Anjaneya Goud
-
కార్పొరేషన్ చైర్మన్ల బాధ్యతల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్లుగా నియమితులైన వేణుగోపాలచారి, ఈడిగ ఆంజనేయగౌడ్ గురువారం జరిగిన వేర్వేరు కార్యక్రమాల్లో బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ (టీఎస్ఐడీసీ) చైర్మన్‌గా వేణుగోపాలచారి బంజారాహిల్స్‌లోని ఐడీసీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, నేతలు హాజరై వేణుగోపాలచారికి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్‌గా రాష్ట్ర సాధన ఉద్యమంలో విద్యార్థి నేతగా క్రియాశీలకంగా పనిచేసిన ఈడిగ ఆంజనేయగౌడ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఎల్బీ స్టేడియంలోని స్పోర్ట్స్ అథారిటీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి మంత్రులు వి.శ్రీనివాస్‌గౌడ్, తలసాని, ఎమ్మెల్సీ కవిత హాజరై శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌తో కలిసి నడిచిన ఉద్యమకారులకు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రతీ నియోజకవర్గంలో స్టేడియం నిర్మాణంతో పాటు అంతర్జాతీయ క్రీడాకారులను తయారుచేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందన్నారు. -
తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్‌గా ఆంజనేయగౌడ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్‌గా ఈడిగ ఆంజనేయగౌడ్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. అందుకు సంబంధించిన నియామకపత్రాన్ని సోమవారం ప్రగతి భవన్లో సీఎం చేతుల మీదుగా ఆంజనేయ గౌడ్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. -
కన్నీరింకిన చోటే జల కళ
తెలంగాణ ఉద్యమానికి ఆజ్యం పోసిన పాలమూరు ప్రజల కష్టాల కొలిమిని కేసీఆర్ ఉద్యమ సమయంలో ప్రపంచానికి విడమరిచి చాటిచెప్పారు. ఆనాడు నెర్రలుబాసిన ఎర్రసెలకల్లో జలాలను రప్పించేందుకు పాలమూరు ఊరూరా పాదయాత్రలు చేసి ఉద్యమ జలస్వప్నాలను స్వప్నించారు. అదే కేసీఆర్ నేడు నదుల నడకను మార్చి తరాల పాలమూరు కరువును తరిమేస్తున్నారు. నదులను గండికొట్టి బాజాప్తాగా నెర్రలు బారిన భూములకు గంగమ్మను అందిస్తున్నారు. నిన్నటిదాకా కన్నీరు పెట్టిన పాలమూరు పల్లెలు నేడు ఆనంద భాష్పాలను వర్షిస్తున్నాయి. కరువుకు నెర్రలు బాసిన నేలకు ముఖచిత్రంగా తెలంగాణ అంచు చివరన సరిహద్దులో ఎడారిగా మారిన గట్టు, కెటిదొడ్డి, ధరూర్ మండలాలకు సాగునీరందించేందుకు రూ. 553 కోట్ల నిధులతో 33 వేల ఎకరాల సాగు విస్తీర్ణం లక్ష్యంగా నేడు గట్టు ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయబోతున్నారు. పేదరికం వల్ల చదువుకు దూరమైన గట్టుమండలం 34.8% అత్యల్ప అక్షరాస్యత రేటుతో దక్షిణాసియాలోనే దిగువస్థానంలో మిగిలిపోయింది. సముద్ర మట్టానికి అత్యంత ఎత్తున ఉన్న గట్టు ప్రాంతానికి తెలంగాణ రాష్ట్ర మొచ్చినా, మిగిలిన ప్రాంతానికి నీళ్లు వస్తాయోమో గానీ ఈ ప్రాంత నేలలకు సాగునీరివ్వడం అసాధ్యమనే అభిప్రాయం అందరిలో బలపడి ఉంది. కానీ, తెలంగాణలో పారే ప్రతి నీటిబొట్టుపైన లెక్కలేసి పెట్టుకున్న కేసీఆర్ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిస్తున్నారు. దాదాపు రూ. 783 కోట్ల నిధులతో 55,600 ఎకరాలకు సాగునీరందించేందుకు నిర్దిష్ట ప్రణాళికతో చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పనులను కూడా కేసీఆర్ పర్యవేక్షిస్తున్నారు. 2003 జూలైలో ఆలంపూర్ జోగుళాంబ ఆలయం నుంచి గద్వాల వరకు 150 కిలోమీటర్ల మేరకు చేసిన పాదయాత్ర ముగింపు బహిరంగ సభలో ‘‘మల్దకల్’’ వెంకటేశ్వర స్వామి సాక్షిగా నడిగడ్డకు న్యాయంగా దక్కాల్సిన చివరి నీటిబొట్టు దక్కేదాకా విశ్రమించనని చేసిన ప్రకటనను నిజం చేస్తున్నారు. 87,500 ఎకరాలకు నీరందించాల్సిన ఆర్డీయస్ ఏనాడూ 50వేల ఎకరాలకు కూడా కనీసం ఒక పంటకు నీరవ్వని దుస్థితి, ఒక లక్షా రెండు వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన జూరాల ప్రాజెక్టు దశాబ్దాల పాటు ఏనాడూ 40 వేల ఎకరాలను కూడా తడపకుండా తరలిపోయిన చరిత్ర, దాని వెనకున్న పాలకుల వివక్షా పూరిత విధానాలు, వత్తాసుగా నిలిచిన స్థానిక భూస్వామ్య రాజకీయాలు మరిచిపోలేని వాస్తవాలు. కానీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలోనే పాలమూరు పొలాల తరాల దాహం తీర్చే నిర్దిష్ట చర్యలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. గద్వాల, ఆలంపూర్‌లతో పాటు ఉమ్మడి జిల్లాలోని 14 నియోజక వర్గాల నీటి కష్టాలకు ముగింపు పలుకుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో 35 లక్షల మందికి పైగా మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రజలు కరువు కుంపటిని మోశారు. జురాల, నెట్టెంపాడు, భీమా తదితర ప్రాజెక్టుల నిర్మాణాన్ని తాబేలు నడకలా మార్చిన ఫలితంగా దాదాపు 28 లక్షల సాగుయోగ్యమైన భూమి ఉన్నా పాలమూరు రైతు బక్కచిక్కి బలవన్మరణాల బాధితుడిగా మారాడు. ఇక్కడి జనం దశాబ్దాల పాటు అనుభవించిన దారిద్య్రాన్ని బద్దలు కొడుతూ కేసీఆర్ పల్లెల తలలపై నీటి సంతకాలు చేస్తున్నారు. నెట్టెంపాడు పెండింగ్ పనులు పూర్తి చేసి జోగుళాంబ గద్వాల్ జిల్లాలో, మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా నాగర్‌కర్నూల్, భీమా2 ద్వారా వనపర్తి, కోయిల్ సాగర్ తదితర ప్రాజెక్టుల ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాలో నూతనంగా నాలుగు లక్షల ఎకరాలు సాగులోకి వచ్చింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 944 కోట్లతో మిషన్ కాకతీయ పథకం ద్వారా మూడు విడతలలో 3,633 చెరువుల పునరుద్ధరణ చేసి మరో 2 లక్షల 38 వేల ఎకరాల ఆయకట్టును అందుబాటులోకి తెచ్చారు. దీంతో పాటు రూ. 35,200 కోట్ల అంచనాలతో పాలమూరు–రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టును ప్రారంభించి కరువును కూకటివేళ్లతో పెకిలించేందుకు పునాదులేశారు. ఇప్పుడు పాలమూరు నేల తల్లి కడుపారా పంటను కంటున్నది. దశాబ్దాల దారిద్య్రం మీద గెలుపు సాధించే దిశగా వడివడిగా అడుగులేస్తున్నది. నాగేటి సాళ్ళల్ల... నా తెలంగాణ...నవ్వేటి బతుకుల్ల... నా తెలంగాణ పాట నిన్నటి జ్ఞాపకం. ఇప్పుడు నాగళ్లు నేలతల్లిపై రేపటి భవితాక్షరాలను దున్నుతున్నాయి. 99% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలున్న పాలమూరు ఉమ్మడి జిల్లా గత చరిత్రను విడిచి తలెత్తుకుని నిలబడుతున్నది. నీటికి అలమటించిన నేలపై కాలువలు పరుగులు పెట్టబోతున్నాయి. ముందు చూపు, ప్రజలపై ప్రేమ, మానవీయ దృక్పథంతో చేపడుతున్న సాగునీటి పథకాలు అతి స్వల్పకాలంలోనే గ్రామాల స్వరూపాన్ని సమగ్రంగా మార్చబోతున్నాయి. (ఈ నెల 29న గట్టు ఎత్తిపోతలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తున్న సందర్భంగా) డా. ఆంజనేయగౌడ్, వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు 98661 65308 -
తెలంగాణలో టీడీపీ ఖాళీ
నేతలు, కార్యకర్తలను హెరిటేజ్ ఉద్యోగులుగా చూస్తున్నారు... చంద్రబాబు, లోకేశ్‌ల తీరువల్లే పార్టీకి నష్టం టీఎన్ఎస్ఎఫ్ మాజీ నేత ఆంజనేయగౌడ్ ఉస్మానియా యూనివర్సిటీ: తెలంగాణలో టీడీపీ పతనం ఖాయమని టీఎన్ఎస్ఎఫ్ మాజీ జాతీయ అధ్యక్షులు ఈడిగ ఆంజనేయగౌడ్ అన్నారు. బుధవారం ఉస్మానియా యూనివర్సిటీలో తన అనుచరులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చివరి వరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడి, అనంతరం నూతన రాష్ట్ర అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తూ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న చంద్రబాబును ఈ ప్రాంత ప్రజలు భవిష్యత్తులో విశ్వసించబోరని పేర్కొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, లోకేష్‌బాబులు తెలంగాణ టీడీపీ నేతల పట్ల అనుసరిస్తున్న నియంతృత్వ ధోరణుల వల్ల పార్టీ పతనం తప్పదన్నారు. టీడీపీ నాయకులను, కార్యకర్తలను హెరిటేజ్ కంపెనీ ఉద్యోగులుగా చూస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు, లోకేష్‌బాబు తెలంగాణాలో పర్యటిస్తే ప్రజా ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. మంత్రి ఈటెలతో భేటీ తన పదవికి రాజీనామా చేసిన టీఎన్ఎస్ఎఫ్ మాజీ నేతలు ఆంజనేయగౌడ్, కిరణ్‌గౌడ్ బుధవారం మంత్రి ఈటెల రాజేందర్‌తో భేటీ అయ్యారు. ఈ నెల 23 లేదా 24 తేదీలలో టీఆర్ఎస్లో చేరే విషయమై మంత్రితో చర్చించినట్లు ఆంజనేయగౌడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన సీఎం కేసీఆర్‌తోనే ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుందని విశ్వసిస్తునట్లు తెలిపారు. అందుకోసం పలువురు టీడీపీ నేతలు, టీఎన్ఎస్ఎఫ్ నేతలతో పాటు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసులు టీఆర్ఎస్ పార్టీలో చేరి బంగారు తెలంగాణాలో భాగస్వాములమవుతామన్నారు. కార్యక్రమంలో సురేష్‌నాయక్, శివాజీ మాదిగ, సురేందర్, విఘ్నేష్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. -
టీఎన్ఎస్ఎఫ్కు ఆంజనేయ గౌడ్ రాజీనామా
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ (టీఎన్ఎస్ఎఫ్) జాతీయ అధ్యక్షుడు ఆంజనేయ గౌడ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంగళవారం ఫ్యాక్స్ చేశారు. ఆంజనేయ గౌడ్ ఈ నెల 22న టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. -
విద్యార్థులతో చెలగాటమొద్దు
* తీరు మారకుంటే ఉద్యమిస్తాం: ఆంజనేయగౌడ్ సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ కౌన్సెలింగ్ జాప్యం చేయడం ద్వారా తెలుగు విద్యార్ధులకు తీరని నష్టం చేయడంతో పాటు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కుట్రలు చేస్తున్నారని తెలుగునాడు విద్యార్థి సంఘం జాతీయాధ్యక్షుడు ఆంజనేయగౌడ్ విమర్శించారు. 1956 నిబంధన విధించడం బీసీ విద్యార్థుల గొంతు కోయడానికేనని దుయ్యబట్టారు. ఈనెల 8న కలెక్టర్లకు వినతిపత్రాలు, 11న ప్రభుత్వ దిష్టిబొమ్మల దగ్ధం, 13న రౌండ్‌టేబుల్ సమావేశాలు, 18న కలెక్టరేట్ల ముట్టడి చేయాలన్నారు. సోమవారం టీఎన్ఎస్ఎఫ్ జాతీయకమిటీ సమావేశమై ఈ అంశాలపై చర్చించింది. సమావేశంలో ఇరు రాష్ట్రాల అధ్యక్షులు బ్రహ్మం చౌదరి, మధుసూదన్‌రెడ్డితో పాటు రాజేష్, రవినాయుడు, సురేష్‌నాయక్, రమేష్ ముదిరాజ్, శ్యామ్‌సుందర్ శేషు తదితరులు పాల్గొన్నారు. ఉభయ రాష్ట్రాల్లో టీడీపీ విద్యార్థి విభాగాన్ని బలోపేతం చేయడానికి ఈ నెల 21న నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో మేధోమథన సదస్సును నిర్వహిస్తున్నట్లు ఆంజనేయగౌడ్ తెలిపారు.