'మీ స్థానాన్ని అవమానించకండి'
కోల్కతా: పశ్చిమ బెంగాల్ మానవ హక్కుల సంఘం అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అశోక్ గంగూలీని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. నేడు ప్రపంచ మానవ హక్కుల దినంగా సందర్భంగా ఈ డిమాండ్ చేసింది.
'ఐక్యరాజ్యసమితి ఈ రోజు మానవ హక్కుల దినం పాటిస్తోంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అశోక్ గంగూలీ ఇంకా బెంగాల్ మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. సర్, దయచేసి మీ స్థానాన్ని అవమానించకండి' అని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రిన్ ట్వీట్ చేశారు.
అంతర్జాతీయ మానవ హక్కుల దినాన్ని పాటిస్తే గంగూలీ పదవి నుంచి వైదొలగుతారని, తన కార్యాలయానికి అపప్రద రాకుండా చూసుకుంటారని తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కూడా అయిన ఓబ్రిన్ వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని పార్లమెంట్ ఉభయ సభల్లో లేవనెత్తుతానని చెప్పారు.