‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’ మూవీ రివ్యూ
టైటిల్: అన్నపూర్ణ ఫొటో స్టూడియో
నటీనటులు: చైతన్య రావ్, లావణ్య,మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య
నిర్మాణ సంస్థ: బిగ్ బెన్ సినిమాస్
నిర్మాత: యష్ రంగినేని
దర్శకత్వం: చెందు ముద్దు
సంగీతం: ప్రిన్స్ హెన్రీ
విడుదల తేది: జులై 21, 2023
30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ తో మంచి ఫేం అందుకున్న చైతన్య రావ్, యూట్యూబ్ వీడియోలతో పాటు హిట్ సినిమాలో కీలకమైన పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకున్న లావణ్య జంటగా నటించిన చిత్రం అన్నపూర్ణ ఫొటో స్టూడియో. ఈ సినిమాను బిగ్ బెన్ సినిమాస్ పతాకంపై యష్ రంగినేని నిర్మించగా ఒక పిట్ట కథ లాంటి సినిమాతో అందరినీ ఆకట్టుకున్న చెందు ముద్దు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మిహిర, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య వంటి వారు ఇతర కీలక పాత్రలు పోషించగా టీజర్ ట్రైలర్ వంటి వాటితో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పరచుకుంది. దీంతో సినిమాని ముందుగానే మీడియా కోసం స్పెషల్ ప్రీమియర్ ప్రదర్శించారు. మరి సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
పచ్చటి పొలాలు, చుట్టూ గోదావరితో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్న ఒక గ్రామంలో సూసైడ్ చేసుకోబోయిన అదే ఊరికి చెందిన చంటి (చైతన్యరావ్)ను పోలీసులు ఆసుపత్రిలో జాయిన్ చేస్తారు. అతను రాసుకున్న సూసైడ్ నోట్ చదివే క్రమంలోనే ఈ సినిమా మొదలవుతుంది. చదువు పూర్తయి వయస్సు మీదపడినా పెండ్లికాని ప్రసాద్‌లా మిగిలిపోయినా తన కాళ్ళ మీద తాను నిలబడేందుకు తన తల్లిపేరుతో అన్నపూర్ణ ఫొటో స్టూడియోను నడుపుతుంటాడు. ఊర్లో బేరాలు కంటే ఎక్కువగా స్నేహితులతో కలిసి సందడి చేస్తూ ఉంటాడు చంటి. అనుకోకుండా తన చెల్లిని కాలేజీలోనే కొత్తగా జాయిన్ అయిన గౌతమి (లావణ్య)తో ప్రేమలో పడతాడు. కొన్నాళ్లకు ఆమె కూడా చంటిని ప్రేమిస్తుంది. ఇలా సాగిపోతున్న క్రమంలో అనుకోకుండా ఓ మర్డర్ కేసులో చంటి ఇరుక్కుంటాడు. ఎవరూ చూడలేదు కదా అనుకుంటే ఒక వ్యక్తి బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు. అయితే ఆ తర్వాత చంటి ఏం చేశాడు? అసలు సింధు ఎవరు? లావణ్యతో చంటి ప్రేమ ఏమైంది? అసలు చంటి సూసైడ్ చేసుకోవాలని ఎందుకు అనుకున్నాడు? చివరికి చంటి బతికి బట్ట కడతాడా? అనేది సినిమా కథ.
ఎలా ఉందంటే..
ఇది ఒక అవుట్ అండ్ అవుట్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన కామెడీ ఎంటర్టైనర్. దానికి చిన్న క్రైమ్ టచ్ కూడా ఇచ్చారు. నిజానికి తెలుగు వారందరికీ ఇలా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలు ఏ మాత్రం కొత్త కాదు. ఈ కథ కూడా కొత్తగా అనిపించదు కానీ నడిచినంత సేపు ఆద్యంతం ఆసక్తికరంగా వెళ్ళిపోతుంది. సినిమా మొదలైన వెంటనే ఇది పెద్ద వంశీ స్టైల్ లో తెరకెక్కించిన సినిమా అనే విషయం ఈజీగా అర్థమవుతుంది. వయసు మీద పడిన పెళ్లి కాక ఇబ్బందులు పడే హీరో తనకన్నా రెట్టింపు వయసు వాడితో ప్రేమలో పడే హీరోయిన్, ఎలాంటి బాధ్యతలు లేకుండా గాలికి తిరిగే తొట్టి గ్యాంగ్ ఇలా ఆసక్తికరంగా కథ కథనాలు రాసుకున్నాడు డైరెక్టర్.
సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య సాగే లవ్ ట్రాక్, సన్నివేశాలు చాలా సరదాగా ఎంటర్టైన్ చేస్తాయి. అలాగే సినిమాలో ఉన్న అన్ని పాత్రల చేత కామెడీ చేయించాలని ట్రై చేశారు కానీ పూర్తిస్థాయిలో అది వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. సినిమా ఫస్టాఫ్ అంతా చాలా సరదాగా సాగుతూ ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండ్ హాఫ్ మీద ఆసక్తి పెంచేస్తుంది.
సెకండాఫ్‌లో వచ్చే సన్నివేశాలు, పాత్రలు బాగా డిజైన్ చేసుకున్నారు. అయితే సినిమాలో కావాలనే కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారనే విషయం రివిల్ చేసి కొంత ట్రోలింగ్ నుంచి తప్పించుకున్నారు. చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ ఓవరాల్ గా ఎలాంటి అసభ్యతకు తావు లేకుండా సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. ఒక మాటలో చెప్పాలంటే ఎలాంటి అసభ్యతకు తావు లేకుండా ఫ్యామిలీతో కలిస్ చూసే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్నపూర్ణ ఫోటో స్టూడియో
ఎవరెలా చేశారంటే..
నటీనటుల విషయానికి వస్తే అటు చైతన్య రావు ఇటు లావణ్య వేరు వేరు సినిమాలలో అలాగే యూట్యూబ్ వీడియోలలో కనిపించిన ఇద్దరికీ ఇది హీరో హీరోయిన్లుగా మొదటి సినిమా కావడంతో చాలా ఫ్రెష్ ఫీల్ కలిగింది. వయసు పైబడిన పెళ్ళికాని ప్రసాదు లాంటి పాత్రలో చైతన్య రావు తనకన్నా రెట్టింపు వయసు వ్యక్తిని ప్రేమించే పాత్రలో లావణ్య జీవించారు, ఆమె నటన నేచురల్ గా ఉంది. సినిమాను మలుపు తిప్పే పాత్రను నిర్మాత యష్ రంగినేని పోషించి నిర్మాతగానే కాదు నటుడుగా కూడా ఆకట్టుకున్నారు. వైవా రాఘవ మినహా దాదాపు మిగతా పాత్రధారులు అందరూ కొత్తవారే అయినా తమ తమ పాత్రల పరిధి మీద ఆకట్టుకున్నారు. అయితే కామెడీ ఇంకాస్త వర్కౌట్ అయితే సినిమా వేరే లెవెల్ లో ఉండేది.
టెక్నికల్ విషయాలు పరిశీలిస్తే చందు ముద్దు రాసుకున్న కథనాలు ఆకట్టుకున్నాయి కానీ కామెడీ విషయం మీద మరికొంత శ్రద్ధ పెడితే బాగుండేది. ప్రిన్స్ హెన్రీ సంగీతం ఆకట్టుకుంది అయితే నేపథ్య సంగీతం విషయంలో ఎక్కువ మార్కులు కొట్టేశాడు. పంకజ్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రాణం పోశాడు. పచ్చటి పొలాలను ప్రకృతి అందాలను ఒడిసిపట్టి ప్రతి ఫ్రేమ్ ని ఒక ఓ అందమైన పెయింటింగ్ ఏమో అనిపించేలా చూపించాడు. ఎస్.పి. చరణ్ పాడిన రంగమ్మ సాంగ్ చాలాకాలం గుర్తుండిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక సినిమా ఎడిటింగ్ కూడా వంక పెట్టలేకుండా క్రిస్పీగా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.