అతిపెద్ద విమానం వచ్చిందోచ్..!
- దేశంలోనే తొలిసారిగా శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్
- ఖాళీ విమానం 300 టన్నుల ఇంధనాన్ని నింపుకొని ఆగకుండా18,000 కి.మీ. ప్రయాణించగలదు
- గరిష్టంగా 640టన్నుల బరువును మోసుకుంటూ గాలిలోకి ఎగరగలదు.
- విమానం పొడవు 84 మీటర్లు, రెక్కలతో కలిపి వెడల్పు 88.4 మీటర్లు. దాదాపు రెండు ఫుట్‌బాల్ మైదానాల స్థలాన్ని ఈ విమానం ఆక్రమిస్తుంది.
(మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
శంషాబాద్: ప్రపంచంలోనే అతిపెద్దదైన ‘ఆంటోనోవ్ ఏఎన్-225 మైరియా’ కార్గో విమానం భారతదేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లో అడుగిడింది. గురువారం అర్ధరాత్రి 12.05 గంటలకు శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దీనిని ల్యాండ్ చేశారు. 240 ప్రపంచ రికార్డులు కలిగిన ఏన్-225 రాకతో శంషాబాద్ విమానాశ్రయ అధికారులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
చెక్ రిపబ్లిక్ ప్రాగ్లో తయారైన 117 టన్నుల బరువైన పవర్ జనరేటర్‌ను తుర్క్‌మెనిస్థాన్‌లోని తుర్కమెంబాషి విమానాశ్రయం నుంచి ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు ఈ విమానం తీసుకెళుతోంది. 24 గంటల విశ్రాంతి అనంతరం శుక్రవారం రాత్రి 11 గంటల తర్వాత బయలుదేరనుంది. ఇండోనేషియాలోని జకార్తాలో మరోసారి విశ్రాంతి తీసుకుని.. ఆదివారం పెర్త్‌కు చేరుకోనుంది.
ప్రపంచంలో ప్రస్తుతం సర్వీసులో ఉన్న అతిపెద్ద రవాణా విమానం ఇదే.
ఆరు టర్బో ఇంజన్లతో పనిచేస్తుంది. ఆరుగురు సిబ్బంది నియంత్రిస్తారు.
గరిష్టంగా 640 టన్నుల బరువును మోసుకుంటూ గాలిలోకి ఎగరగలదు.
విమానం పొడవు 84 మీటర్లు, రెక్కలతో కలిపి వెడల్పు 88.4 మీటర్లు. దాదాపు రెండు ఫుట్‌బాల్ మైదానాల స్థలాన్ని ఈ విమానం ఆక్రమిస్తుంది.
దీని ఎత్తు 18.1 మీటర్లు. అంటే ఆరు అంతస్తుల భవనంతో సమానం.
ఆకాశంలో 11 కిలోమీటర్ల ఎత్తులో గరిష్టంగా గంటకు 850 కిలోమీటర్ల వేగంతో ఇది దూసుకెళ్లగలదు.
ఖాళీ విమానం 300 టన్నుల ఇంధనాన్ని నింపుకొని ఎక్కడా ఆగకుండా 18,000 కిలోమీటర్లు ప్రయాణించగలదు
రవాణా చేసే కార్గో బరువును బట్టి ఇంధనాన్ని తగ్గిస్తారు.
సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం కాకముందు.. దానిలో భాగమైన ఉక్రెయిన్‌లో 1980 దశకంలో ఈ భారీ విమానం తయారీని ప్రారంభించారు.
అసలు దీనిని తయారు చేసింది మాత్రం సరుకు రవాణా కోసం కాదు.. సోవియట్ స్పేస్ షటిల్ ‘ది బ్యూరాన్’ను తరలించడం కోసం.
1988 డిసెంబర్ 21న ఇది తొలిసారిగా ప్రయాణించింది. కొన్ని కారణాలతో 1994లో పక్కనపెట్టారు.
2001లో దీనికి కొత్త ఇంజన్లు అమర్చి, పునరుద్ధరించాక తిరిగి ప్రయాణం మొదలుపెట్టింది.
ఆస్ట్రేలియాలో వర్స్‌లీ అల్యూమినా అనే అల్యూమినియం మైనింగ్ సంస్థకు 117 టన్నుల భారీ పవర్ జనరేటర్‌ను రవాణా చేయడానికి అంతర్జాతీయ లాజిస్టిక్స్ (రవాణా) కంపెనీ ‘డీబీ చెంకర్’ ఈ విమానాన్ని ఆంటోనోవ్ సంస్థ నుంచి అద్దెకు తీసుకుంది.
ఈ విమానం ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో దిగే సమయాన్ని సంబరంగా జరుపుకొనేందుకు అక్కడి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
దాదాపు 50 వేల మంది ఈ విమానాన్ని చూడడానికి రానున్నారు. ఇందుకోసం రన్‌వే సమీపంలో ప్రత్యేకంగా వేదికలూ నిర్మిస్తున్నారు.