Apoorva Raagangal
-
మన ఇంట్లోనో ..పక్కింట్లోనే జరిగినట్లు..
చెన్నై : తనకు సినిమాల్లో అవకాశం తగ్గినప్పుడు బుల్లితెర ద్వారా బాలచందర్ ఛాన్సులు ఇచ్చి ..తనకు భిక్ష పెట్టారని నటుడు శుభలేఖ సుధాకర్ అన్నారు. ఆయన బుధవారం ఉదయం బాలచందర్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం శుభలేఖ సుధాకర్ మాట్లాడుతూ బాలచందర్ తనకు గురువు అని గుర్తు చేసుకున్నారు. ఆయన తీసిన సినిమాలు మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించినవేనని... వారి సమస్యలతో పాటు మానసిక స్థితిని వెండితెరపై బాగా చూపించేవారన్నారు. బాలచందర్ సినిమాలు ప్రేక్షకులకు దగ్గరగా ఉంటాయని..'మన ఇంట్లోనో లేక పక్కింట్లోనే..ఎక్కడో జరిగినట్లుగా నిజ జీవితానికి' దగ్గరగా ఉంటాయన్నారు. ఆయన సృష్టించిన పాత్రల్లో నటించిన నటులకు కూడా మంచి గుర్తింపు వచ్చిందన్నారు. మధ్య తరగతి కుటుంబాల మానసిక స్థితిని ఏ దర్శకుడు ఇంత దగ్గరగా చిత్రీకరించలేదన్నారు. ఈ సందర్భంగా బాలచందర్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని శుభలేఖ సుధాకర్ గుర్తు చేసుకున్నారు. -
ఆయన నా గురువే కాదు...తండ్రిలాంటి వారు
చెన్నై : ప్రముఖ నటుడు రజనీకాంత్ ఇంకా షాక్‌లోనే ఉన్నారు. ప్రముఖ దర్శకుడు బాలచందర్ ఇకలేరన్న వార్తను ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. బాలచందర్ లోటు తనకు వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిపరంగా కూడా పూడ్చలేని లోటు అని రజనీకాంత్ అన్నారు. ఆయన లేరంటే నమ్మలేకపోతున్నానని, బాలచందర్ తనకు గురువు మాత్రమే కాదని.. ఆయన తండ్రిలాంటి వారని, ఆయన తనను సొంత బిడ్డలా చూసుకునేవారని ఆయన పేర్కొన్నారు. కాగా రజనీకాంత్‌తో పాటు కమల్ హాసన్‌ను వెండి తెరకు పరిచయం చేసింది బాలచందరే. 1975లో 'అపూర్వ రాగంగల్' చిత్రం ద్వారా రజనీకాంత్‌ను బాలచందర్ ప్రేక్షకులకు పరిచయం చేశారు. మొదటి చిత్రం నుంచి చివరి వరకూ వారి మధ్య సాన్నిహిత్యం కొనసాగింది. వీరిద్దరి కాంబినేషన్లో పది చిత్రాలు వచ్చాయి. చెన్నైలోని ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలచందర్ నిన్న మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా కుటుంబ సభ్యులు బుధవారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.