atrocity cases
-
బాబు వ్యాఖ్యలపై నిరసనల వెల్లువ
బాపట్ల/కర్నూలు(సెంట్రల్)/నెల్లూరు(పొగతోట): ఐఏఎస్ అధికారి విజయకుమార్‌ను ఉద్దేశించి మాజీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా సోమవారం కూడా నిరసనలు వెల్లువెత్తాయి. గుంటూరు జిల్లా బాపట్లలో చంద్రబాబు దిష్టిబొమ్మను డాక్టర్ అంబేడ్కర్ సేవా సమాజం, దళిత సంఘాల ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్ సర్కిల్ వద్ద దహనం చేశారు. చంద్రబాబూ క్షమాపణ చెప్పు.. లేదంటే బయట తిరగనివ్వబోం దళిత ఐఏఎస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల నాయకులు సోమవారం కర్నూలులో చంద్రబాబు దిష్టిబొమ్మను ఊరేగించి ఆందోళన చేశారు. కలెక్టరేట్ ఎదుట చంద్రబాబు దిష్టిబొమ్మను చెప్పులతో కొడుతూ దహనం చేసేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు లాక్కున్న దిష్టిబొమ్మను తమకు అప్పగించాలని రెండు గంటల పాటు రాస్తారోకో చేశారు. అనంతరం కలెక్టర్ వీరపాండియన్‌కు ఫిర్యాదు చేశారు. త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు. ఐఏఎస్ విజయకుమార్‌కు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆయనను బయట తిరగనివ్వబోమని హెచ్చరించారు. నెల్లూరులో ర్యాలీ నిర్వహించిన డీఆర్డీఏ, మెప్మా ఉద్యోగుల సంఘాలు దళితులకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డీఆర్డీఏ, మెప్మా ఉద్యోగుల సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. సంఘం నేతలు సోమవారం నెల్లూరులో ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. చంద్రబాబుపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ వి.వినోద్‌కుమార్‌కు వినతిపత్రమిచ్చారు. వ్యాఖ్యలను చంద్రబాబు వెనక్కి తీసుకోవాలి సాక్షి, అమరావతి: ఐఏఎస్ అధికారి విజయకుమార్‌ను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర మున్సిపల్ కమిషనర్ల సంఘం, మున్సిపల్ ఉద్యోగుల సంఘం చంద్రబాబును డిమాండ్ చేశాయి. రాజధాని అంశంలో ప్రభుత్వానికి బీసీజీ సమర్పించిన నివేదికలోని అంశాలను ప్రణాళిక విభాగం కార్యదర్శి హోదాలో విజయకుమార్ ప్రజలకు వివరించారని మున్సిపల్ కమిషనర్ల సంఘం అధ్యక్షురాలు అశాజ్యోతి, మున్సిపల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు డి.వెంకటరామయ్య సోమవారం వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకునే ప్రణాళికపరమైన నిర్ణయాలను ప్రజలకు వివరించడం ఆయన బాధ్యత అని తెలిపారు. కానీ ప్రతిపక్ష నేత చంద్రబాబు విజయకుమార్‌ను ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడటం సమంజసం కాదన్నారు. బాబును తక్షణమే అరెస్టు చేయాలి సెర్ప్ ఉద్యోగుల సంక్షేమ సంఘం డిమాండ్ సాక్షి, అమరావతి: సీనియర్ ఐఏఎస్ అధికారి విజయకుమార్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై తక్షణమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఉద్యోగుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దళితుల పట్ల ఆయనకి ఉన్న చిన్నచూపును బయటపెట్టిందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొమ్ము నాగరాజు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఉత్తరాంధ్ర దళిత ఉద్యోగుల సంఘం డిమాండ్ డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): ఐఏఎస్ అధికారి విజయకుమార్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రతిపక్ష నేత చంద్రబాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉత్తరాంధ్ర దళిత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రతినిధి, విశాఖ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ దాసు డిమాండ్ చేశారు. సోమవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా దళితులను కించపరుస్తూ మాట్లాడి వారిని మనోవేదనకు గురి చేశారన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి చంద్రబాబుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, లేకుంటే దళితులంతా ఏకమై రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో శ్రీకాకుళం జిల్లా దళిత జేఏసీ కన్వీనర్ కల్లేపల్లి రామ్‌గోపాల్ తదితరులు పాల్గొన్నారు. బాపట్లలో బాబు దిష్టిబొమ్మను దహనం చేస్తున్న దళిత సంఘం నేతలు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కిషోర్ గుంటూరు/చోడవరం: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నవరపు కిషోర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం గుంటూరు రూరల్ ఎస్పీ సీహెచ్ విజయారావును ఆయన కార్యాలయంలో కలసి వినతిపత్రమిచ్చారు. అనంతరం కిషోర్ విలేకరులతో మాట్లాడుతూ..ఐఏఎస్ అధికారి విజయకుమార్‌ను చులకన చేసి మాట్లాడిన చంద్రబాబును దళితులు క్షమించరన్నారు. బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ సీఎం చంద్రబాబుపై ఫిర్యాదు దళితులంటే మాజీ సీఎం చంద్రబాబుకు చులకన భావమని మరోసారి రుజువైందని మాల మహానాడు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐఏఎస్ అధికారి విజయకుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరుతూ మాలమహానాడు నాయకులు చోడవరం పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.ఈశ్వరరావుకు ఫిర్యాదు చేశారు. దళితులకు క్షమాపణలు చెప్పాలి మంగళగిరి: దళిత ఐఏఎస్ అధికారిని అవమానించేలా మాట్లాడి తాను దళిత, బీసీ అణగారిన వర్గాలకు వ్యతిరేకమని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారని, ఆయన వెంటనే దళితులకు క్షమాపణ చెప్పకపోతే తమ సత్తా చూపుతామని మాల మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు హెచ్చరించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని సంఘం కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. మూడు ప్రాంతాల్లో రాజధాని గురించి బోస్టన్ కమిటీ ఇచ్చిన నివేదికను మీడియాకు వెల్లడించిన ఐఏఎస్ అధికారి విజయకుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
అట్రాసిటీ కేసుల్లో అలసత్వం వద్దు
సాక్షి, హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో అలసత్వం వహించొద్దని జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ నందకుమార్ సాయి అధికారులను ఆదేశించారు. ఏదైనా ఘటన వెలుగుచూసిన వెంటనే బాధితులకు ఆర్థికసాయం అందించాలని, కేసు నమోదుతో పాటు చార్జిషీట్ ప్రక్రియను కూడా వేగంగా పూర్తి చేయాలన్నారు. అట్రాసిటీ కేసుల పరిష్కారం, పరిహారం పంపిణీలో ఆలస్యమైతే బాధితులకు చట్టంపై విశ్వసనీయత తగ్గే ప్రమాదముందని అభిప్రాయపడ్డారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా జాతీయ ఎస్టీ కమిషన్ చైర్పర్సన్ నందకుమార్ సాయి, సభ్యులు మాయా చింతం, హరిక్రిష్ణ దామొర్, హర్షబాయ్ చున్నిలాల్, సంయుక్త కార్యదర్శి ఎస్కే రాథో బృందం బుధవారం రాష్ట్రానికి చేరుకుంది. తొలిరోజు పర్యటనలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కమిషన్ సభ్యు లు పర్యటించారు. గురువారం రాష్ట్ర ఉన్నతాధికారులతో కమిషన్ సమావేశం నిర్వహించింది. నందకుమార్ సాయి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ ఎస్కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు వివిధ శాఖల కార్యదర్శులు, ప్రభుత్వ విభాగాధిపతులు హాజరయ్యారు . గిరిజన సంక్షేమం, జనజాతి తెగల అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను శాఖల వారీగా సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గిరిజన యూనివర్సిటీ మాత్రమే జాప్యం రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని నందకుమార్ స్పష్టం చేశారు. 500 కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామాలను కూడా గ్రామ పంచాయతీలుగా నవీకరణ చేసి గిరిజనుల్లో రాజకీయ చైతన్యం పెంచడం శుభపరిణామమంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు. మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనల్లో చెంచులు సాగుభూమి కావాలని కోరారని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తానన్నారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేస్తామన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్నట్లు తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆలస్యమవుతుందని కమిషన్ చైర్మన్ అభిప్రాయపడ్డారు. మౌలిక వసతులు కల్పించి త్వరలోనే అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. గిరిజనులకు ఉన్నత విద్య కల్పనకు గురుకులాల ఏర్పాటు, ఆశ్రమ పాఠశాలల అప్‌గ్రెడేషన్ బాగుందని, గిరిజనుల ఆరోగ్యంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. గిరిజన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో ఇప్పటికే పంపిణీ చేస్తున్నట్లు సీఎస్ జోషి వివరించారు. ఉపాధి హామీ పథకం కింద పనిదినాలను రెండు వందల రోజులకు పెంచాలని పలువురు గిరిజనులు తమను కోరినట్లు నందకుమార్ సాయి తెలిపారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి అజయ్‌మిశ్రా, రెవెన్యూ కార్యదర్శి సోమేశ్‌కుమార్, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా జెడ్ చొంగ్తు, అదనపు సంచాలకులు వి.సర్వేశ్వర్‌రెడ్డి, నవీన్ నికోలస్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులను ఇబ్బంది పెడితే అట్రాసిటీ కేసులు
జేసీ 2 రాజ్‌కుమార్ నెల్లూరు(సెంట్రల్): జిల్లాలో స్కాలర్‌షిప్పులపై చదువుకునే పేద విద్యార్థులను కళాశాల నిర్వాహకులు ఎటువంటి ఇబ్బందులకు గురి చేసినా అట్రాసిటీ కేసులు పెట్టాల్సి వస్తుందని జేసీ 2 రాజ్‌కుమార్ హెచ్చరించారు. నగరంలోని అంబేడ్కర్ భవన్లో గురువారం కళాశాల ప్రిన్సిపల్స్‌తో స్కాలర్‌షిప్పులపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆన్లైన్లో విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నా ఎందుకు సంబంధిత శాఖకు హార్డ్‌కాపీలను ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సాంఘిక సంక్షేమ శాఖ డీడీ మధుసూదన్‌రావు మాట్లాడుతూ స్కాలర్షిప్పులకు సరిపడా నగదు ఉందని హార్డ్‌కాపీలు ఇస్తే నగదు విడుదల చేస్తామని చెబుతున్నా ఎందుకు ఇవ్వడంలేదో అర్థం కావటం లేదన్నారు. హార్డ్‌కాపీలు ఇవ్వకుండా ఉండడమే కాకుండా విద్యార్థులు ఫీజులు కట్టాలని ఒత్తిడి తీసుకుని వస్తున్నట్లు విద్యార్థులు ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు. తక్షణమే ఎంత మంది ఆన్లైన్లో నమోదు చేసుకుంటే వారికి సంబంధించిన హార్ట్కాపీలను సాంఘిక, బీసీ కార్యాలయానికి పంపాలని సూచించారు. సమావేశంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సంజీవరావు పాల్గొన్నారు. -
అట్రాసిటీ కేసుల్లో శిక్షలు అంతంతే!
♦ 2015లో 237 కేసుల పరిష్కారం ♦ 22 కేసుల్లో 36 మందికే శిక్షలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సీలు, ఎస్టీలకు చెందిన వారిపై దాడులు, అత్యాచారాలకు సంబంధించి ఏటా కేసుల సంఖ్య పెరుగుతున్నా దోషులకు శిక్షలు పడుతున్నది మాత్రం నామమాత్రంగానే ఉంటోంది. ఎస్సీ, ఎస్టీల అట్రాసిటీ కేసులు, కోర్టుల్లో కేసుల పురోగతి తదితర అంశాలపై పార్లమెంటరీ కమిటీకి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదిక సమర్పించింది. అందులోని వివరాల ప్రకారం 2013లో మొత్తం 437 కేసులను కోర్టులు పరిష్కరించగా (నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 97), 23 కేసుల్లో 34 మందికి శిక్షలు పడ్డాయి. ఆ ఏడాది శిక్షల సరాసరి 5.26 శాతంగా నమోదైంది. అలాగే 2014లో మొత్తం 298 కేసులను కోర్టులు పరిష్కరించగా (ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 83), 18 కేసుల్లో 35 మందికి శిక్షలు పడ్డాయి. ఆ ఏడాది శిక్షల సరాసరి 6.04 శాతంగా ఉంది. 2015 విషయానికొస్తే మొత్తం 237 కేసులను కోర్టు పరిష్కరించగా (నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 58), 22 కేసుల్లో 36 మందికి శిక్షలు పడ్డాయి. ఆ ఏడాది శిక్షల సరాసరి 9.28 శాతంగా ఉంది. 2015లో హైదరాబాద్-సిటీ, నిజామాబాద్ జిల్లా, వరంగల్-రూరల్, కరీంనగర్ జిల్లా, ఆర్పీ సికింద్రాబాద్, సీఐడీ-టీఎస్ హైదరాబాద్ పరిధిలో ఒక్క కేసును కూడా కోర్టులు పరిష్కరించలేదు. రాష్ట్రంలో 2015లో (డిసెంబర్ మొదటివారం వరకు) మొత్తం 1,668 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదవగా అందులో 468 కేసుల్లో మాత్రమే పోలీసుస్టేషన్లలో అభియోగాల నమోదు (కే సెస్ ఛార్జ్డ్) జరిగింది. వాటిలోనూ 285 కేసుల్లోనే తదుపరి విచారణ (కేసెస్ రిఫర్డ్)కు ఆస్కారం ఏర్పడింది. 2011-14 మధ్య చోటుచేసుకున్న కేసులు కూడా దాదాపుగా ఇదే కోవలో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. -
'అట్రాసిటీ కేసులు త్వరగా పరిష్కారించేలా చర్యలు'
హైదరాబాద్: అట్రాసిటీ కేసులు త్వరగా పరిష్కారం అయ్యేందుకు చర్యలు తీసుకుంటామని ఏపీ సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్ బాబు చెప్పారు. శనివారం ఆయన ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసులపై సమీక్షించారు. చట్టాన్ని అమలు చేసి దళిత, గిరిజన బాధితులకు న్యాయం చేస్తామని అన్నారు. కేసుల పరిష్కారంలో గుర్తించిన లోపాలను త్వరలోనే సరిదిద్దుతామని రావెల కిశోర్‌బాబు పేర్కొన్నారు. -
ఎస్సీ,ఎస్టీల భూములు ఆక్రమిస్తే అట్రాసిటీ కేసులు
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ‘నిరుపేద ఎస్సీ,ఎస్టీలకు ప్రభుత్వం భూమి ఇచ్చింది. వారిని ఆ భూమిలోకి అడుగు పెట్టనీయకుండా ఇతర వర్గాలు అడ్డుకుంటే వెంటనే స్పందించాలి. హక్కుదారులైన ఎస్సీ,ఎస్టీలకు ఆ భూమిని అప్పగించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. అడ్డుకోకుండా చూస్తూ ఉంటే మనం ఉండి ఉపయోగం లేదు’ అని డీఎస్పీలు, ఇతర అధికారులతో కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ అన్నారు. ఎస్సీ,ఎస్టీలకు పంపిణీ చేసిన భూముల్లోకి వారిని రానీయకుండా ఎవరు అడ్డుకున్నా అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డీఎస్పీలను ఆదేశించారు. ఎస్సీ,ఎస్టీల పేరుతో బోగస్ పట్టాలు ఎక్కడైనా పొందితే పదిహేను రోజుల్లో నివేదిక అందించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన జిలా స్థాయి నిఘా మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.‘ఎస్సీ,ఎస్టీలు ఇతర వర్గాల చేతుల్లో దెబ్బతిని మన వద్దకు వస్తే ముందుగా బాధితుని పక్షానే సంబంధిత డీఎస్పీ ఉండాలన్నారు. అన్యాయం జరిగినట్లు తేలితే తప్పకుండా న్యాయం చేయాలి. ఆ కేసు ఫాల్స్ అని తేలితే వదిలేయాలి’ అని సూచించారు. ఎస్సీ,ఎస్టీలకు సంబంధించిన ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత పోలీసు, రెవెన్యూ అధికారులపై ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. వాట్ ఈజి దిస్ నాన్సెన్స్ ‘జిల్లా స్థాయి నిఘా మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగి ఆరు నెలలైంది. ఆరు నెలల తర్వాత కూడా విచారణకు సంబంధించిన సమాచారం లేదు. సమావేశం జరిగిన ఆరు నెలల తరువాత నోటీసు ఇచ్చానని చెబుతున్నావు. వాట్ ఈజ్ దిస్ నాన్సెన్స్’ అంటూ మార్కాపురం డీఎస్పీపై తీవ్ర స్థాయిలో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కాపురం మండలం గజ్జెలకొండలో తిరుమల ఆటో మొబైల్స్ ఫైనాన్స్ నిర్వాహకులు ఎస్సీ వ్యక్తిపై దాడి చేస్తే ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై మార్కాపురం డీఎస్పీని నిలదీశారు. కేసును పరిశీలిస్తున్నానని ఆయన సమాధానం చెప్పడంపై కలెక్టర్ మండిపడ్డారు. కల్చరల్ ప్రోగ్రాం చూసేందుకు వచ్చామా? ‘ఆరునెలల క్రితం జరిగిన జిల్లా స్థాయి నిఘా మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ప్రస్తావించిన అంశాన్ని మూడు నెలల్లో నివేదించాలని ఆదేశించాను. ఆరు నెలల తరువాత జరుగుతున్న సమావేశానికి ప్రాథమిక సమాచారం కూడా లేకుండా వచ్చారు. ఒకరి మొహం ఒకరు చూసుకుంటున్నారు. మనం కల్చరల్ ప్రోగ్రాం చూసేందుకు వచ్చామా’ అని ఒంగోలు ఆర్డీఓ ఎంఎస్ మురళి, ఒంగోలు తహసీల్దార్ మూడమంచు వెంకటేశ్వర్లుపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలు మండలం ముక్తినూతలపాడులో 6 ఎకరాల ప్రభుత్వ భూమిలో 2 ఎకరాలు గతంలో ఎస్సీలకు శ్మశాన వాటిక కింద కేటాయించారని, ఆ భూమిని అక్కడ ఉండే ఓ వ్యక్తి తనదంటూ ముందుకు రావడంపై గత సమావేశంలో సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో విచారించి పూర్తి స్థాయి నివేదికలతో రావాలని ఆదేశిస్తే సమాచారం లేకుండా ఎందుకు వచ్చారని వారిని నిలదీశారు. భారతం చదివేందుకు కాదు పిలిచింది భారతం,రామయణం చదివేందుకు కాదు ఇక్కడికి పిలిచిందని సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరక్టెర్ సరస్వతిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె డిపార్ట్మెంట్కు చెందిన కొందరు అధికారులు సమావేశానికి గైర్హాహాజరు కావడంపై కలెక్టర్ నిలదీశారు. విచారించకుండానే ఫాల్స్ అంటున్నారు: ఆండ్ర మాల్యాద్రి ఎస్సీ,ఎస్టీలు దాడులకు గురైన సమయంలో సంబంధిత డీఎస్పీలు పూర్తిస్థాయిలో విచారించకుండానే కేసు ఫాల్స్ అంటున్నారని కమిటీ సభ్యుడు ఆండ్ర మాల్యాద్రి ఆరోపించారు. డీఎస్పీ స్థాయి అధికారి విచారణ జరపకుండా కింది స్థాయిలో వచ్చే రిపోర్టును ఆధారం చేసుకుంటున్నారన్నారు. కొన్ని సమయాల్లో రాజకీయ ఒత్తిళ్లు వస్తుండటంతో కేసులు నీరుగారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొన్ని కేసులను ఆయన ప్రస్తావించారు. కలెక్టర్ జోక్యం చేసుకుని కేసు ఫాల్స్ అనుకున్నప్పుడు అన్యాయం జరిగి ఉంటుందా.. అన్న కోణంలో మరోసారి పరిశీలించాలని డీఎస్సీలను ఆదేశించారు. డీఎఫ్‌ఓకు షోకాజ్ నోటీసు జిల్లా స్థాయి నిఘా కమిటీ సమావేశానికి గైర్హాజరైన డీఎఫ్‌ఓకు షోకాజు నోటీసు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కీలకమైన ఈ సమావేశానికి ఆయన గైర్హాజర్ కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిటీ సభ్యుడు పేరం సత్యం మాట్లాడుతూ గిద్దలూరు పరిధిలోని 870 ఎరుకల కుటుంబాల వారు అటవీ ప్రాంతంలోకి వెళ్లి కర్రలు కొట్టుకొని జీవనం సాగిస్తున్నారని, అటవీశాఖ అధికారులు వారిని అడ్డుకుంటున్నారని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఎఫ్డీఓ వచ్చారా అని కలెక్టర్ మరోమారు ప్రస్తావించారు. ఆయన రాలేదని చెప్పడంతో షోకాజ్ నోటీసు ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమావేశానికి ప్రజాప్రతినిధులు హాజరు కాకపోవడం గమనార్హం. సమావేశంలో ఎస్పీ ప్రమోద్‌కుమార్, జాయింట్ కలెక్టర్ యాకూబ్ నాయక్, జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్‌గౌడ్, కమిటీ సభ్యులు బిళ్లా చెన్నయ్య, పేరం ప్రభాకర్‌తోపాటు ఆర్డీఓలు, డీఎస్పీలు పాల్గొన్నారు.