తెలంగాణలో టీడీపీ ఖాళీ
నేతలు, కార్యకర్తలను హెరిటేజ్
ఉద్యోగులుగా చూస్తున్నారు...
చంద్రబాబు, లోకేశ్‌ల తీరువల్లే పార్టీకి నష్టం
టీఎన్‌ఎస్‌ఎఫ్ మాజీ నేత ఆంజనేయగౌడ్
ఉస్మానియా యూనివర్సిటీ: తెలంగాణలో టీడీపీ పతనం ఖాయమని టీఎన్‌ఎస్‌ఎఫ్ మాజీ జాతీయ అధ్యక్షులు ఈడిగ ఆంజనేయగౌడ్ అన్నారు. బుధవారం ఉస్మానియా యూనివర్సిటీలో తన అనుచరులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చివరి వరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడి, అనంతరం నూతన రాష్ట్ర అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తూ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న చంద్రబాబును ఈ ప్రాంత ప్రజలు భవిష్యత్తులో విశ్వసించబోరని పేర్కొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, లోకేష్‌బాబులు తెలంగాణ టీడీపీ నేతల పట్ల అనుసరిస్తున్న నియంతృత్వ ధోరణుల వల్ల పార్టీ పతనం తప్పదన్నారు. టీడీపీ నాయకులను, కార్యకర్తలను హెరిటేజ్ కంపెనీ ఉద్యోగులుగా చూస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు, లోకేష్‌బాబు తెలంగాణాలో పర్యటిస్తే ప్రజా ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.
మంత్రి ఈటెలతో భేటీ
తన పదవికి రాజీనామా చేసిన టీఎన్‌ఎస్‌ఎఫ్ మాజీ నేతలు ఆంజనేయగౌడ్, కిరణ్‌గౌడ్ బుధవారం మంత్రి ఈటెల రాజేందర్‌తో భేటీ అయ్యారు. ఈ నెల 23 లేదా 24 తేదీలలో టీఆర్‌ఎస్‌లో చేరే విషయమై మంత్రితో చర్చించినట్లు ఆంజనేయగౌడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన సీఎం కేసీఆర్‌తోనే ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుందని విశ్వసిస్తునట్లు తెలిపారు. అందుకోసం పలువురు టీడీపీ నేతలు, టీఎన్‌ఎస్‌ఎఫ్ నేతలతో పాటు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసులు టీఆర్‌ఎస్ పార్టీలో చేరి బంగారు తెలంగాణాలో భాగస్వాములమవుతామన్నారు. కార్యక్రమంలో సురేష్‌నాయక్, శివాజీ మాదిగ, సురేందర్, విఘ్నేష్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.