నిరాశేనా!
రాజీవ్ హంతకుల విడుదల ఇప్పట్లో లేనట్లే
సుప్రీం నిర్ణయంతో నిరాశ
మళ్లీ పోరాటం అంటున్న అర్బుతామ్మాళ్
చెన్నై, సాక్షి ప్రతినిధి: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హంతకులు క్షమాభిక్షపై విడుదలవుతారని ఎంతో ఆశతో ఎదురు చూసిన వారు శుక్రవారం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో నిరాశకు లోనయ్యూరు. కన్నీరుమున్నీరైన పేరరివాళన్ తల్లి అర్బుతామ్మాళ్ మళ్లీ పోరాడుతానని ప్రకటించారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ 1991 మే 21వ తేదీన చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూరులో ఎల్టీటీఈ మానవబాంబు దాడిలో హత్యకు గురయ్యూరు. ఈ కేసుకు సంబంధించి 26 మందికి శిక్ష విధించారు. వారిలో మురుగన్, శాంతన్, పేరరివాళన్, నళినీలకు ఉరిశిక్ష పడింది.
తమ శిక్షను రద్దుచేయాలని రాష్ట్రపతికి, కేంద్రానికి వారు విజ్ఞప్తి చేసుకున్నారు. పసి బిడ్డతల్లి అనే మానవీయ కోణంలో నళినీకి పడిన ఉరిశిక్షను యావజ్జీవంగా మార్చారు. మిగిలిన వారి విషయూన్ని కేంద్రం 11 ఏళ్లుగా పెండింగ్‌లో పెట్టింది. దీనిపై వారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు వారి శిక్షను కూడా యావజ్జీవంగా మారుస్తున్నట్టు 2014 ఫిబ్రవరి 18వ తేదీన తీర్పు ఇచ్చింది.
వారికి క్షమాభిక్ష పెట్టే విచక్షణాధికారాన్ని కొన్ని షరతులతో రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. ఈ క్రమం లో ఆ ముగ్గురితోపాటు మొత్తం ఏడుగురికి జైలు జీవితం నుంచి విముక్తి ప్రసాదిస్తున్నట్లు ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించారు. రాష్ట్రంలోని పార్టీలన్నీ రాజకీయాలకు అతీతంగా హర్షం వెలిబుచ్చాయి. తమిళనాడు ప్రజలు సైతం ఆనందాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జయలలిత నిర్ణయాన్ని కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. అంతేగాక సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన సుప్రీం కోర్టు ఏడుగురి విడుదలపై స్టే ఇచ్చింది.
దీంతో ఆ ఏడుగురి విడుదల ఆగిపోయింది. ఈ పిటిషన్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల న్యాయవాదుల వాదోపవాదాలు గత నెల 27వ తేదీతో పూర్తయ్యాయని, ఈ నెల 25వ తేదీలోగా తీర్పు వెలువడుతుందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం ఈ నెల 18వ తేదీన కోవైలో ప్రకటించారు. ఈ ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠను రేకెత్తించింది. ఈ క్రమంలో శుక్రవారం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ఖైదీల కుటుంబ సభ్యులతోపాటు ప్రజలు నిరాశకు లోనైయ్యారు.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం శుక్రవారం పదవీ విరమణ చేస్తున్నందున మానవతా ధృక్పథంతో చివరి కేసుగా వారికి విముక్తి ప్రసాదిస్తారని అందరూ ఆశించారు. శిక్షను అనుభవిస్తున్న ఖైదీలు భయంకర ఉగ్రవాదులు కాబట్టి వారికి క్షమాభిక్షపై రాష్ట్ర ప్రభుత్వం తన ఇష్టానుసారం నిర్ణయం తీసుకునేందుకు వీలులేదని జస్టిస్ సదాశివం వ్యాఖ్యానించారు. ప్రధానంగా ఏడు అంశాలపై విచార ణ జరిపించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇందుకు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్‌ను మూడు నెలల్లోగా ఏర్పాటు చేయూలని ఆదేశించారు.