ATP Challenger tournament
-
సాకేత్–రామ్‌కుమార్ జోడీకి సియోల్ ఓపెన్ డబుల్స్ టైటిల్
ఎనిమిది నెలల విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ స్టార్, భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడు సాకేత్ మైనేని మరో అంతర్జాతీయ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. దక్షిణకొరియాలో ఆదివారం ముగిసిన సియోల్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టోర్నీలో సాకేత్–రామ్‌కుమార్ రామనాథన్ (భారత్) జోడీ పురుషుల డబుల్స్ టైటిల్‌ను దక్కించుకుంది. ఫైనల్లో సాకేత్–రామ్‌కుమార్ ద్వయం 6–4, 4–6, 10–3తో ‘సూపర్ టైబ్రేక్’లో వాసిల్ కిర్కోవ్ (అమెరికా)–బార్ట్ స్టీవెన్స్ (నెదర్లాండ్స్) జోడీపై నెగ్గింది. సాకేత్–రామ్‌కుమార్ జంటకు 7,580 డాలర్ల (రూ. 6 లక్షల 37 వేలు) ప్రైజ్‌మనీతో పాటు 100 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఓవరాల్‌గా ఈ ఏడాది సాకేత్–రామ్మూడో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్‌ను గెల్చుకున్నారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఈ ఇద్దరు బెంగళూరు ఓపెన్, చెన్నై ఓపెన్ టోర్నీల్లో విజేతలుగా నిలిచారు. ఓవరాల్‌గా సాకేత్ కెరీర్లో ఇది 19వ ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్. ఏటీపీ చాలెంజర్ టోర్నీలు కాకుండా సాకేత్ మరో 19 ఐటీఎఫ్ టోర్నీ డబుల్స్ టైటిల్స్ కూడా గెలిచాడు. -
బాలాజీ జంటకు టైటిల్
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ డబుల్స్ ప్లేయర్ శ్రీరామ్ బాలాజీ కెరీర్లో ఆరో ఏటీపీ చాలెంజర్ టోర్నీ టైటిల్‌ను సాధించాడు. చైనీస్ తైపీలో ఆదివారం ముగిసిన సాంతైజి ఓపెన్‌లో శ్రీరామ్ బాలాజీ (భారత్)–జొనాథన్ ఎల్రిచ్ (ఇజ్రాయెల్) ద్వయం విజేతగా నిలిచింది. ఫైనల్లో బాలాజీ–ఎల్రిచ్ జోడీ 6–3, 6–2తో సాండెర్ ఆరెండ్స్ (నెదర్లాండ్స్)–వీస్‌బార్న్ (ఆస్ట్రియా) జంటపై విజయం సాధించింది. టైటిల్ నెగ్గిన బాలాజీ జోడీకి 9,300 డాలర్ల (రూ. 6 లక్షల 43 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 125 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ విజయంతో బాలాజీ ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ టాప్–100లోకి వచ్చే అవకాశముంది. -
ఫైనల్లో పేస్ జోడీ
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ ఈ సీజన్లో ఆరోసారి ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్ డబుల్స్ విభాగంలో ఫైనల్లోకి ప్రవేశించాడు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఓపెన్ బ్రెస్ట్ క్రెడిట్ అగ్రికోల్ టోర్నీలో పేస్– వరేలా (మెక్సికో) ద్వయం టైటిల్‌కు విజయం దూరంలో ఉంది. సెమీఫైనల్లో టాప్ సీడ్ పేస్–వరేలా జోడీ 7–5, 7–6 (7/5)తో సిమోన్ బొలెలీ–బ్రాకియాలి (ఇటలీ) ద్వయంపై గెలిచింది. -
వియత్నాం ఓపెన్ విజేత సాకేత్ జోడీ
సాక్షి, హైదరాబాద్: ఏడాదిన్నర విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని మరో ఏటీపీ చాలెంజర్ టోర్నీ డబుల్స్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. హోచి మిన్ సిటీలో ఆదివారం జరిగిన వియత్నాం ఓపెన్ టోర్నమెంట్లో సాకేత్–విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్) జంట విజేతగా నిలిచింది. ఫైనల్లో సాకేత్–విజయ్ ద్వయం 7–6 (7/3), 7–6 (7/5)తో గో సొయెదా–బెన్ మెక్లాచ్లాన్ (జపాన్) జంటపై విజయం సాధించింది. గంటా 52 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ ద్వయం నాలుగు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. భారత డేవిస్ కప్ జట్టు సభ్యుడైన సాకేత్ కెరీర్లో ఇది ఏడో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్. విజేతగా నిలిచిన సాకేత్–విజయ్ జోడీకి 3,100 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 లక్షలు)తోపాటు 80 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
పేస్ జంటకు టైటిల్
ఇల్‌క్లే (బ్రిటన్): భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ ఈ ఏడాది మూడో డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. శనివారం ముగిసిన ఎగాన్ ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్లో తన భాగస్వామి ఆదిల్ షమస్దీన్ (కెనడా)తో కలిసి పేస్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో పేస్–షమస్దీన్ ద్వయం 2–6, 6–2, 10–8తో ‘సూపర్ టైబ్రేక్’లో బ్రిడాన్ క్లియెన్–జో సాలిస్బరీ (బ్రిటన్) జోడీపై గెలిచింది. 45 ఏళ్ల పేస్ ఈ సీజన్లో తలాసీ, లియోన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీల్లోనూ టైటిల్స్ సాధించాడు. -
ఎన్నాళ్లకెన్నాళ్లకు...
16 ఏళ్ల తర్వాత పేస్ ఖాతాలోఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్ బుసాన్: భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ 16 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఓ ఏటీపీ చాలెంజర్ టోర్నీలో డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం ముగిసిన బుసాన్ ఓపెన్‌లో తన భాగస్వామి సామ్ గ్రోత్ (ఆస్ట్రేలియా)తో కలిసి పేస్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో టాప్ సీడ్ పేస్-గ్రోత్ ద్వయం 4-6, 6-1, 10-7తో ‘సూపర్ టైబ్రేక్’లో సంచాయ్-సొంచాట్ రటివటినా (థాయ్‌లాండ్) జోడీపై విజయం సాధించింది. 2000లో జాన్ సిమిరింక్ (నెదర్లాండ్స్)తో కలిసి చివరిసారి పేస్ ఏటీపీ చాలెంజర్ టోర్నీ టైటిల్ (బెర్ముడా ఓపెన్) సాధించాడు. ఏటీపీ సర్క్యూట్లో చాలెంజర్ టోర్నీలనేవి ద్వితీయ శ్రేణికి చెందినవి. ఒకప్పుడు డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచిన పేస్ ప్రస్తుతం 57వ ర్యాంక్‌లో ఉన్నాడు. దాంతో తన ర్యాంక్ మెరుగుపర్చుకునేందుకు పేస్ చాలెంజర్ టోర్నీల్లో ఆడుతున్నాడు. 42 ఏళ్ల పేస్‌కు ఇది 12వ చాలెంజర్ టైటిల్ కాగా... ఓవరాల్‌గా 66వ టైటిల్ కావడం విశేషం. -
సెమీస్‌లో యూకీ బాంబ్రీ
పుణే: ఏటీపీ చాలెంజర్ టోర్నీలో భారత ఆటగాడు యూకీ బాంబ్రీ సెమీస్‌లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో టాప్‌సీడ్ యూకీ 6-4, 7-6 (4)తో టి చెన్ (తైపీ)పై నెగ్గాడు. పురుషుల డబుల్స్ సెమీస్‌లో సాకేత్-సనమ్ సింగ్ జోడి ఓడింది. -
సెమీస్‌లో సాకేత్-సనమ్ జోడీ
ఏటీపీ చాలెంజర్ టోర్నీ పుణే: ఆద్యంతం సమన్వయంతో ఆడిన సాకేత్ మైనేని-సనమ్ సింగ్ (భారత్) జంట పుణే ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ సాకేత్-సనమ్ ద్వయం 6-2, 6-3తో జెర్మయిన్ గిగూనన్-యానిక్ మెర్టెన్స్ (బెల్జియం) జోడీపై విజయం సాధించింది. కేవలం 39 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సాకేత్ జంట ఏకంగా 13 ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు సింగిల్స్ విభాగంలో యూకీ బాంబ్రీ, సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా... ఇతర భారత ఆటగాళ్లు విష్ణువర్ధన్, సుమీత్ నాగల్, సనమ్ సింగ్, రామ్‌కుమార్ రామనాథన్, ప్రజ్నేశ్ గుణేశ్వరన్ రెండో రౌండ్లో ఓడిపోయారు. -
క్వార్టర్స్‌లో సాకేత్-సనమ్ జోడీ
ఏటీపీ చాలెంజర్ టోర్నీ పుణే: మరో డబుల్స్ టైటిల్‌పై గురి పెట్టిన సాకేత్ మైనేని-సనమ్ సింగ్ (భారత్) జంట పుణే ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో రెండో సీడ్ సాకేత్-సనమ్ ద్వయం 6-1, 6-1తో తెముర్ ఇస్మయిలోవ్ (ఉజ్బెకిస్తాన్)-అర్పిత్ శర్మ (భారత్) జంటపై గెలిచింది. అయితే సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ తొలి రౌండ్లోనే నిష్ర్కమించాడు. రెండు గంటల మూడు నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ఐదో సీడ్ సాకేత్ 7-5, 4-6, 2-6తో ఇల్యా ఇవష్కా (బెలారస్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. ఈ టోర్నీతో సాకేత్ ఈ సీజన్‌ను ముగిస్తున్నాడు. ఈ ఒక్క నెలలోనే సాకేత్ మూడు టోర్నీల్లో బరిలోకి దిగి ఏకంగా 25 మ్యాచ్‌ల్లో (14 సింగిల్స్, 11 డబుల్స్) పాల్గొన్నాడు. మరోవైపు భారత్‌కే చెందిన సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్, సనమ్ సింగ్, విజయ్ సుందర్ ప్రశాంత్‌లు సింగిల్స్‌లో రెండో రౌండ్లోకి అడుగుపెట్టారు. తొలి రౌండ్లో సోమ్‌దేవ్ 6-4, 7-5తో మాక్సిమ్ జాన్వీర్ (ఫ్రాన్స్)పై, సనమ్ సింగ్ 6-4, 6-1తో అలెజాంద్రో బెగా (ఇటలీ)పై, ప్రశాంత్ 6-4, 6-4తో ఆర్థర్ డీ గ్రీఫ్ (బెల్జియం)పై గెలిచారు. -
క్వార్టర్స్‌లో యూకీ
షాంఘై : భారత డేవిస్ కప్ ఆటగాడు యూకీ బాంబ్రీ... ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్లో క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో నాలుగోసీడ్ యూకీ 7-5, 6-3తో జీ జెంగ్ (చైనా)పై విజయం సాధించాడు. గంటా 36 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత కుర్రాడు స్ఫూర్తిదాయకమైన ఆటతీరును చూ పెట్టాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన యూకీ రెండుసార్లు సర్వీస్‌ను కోల్పోయాడు. ఓవరాల్‌గా యూకీ 70 పాయింట్లు సాధిస్తే.. జెంగ్ 60తో సరిపెట్టుకున్నాడు. మరో మ్యాచ్‌లో సాకేత్ మైనేని 6-3, 3-6, 2-6తో జోర్డాన్ థాంప్సన్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడాడు. డబుల్స్ క్వార్టర్స్‌లో సాకేత్-శ్రీరామ్ బాలాజీ 1-6, 1-6తో పీటర్ గోజోవిజిక్-జుర్జెన్ జాప్ చేతిలో పరాజయం చవిచూశారు. -
సాకేత్ జోరు
ఏటీపీ చాలెంజర్ టోర్నీ పుణే: తన విజయపరంపర కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ యువతార సాకేత్ మైనేని ఏటీపీ చాలెంజర్ టోర్నీలో ముందంజ వేశాడు. పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టిన ఈ వైజాగ్ ప్లేయర్... డబుల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. సింగిల్స్ రెండో రౌండ్లో సాకేత్ కేవలం 55 నిమిషాల్లో 6-1, 6-2తో హిరోకి మొరియా (జపాన్)పై అలవోకగా గెలిచాడు. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్-సనమ్ సింగ్ ద్వయం 7-6 (7/2), 6-2తో రెండో సీడ్ యూకీ బాంబ్రీ-దివిజ్ శరణ్ (భారత్) జంటను బోల్తా కొట్టించింది. మరోవైపు హైదరాబాద్‌కు చెందిన విష్ణువర్ధన్, భారత నంబర్‌వన్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్, సనమ్ సింగ్, విజయ్ సుందర్ ప్రశాంత్ రెండో రౌండ్లోనే ఓడిపోయారు. విష్ణువర్ధన్ 2-6, 6-3, 3-6తో కిమెర్ కాప్‌జాన్స్ (బెల్జియం) చేతిలో; సోమ్‌దేవ్ 3-6, 6-7 (3/7)తో ఆడమ్ పావ్లాసెక్ (చెక్ రిపబ్లిక్) చేతిలో; సనమ్ సింగ్ 1-6, 2-6తో ఆడ్రియన్ మెనెడెజ్ (స్పెయిన్) చేతిలో; విజయ్ సుందర్ 0-6, 6-7 (5/7)తో కుద్రయెత్సెవ్ (రష్యా) చేతిలో ఓడిపోయారు. యూకీ బాంబ్రీ 7-5, 6-4తో గిగౌనోన్ (బెల్జియం)ను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి చేరాడు. గురువారం జరిగే సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ నెదోవ్‌యెసోవ్ (కజకిస్థాన్)తో సాకేత్; యూచి సుగిటా (జపాన్)తో యూకీ బాంబ్రీ తలపడతారు.