సీనియర్ మంత్రులతో మోదీ అత్యవసర భేటీ
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం సీనియర్ మంత్రలుతో అత్యవసరంగా భేటీ అయ్యారు. పంజాబ్‌లో ఉగ్రవాదుల దాడి ఘటనపై ఈ సందర్భంగా చర్చించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడూ సమీక్షించాలని సూచించారు. మరోవైపు పంజాబ్‌లో ఉగ్రవాదుల దాడి ఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఉగ్రవాదుల్ని మట్టుబెట్టేందుకు బీఎస్ఎఫ్ బలగాలను రంగంలోకి దింపింది. ఢిల్లీ సహా మెట్రో నగరాల్లో హై అలర్ట్ ప్రకటించింది. అప్రమత్తంగా ఉండాలంటూ అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీచేసింది. దీనానగర్ పోలీస్ స్టేషన్ పై ఉగ్రవాదుల దాడి, అనంతర పరిణామాలపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.
కాగా పంజాబ్‌లోని గురుదాస్ పూర్ జిల్లా దీనానగర్ పోలీస్ స్టేషన్‌పై ఆర్మీ దుస్తులు ధరించిన నలుగురు సాయుధులు కాల్పులకు తెగబడ్డారు. సోమవారం ఉదయం నుంచి కొనసాగుతున్న కాల్పుల్లో ఇప్పటివరకూ ఐదుగురు మృతి చెందారు. వారిలో నలుగురు సాధారణ పౌరులు కాగా, ఇద్దరు పోలీసులు ఉన్నారు. మరో పదిమంది గాయపడ్డారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.