జొకోవిచ్ జోరు
ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ టైటిల్ సొంతం
* వరుసగా నాలుగోసారి విజేత
* ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా గుర్తింపు
లండన్: ఈ ఏడాది ఆరంభం నుంచి అద్వితీయమైన ఫామ్‌లో ఉన్న నొవాక్ జొకోవిచ్ గొప్ప విజయంతో సీజన్‌కు ఘనమైన ముగింపు పలికాడు. పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో ఈ సెర్బియా స్టార్ విజేతగా నిలిచాడు. ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను వరుసగా నాలుగో ఏడాదీ నెగ్గడం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా జొకోవిచ్ కొత్త చరిత్ర సృష్టించాడు.
గతంలో ఇలీ నస్టాసే (రుమేనియా-1971, 1972, 1973లో), ఇవాన్ లెండిల్ (చెకోస్లొవేకియా-1985, 1986, 1987లో) మాత్రమే ఈ టైటిల్‌ను వరుసగా మూడేళ్లపాటు సాధించారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్ 6-3, 6-4తో మూడో సీడ్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్)పై విజయం సాధించాడు. 2008లో తొలిసారి ఈ టైటిల్ నెగ్గిన జొకోవిచ్ ఆ తర్వాత 2012, 2013, 2014లలో కూడా చాంపియన్‌గా నిలిచాడు.
విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 20 లక్షల 61 వేల డాలర్లు (రూ. 13 కోట్ల 68 లక్షలు), రన్నరప్ ఫెడరర్‌కు 11 లక్షల 78 వేల డాలర్లు (రూ. 7 కోట్ల 81 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. గంటా 20 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో జొకోవిచ్ కచ్చితమైన సర్వీస్‌లతో ఫెడరర్ జోరుకు పగ్గాలు వేశాడు.
ఐదు ఏస్‌లు సంధించిన ఈ నంబర్‌వన్ ర్యాంక్ ప్లేయర్ ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయలేదు. ముఖ్యంగా రెండో సర్వీస్‌లో జొకోవిచ్ నిలకడ అతని విజయంలో కీలకపాత్ర పోషించింది. రెండో సర్వీస్‌ను 19 సార్లు చేయగా అతను 16 సార్లు పాయింట్లు సాధించడం విశేషం. తన సర్వీస్‌లో రెండుసార్లూ బ్రేక్ పాయింట్లను కాపాడుకున్నాడు. మరోవైపు అజేయ రికార్డుతో ఫైనల్‌కు చేరిన ఫెడరర్ కీలక పోరులో తడబడ్డాడు. రెండో సర్వీస్‌లో ఒత్తిడికిలోనై విఫలమయ్యాడు. రెండో సర్వీస్‌ను 21 సార్లు చేసిన ఈ స్విస్ దిగ్గజం కేవలం తొమ్మిదిసార్లు మాత్రమే పాయింట్లు గెలిచాడు.
ఈ విజయంతో జొకోవిచ్ లీగ్ దశలో ఫెడరర్ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకున్నాడు. 2005 తర్వాత ఈ టోర్నీలో లీగ్ దశలో ఏ ప్లేయర్ చేతిలో ఓడారో... అతణ్నే ఫైనల్లో ఓడించి విజేతగా నిలిచిన క్రీడాకారుడిగా జొకోవిచ్ గుర్తింపు పొందాడు. 2005లో లీగ్ దశలో ఫెడరర్ చేతిలో ఓడిన నల్బంది యాన్ (అర్జెంటీనా)... ఫైనల్లో ఫెడరర్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచాడు.
ఓవరాల్‌గా ఈ ఏడాది జొకోవిచ్‌కు చిరస్మరణీయంగా నిలిచింది. మొత్తం 16 టోర్నమెంట్లలో పాల్గొన్న అతను 11 టైటిల్స్ సాధించాడు. ఇందులో మూడు గ్రాండ్‌స్లామ్స్ టైటిల్స్ ఉండటం విశేషం. ఓవరాల్‌గా ఈ ఏడాది 82 మ్యాచ్‌ల్లో గెలిచి, ఆరు మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడిపోయాడు. ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీని ఐదోసారి గెలవడం ద్వారా అత్యధికసార్లు ఈ టైటిల్‌ను సాధించిన వారి జాబితాలో జొకోవిచ్ సంయుక్తంగా రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇవాన్ లెండిల్, పీట్ సంప్రాస్‌లు కూడా ఐదుసార్లు చొప్పున ఈ టైటిల్‌ను సాధించారు. ఆరు సార్లు ఈ టైటిల్ నెగ్గి ఫెడరర్ అగ్రస్థానంలో ఉన్నాడు.