నిజామియా అబ్జర్వేటరీ
నిజామియా అబ్జర్వేటరీ. అమీర్‌పేటలో ఉంది. ఇక్కడ ఖగోళ శాస్త్ర పరిశోధనలు పెద్ద ఎత్తున జరిగాయి. ఈ సంస్థ ప్రపంచంలోనే ఒక అరుదైన ఖగోళ పరిశోధనా సంస్థగా కీర్తి గడించింది. ఈ మాటలు ఈ తరం వారికి నమ్మశక్యంగా ఉండకపోవచ్చు. కానీ ఇది నిజం!
1909 ప్రాంతంలో ఇక్కడ ఖగోళదర్పణిని ఏర్పాటు చేశారు. నిజాం అబ్జర్వేటరీ భూకంపాల సమాచారాన్ని, వాతావరణ ఉష్ణోగ్రతల్లోని మార్పులతో పాటు సమయాన్ని కూడా కూడా సూచించేది. 1918లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నెలకొల్పాక, నిజాం అబ్జర్వేటరీని ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోకి బదిలీ చేశారు. ప్రత్యేకంగా ఖగోళ శాస్త్ర ప్రయోగశాల కలిగి ఉన్న ఘనకీర్తి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి దక్కింది. నోబెల్ బహుమతి పొందిన సర్ సీవీ రామన్, ప్రొఫెసర్ ఎస్.చంద్రశేఖర్ వంటి శాస్త్రవేత్తలు ఈ అబ్జర్వేటరీని సందర్శించారు. ఈ అబ్జర్వేటరీలో పనిచేసిన అనేకమంది పరిశోధకులు ఆకాశంలో గల సుమారు 4 లక్షల నక్షత్రాల స్థితిగతుల గురించి గ్రంథస్తం చేశారని వర్సిటీ ప్రొఫెసర్స్ చెబుతున్నారు.
మంత్రిగారి కోరిక
6వ నిజాం నవాబ్ మీర్ మహబూబ్ అలీఖాన్ ఆస్థాన మంత్రి నవాబ్ జఫర్ జంగ్కు ఖగోళ శాస్త్రంపై మక్కువ ఎక్కువ. ఆయన ఇంగ్లాండ్‌లో చదువుకున్నాడు. 15 అంగుళాల గ్రబ్ రిఫ్రాక్టర్‌ను ఇంగ్లాండ్ నుంచి కొనుగోలు చేసి హైదరాబాద్‌లో ఒక పెద్ద ఆస్ట్రానామికల్ అబ్జర్వేటరీగా నెలకొల్పాలని ప్రతిపాదించాడు. ఈ మేరకు ఆనాటి ఆరో నిజాంకు 1901 సెప్టెంబర్ 29న ఒక లేఖ రాశాడు. మీరు కనుక అనుమతిస్తే హైదరాబాద్‌లో మీ పేరు మీద ‘నిజామియా అబ్జర్వేటరీ’ నెలకొల్పాలని తాను భావిస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నాడు. నిజాం వెంటనే అంగీకరిస్తూ ఫర్మానా విడుదల చేశాడు.
తర్వాత, నవాబ్ జఫర్‌జంగ్ హైదరాబాద్‌కు ఆగ్నేయంగా పిసల్‌బండలో తన సొంత ఎస్టేట్‌లో అబ్జర్వేటరీని నెలకొల్పాడు. నవాబ్ జఫర్ జంగ్ మరణించాక, ఆయన వీలునామా ప్రకారం ఈ అబ్జర్వేటరీని నిజాం ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అప్పట్లో నిర్జనంగా ఉన్న అమీర్‌పేటకు తరలించింది. తర్వాత ఈ ప్రాంతంలో సెంటర్ ఫర్ ఎకనామిక్ సోషియల్ స్టడీస్‌ను ఏర్పాటు చేశారు. అమీర్‌పేటలో రద్దీ పెరుగుతుండటంతో 1968లో దీనిని ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో నాగార్జునసాగర్ వెళ్లే దారిలోని రంగాపూర్ గ్రామానికి తరలించారు. దీనిని జపాల్ రంగాపూర్ అబ్జర్వేటరీగా పిలుస్తున్నారు.
నాడు ఘనం.. నేడు గ్రహణం..
ఒకప్పుడు గ్రహ రాశుల గతులు తెలిపిన కేంద్రంగా బాసిల్లిన నిజామియా అబ్జర్వేటరీ ప్రాంగణం నేడు నిరుపయోగంగా మారిపోయింది. ఆకాశహర్మ్యాల మధ్య పడిపోయే రాళ్లతో దర్శనమిస్తోంది. వందేళ్ల చరిత్రకు అవశేషంగా మిగిలిన ఈ ప్రాంగణాన్ని ఖగోళశాస్త్రం గురించి లుసుకోవాలనుకునే ఆసక్తిగల యువతకు వీలుగా ఒక శిక్షణా కేంద్రంగా రూపొందించాలని పలువురు ఖగోళ శాస్త్రవేత్తలు కోరుతున్నారు. అలాగే, ఆస్ట్రాలజీ శిక్షణా కేంద్రంగా ఈ పురాతన వారసత్వ కట్టడాన్ని అభివృద్ధి చేస్తే మరింత బావుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఖగోళ శాస్త్ర పరిశోధకులకు, ఆ శాస్త్ర అధ్యయన అభిలాషాపరులకు చక్కని పరిశోధనా పర్యాటక కేంద్రం.. నిజాం అబ్జర్వేటరీ. అయితే పెచ్చులూడిపోతున్న ఈ కేంద్రం ఇంకా ఎన్నాళ్లుంటుందో కాలమే జవాబివ్వాలి.