా 8 ప్రావిన్సులుగా, 163 మున్సిపాలిటీలుగా విభజితమైంది. చాలాకాలం పాటు వలస దేశంగా ఉండడం వల్ల అంగోలా కళాసంస్కృతులపై పోర్చుగీసు ప్రభావం కనిపిస్తుంది. అంగోలా, నమీబియా సరిహద్దుల్లో ఉన్న రౌకెనా జలపాతం ప్రకృతి అందాలకు ప్రతిబింబం. విస్తారమైన ఖనిజ సంపద, పెట్రోలియం నిల్వలు ఉండటంతో తన ఆర్థికవ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి వేగంగా అడుగులు వేస్తోంది. ఒకప్పుడు అంగోలా అంటే అశాంతి. ఇప్పుడు మాత్రం అభివృద్ధి! టాప్ టెన్ 1. అంగోలాలో ఆదరణ ఉన్న క్రీడ బాస్కెట్బాల్. 2. అంగోలాలో సుంబే సంగీతం ప్రసిద్ధి. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో ‘సుంబే మ్యూజిక్ ఫెస్టివల్’ ఘనంగా జరుగుతుంది. 3. ప్రధాన భాష పోర్చుగీస్ అయినా బంటు, కికోంగో మొదలైన ఆఫ్రికన్ భాషలు కూడా మాట్లాడతారు. 4. చమురు, వజ్రాలు ప్రధాన ఆర్థిక వనరు. 5. చైనాకు ఎగుమతి అయ్యే చమురులో అత్యధిక భాగం అంగోలా నుంచే ఎగుమతి అవుతుంది. 6. అంగోలాలో అతి ఎత్తయిన పర్వతం... సెర్రా మౌంటెన్. దీని ఎత్తు 2,306 మీటర్లు. 7. అంగోలా రాజధాని లువాండాను ‘ప్యారిస్ ఆఫ్ ఆఫ్రికా’ అని పిలుస్తుంటారు. 8. అంగోలాలో మరణాల రేటు ఎక్కువ. 9. ‘డ్రెడ్లాక్ హెయిర్ స్టయిల్’ ఇక్కడే పుట్టింది. 10. అంగోలా అందాలరాశి లైలా లోపెజ్ 2011లో ‘మిస్ యూనివర్స్’ కిరీటాన్ని గెలుచుకుంది. దేశం : అంగోలా రాజధాని : లువాండా అధికార భాష : పోర్చుగీస్ కరెన్సీ : క్వాంజా జనాభా : 2 కోట్ల 43 లక్షల 83 వేలు (సుమారుగా)