attendance system
-
పాఠశాలకు డుమ్మా కొట్టడం ఇకపై కుదరదు.. ఇంట్లో తెలిసిపోద్ది!
సాక్షి, భీమవరం: అమ్మా.. బడికి వెళుతున్నానని ఇంటిలో చెప్పి స్నేహితులతో కలిసి షికార్లు కొడుతూ పాఠశాలకు డుమ్మా కొట్టడం ఇకపై కుదరదు.. ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్లో స్టూడెంట్ అటెండెన్స్ యాప్ ద్వారా హాజరు నమోదు చేయడంతో విద్యార్థులు ఉదయం 9.30 గంటలలోపు పాఠశాలకు రాకుంటే తల్లిదండ్రులకు మెసేజ్ వెళ్లేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపించే అవకాశం ఏర్పడింది. ప్రత్యేక యాప్‌తో ప్రయోజనాలెన్నో.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం పెంచడానికి, మధ్యాహ్న భోజన పథకంలో అక్రమాలు జరగకుండా ప్రభుత్వం తీసుకువచ్చిన స్టూడెంట్ అటెండెన్స్ యాప్ దోహదపడుతోంది. ప్రభుత్వ పాఠశాల ఉదయం 9 గంటలకు ప్రారంభమైతే ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆయా క్లాసుల్లో ఉదయం 9.15 గంటల నుంచి 9.30 గంటల వరకు హాజరు వేస్తారు. పాఠశాల ఉపాధ్యాయుడు తన తరగతికి వెళ్లిన వెంటనే సెల్ఫోన్లో స్టూడెంట్ అటెండెన్స్ యాప్ లాగిన్ అయ్యి విద్యార్థుల హాజరు నమోదు చేస్తారు. సాయంత్రం పూట గతంలో మాదిరి హాజరు పట్టీలో మ్యాన్యువల్‌గా నమోదు చేస్తారు. ఉదయం యాప్‌లో విద్యార్థి హాజరు నమోదు కాకుంటే వెంటనే తల్లిదండ్రుల సెల్‌ఫోన్‌కు మెసేజ్ వెళుతుంది. దీంతో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలు బడికి రాకపోవడానికి గల కారణాలను పాఠశాలలకు వెళ్లి ఉపాధ్యాయులకు తెలియజేస్తున్నారు. కార్పొరేట్ సవ్వడి రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. అమ్మఒడి, జగనన్న గోరుముద్ద, విద్యాకానుక, విద్యాదీవెన, వసతి దీవెన వంటి పథకాలను అమలుచేయడంతో పాటు ఇంగ్లిష్ మీడియం చదువులను ప్రవేశపెట్టారు. మన బడి నాడు–నేడులో భాగంగా పాఠశాలలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తరగతి గదులు, ఫరి్నచర్, తాగునీరు, మరుగుదొడ్లు, ఆటస్థలాలు వంటి వసతులు కలి్పస్తున్నారు. అన్ని పాఠశాలల్లో.. జిల్లాలోని 1,391 ప్రభుత్వ, 472 ప్రైవేట్ పాఠశాలల్లో స్టూడెంట్ అటెండెన్స్ యాప్ అమలుచేస్తున్నాం. దీంతో విద్యార్థులు తప్పని సరిగా క్లాసులకు హాజరవుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా సమాచారం వెళుతుండటంతో వారి పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టే అవకాశం ఏర్పడింది. – ఆర్.వెంకటరమణ, జిల్లా విద్యాశాఖాధికారి, భీమవరం హాజరు శాతం పెరిగింది స్టూడెంట్ అటెండెన్స్ యాప్ కారణంగా హాజరుశాతం పెరిగింది. ప్రభుత్వం అమలుచేస్తున్న అమ్మఒడి పథకానికి హాజరు శాతం తప్పనిసరి కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులకు తమ పిల్లలు హాజరు కాకుంటే వారికి నచ్చచెప్పి స్కూల్‌కు పంపిస్తున్నారు. దీని కారణంగా పాఠశాలల్లో విద్యార్థుల హాజరు పెరిగింది. – వి.రాధాకృష్ణ, ఉపాధ్యాయుడు, పీఎస్ఎం స్కూల్, భీమవరం చాలా బాగుంది ప్రభుత్వం విద్యకు ఇస్తున్న ప్రాధాన్యం అభినందనీయం. విద్యార్థులు సక్రమంగా పాఠశాలకు వెళ్లేలా స్టూడెంట్ అటెండెన్స్ యాప్ చాలా బాగుంది. మా అమ్మాయి 7వ తరగతి చదువుతోంది. ఎప్పుడైనా బడికి వెళ్లకపోతే మెసేజ్ వస్తుంది. స్కూల్‌కు వెళ్లకపోవడానికి గల కారణాలను టీచర్స్‌కు వివరిస్తున్నాం. – ఎన్.వరలక్ష్మి, విద్యార్థిని తల్లి, దొంగపిండి -
ఐదు జవాబులు రాస్తే సరి..
సాక్షి, హైదరాబాద్: జేఎన్టీయూహెచ్ సాంకేతిక విద్య కోర్సుల్లోని విద్యార్థులకు యూనివర్సిటీ ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కనీస హాజరుశాతం నుంచి మినహాయింపునిచ్చింది. అలాగే సులభతరమైన పరీక్షావిధానాన్ని ప్రకటించింది. గతానికి భిన్నంగా ఈ సారి కేవలం 8 ప్రశ్నలనే పరీక్షల్లో ఇస్తారు. ఇందులో ఐదింటికి సమాధానం రాస్తే సరిపోతుంది. బీటెక్, బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మాడీ, ఫార్మాడీ (పీబీ) కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ఇది వర్తిస్తుందని జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ డాక్టర్ మంజూర్ హుస్సేన్ బుధవారం ‘సాక్షి’ప్రతినిధికి తెలిపారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4 లక్షల (నాలుగేళ్లకు కలిపి)మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. మిగతా యూనివర్సిటీలు కూడా ఇదే విధానాన్ని అనుసరించనున్నట్టు ఉన్నత విద్యామండలి వర్గాలు తెలిపాయి. గతానికి ఇప్పటికీ తేడా ♦సాధారణంగా కాలేజీ పనిదినాల్లో 75 శాతం హాజరు ఉంటేనే పరీక్షలకు అనుమతిస్తారు. ఇందులో 10 శాతం మెడికల్ గ్రౌండ్లో మినహాయింపు ఉంటుంది. కానీ ఈ సంవత్సరం ప్రత్యక్ష బోధన ఆలస్యమైంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని హాజరు శాతాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. ♦కరోనాకు ముందు ప్రశ్నపత్రం రెండు భాగాలుగా (పార్ట్–ఏ, పార్ట్–బీ) ఉండేది. పార్ట్–ఏ నుంచి మూడు మార్కుల ప్రశ్నలు ఐదు, రెండు మార్కులవి 5.. మొత్తం 25 మార్కులుంటాయి. పార్ట్–బీలో ఐదు మార్కుల ప్రశ్నలు 10 ఇస్తారు. దీంతో రెండు పార్టుల్లో మొత్తం 75 మార్కులు, ఇంటర్నల్స్ 25 మార్కులకు పరీక్ష విధానం ఉండేది. ♦ఇప్పుడు ఒకే పార్ట్‌గా పరీక్ష ఉంటుంది. మొత్తం 8 ప్రశ్నలిస్తారు. ఇందులో ఐదింటికి జవాబులు రాస్తే సరిపోతుంది. ఒక్కో ప్రశ్నకు 15 మార్కులు.. మొత్తం 75 మార్కులుంటాయి. ఇంటర్నల్స్‌కు 25 మార్కులు ఉంటాయి. కనీస పాస్ మార్క్ 40 (ఇంటర్నల్స్‌తో కలిపి)గా నిర్ణయించారు. -
బయోమెట్రిక్‌తో అక్రమాలకు చెల్లు..!
సాక్షి, నల్లగొండ: హాస్టళ్లలో అక్రమాలకు చెక్ పడనుంది. సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో ప్రభుత్వం బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇకనుంచి పిల్లల హాజరు అంతా బయోమెట్రిక్ పద్ధతిలోనే తీసుకుంటారు. ఏరోజు ఎంతమంది విద్యార్థులు బయోమెట్రిక్ ద్వారా హాజరువేస్తారో వారికే ప్రభుత్వం బిల్లు చెల్లిస్తుంది. తద్వారా అక్రమాలకు చెక్ పడనుంది. గతంలో రిజిష్టర్ల ద్వారా హాజరు తీసుకునేవారు. దాంతో పిల్లలు ఉన్నా లేకున్నా ఎక్కువ రాసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ బయోమెట్రిక్ యంత్రాల కారణంగా అలాంటి వాటికి అవకాశాలు ఉండవు. ప్రస్తుతం కళాశాలల్లో చదవని విద్యార్థులు కూడా హాస్టళ్లలో ఉంటూ వస్తున్నారు. అలాంటి వారికి కూడా ఇక నుంచి చెక్ పడనుంది. ప్రభుత్వానికి కూడా ఆదాయం మిగలనుంది. జిల్లాలో 61 ఎస్సీ హాస్టళ్లు జిల్లా వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో 61 హాస్టళ్లు ఉన్నాయి. అందులో 46 ప్రీమెట్రిక్ హాస్టళ్లు ఉండగా 15 కళాశాల హాస్టళ్లు ఉన్నాయి. వీటన్నింటికీ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బయోమెట్రిక్ యంత్రాలను బిగించాలని నిర్ణయించారు. ఇప్పటికే జిల్లాకు యంత్రాలను పంపించారు. జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ డివిజన్లలోని హాస్టళ్లన్నింటికీ బ యోమెట్రిక్ మిషన్లను బిగించగా దేవరకొండ డివిజన్లో ఇంకా కొనసాగుతోంది. వారం రోజుల్లోగా అన్ని హాస్టళ్లకు బయోమెట్రిక్ మిషన్లను బిగించనున్నారు. బయోమెట్రిక్ ద్వారానే హాజరు.. గతంలో హాస్టళ్లలో విద్యార్థుల హాజరు రిజిస్టర్ల ద్వా రా కొనసాగేది. హాస్టల్లో ఉన్న విద్యార్థుల కంటే ఎ క్కువ మంది విద్యార్థులు ఉన్నట్లుగా పేర్లు రాసుకోవడం.. వారు ఇళ్లకు వెళ్లినా ఉన్నట్లుగా నమోదు చేసి.. కొం దరు హాస్టల్ వెల్ఫేర్ అధికారులు తప్పుడు బిల్లులు పొందేవారు. తద్వారా ప్రభుత్వ ఆదాయానికి ఎంతో గండి పడేది. ప్రస్తుతం ఈ బయోమెట్రిక్ మిషన్ల కారణంగా అలాంటి వాటికి చెక్ పడనున్నాయి. ఏరోజు బిల్లు ఆరోజే జనరేట్ హాస్టల్లో విద్యార్థి బయోమెట్రిక్ ద్వారా హాజరు వేస్తారు. దాంతో ఆరోజులో ఎంతమంది విద్యార్థులు ఆ హాస్టల్ నుంచి బయోమెట్రిక్ ద్వారా వేలి ముద్రవేస్తారో వారికి హాజరు ఆన్లైన్లో రికార్డు అవుతుంది. ఆ రోజే పిల్లలు చేసిన భోజనానికి సంబంధించిన బిల్లు జనరేట్ అవుతుంది. అలా నెల రోజులపాటు హాజరైనటువంటి విద్యార్థులకు సంబంధించి బిల్లులను నెలనాడు సంబంధింత హాస్టల్ వెల్ఫేర్ అధికారి తీసుకొని బిల్లుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. చదివే పిల్లలకే భోజనం.. ప్రస్తుతం మాన్యువల్ పద్ధతిన హాజరు తీసుకోవడం వల్ల కొన్ని హాస్టళ్లలో వార్డెన్లకు నచ్చజెప్పి కొందరు విద్యార్థులు ఉంటున్నారు. కొందరు చదువుకుంటుండగా మరికొందరు ఊరికే హాస్టల్లో ఉంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొందరు హాస్టల్ అధికారులను కూడా బెదిరించిన హాస్టల్లో ఉంటున్నారని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. బయోమెట్రిక్ విధానం అమలైతే.. ఇక బయటి వ్యక్తులు హాస్టల్లో ఉంటే వారికి భోజనం పెట్టలేని పరిస్థితి. ఒకవేళ పెట్టినా అతనికి సంబంధించిన బిల్లురాదు. దాంతో అధికారే జేబు లో నుంచి కట్టాల్సి రావచ్చు. ఈ పరిస్థితుల్లో వారు హాస్టల్లో భోజనం పెట్టే పరిస్థితి ఉండదు. చదువుకునే పిల్లలే హాస్టల్లో ఉండే అవకాశం రానుంది. బయోమెట్రిక్ యంత్రాలు బిగిస్తున్నారు.. జిల్లాలోని అన్ని సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో బయోమెట్రిక్ యంత్రాలను బిగిస్తున్నారు. ఇప్పటికే నల్లగొండ, మిర్యాలగూడ డివిజన్లలో యాంత్రాల బిగింపు పూర్తయింది. దేవరకొండ డివిజన్లలో ఏర్పాటు చేస్తున్నారు. అన్నీ పూర్తి కాగానే విద్యార్థులకు నెంబర్ అలాట్ చేసి ఆతర్వాత బయోమెట్రిక్ ద్వారా ప్రతి రోజూ హాజరు నమోదు చేస్తాం. – రాజ్‌కుమార్, డీడీ, సాంఘిక సంక్షేమ శాఖ -
భయోమెట్రిక్
► అంగన్వాడీ కేంద్రాల్లో అమలుకు సన్నద్ధం ► అంగన్వాడీలకు రోజుకు మూడుసార్లు హాజరు ► ఉదయం తొమ్మిది గంటలకు వచ్చిన చిన్నారులకే పోషకాహారం ► ఆందోళనలో అంగన్వాడీలు ఒంగోలు టౌన్ : అంగన్వాడీలను బయోమెట్రిక్ భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పటివరకు కొన్ని శాఖలకే పరిమితమైన బయోమెట్రిక్ విధానాన్ని తాజాగా అంగన్ వాడీ కేంద్రాల్లో కూడా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణరుుంచడంతో కార్యకర్తలు, ఆయాలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రకరకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్న సమయంలో బయోమెట్రిక్ రాకతో తమను మరింత మానసిక క్షోభకు గురిచేస్తారేమోనని అనేక మంది అంగన్వాడీలు వాపోతున్నారు. బయోమెట్రిక్ నుంచి అంగన్వాడీ కేంద్రాలకు మినహారుుంపు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రాజెక్టుల స్థారుులో సీడీపీఓలు, జిల్లా స్థారుులో ప్రాజెక్టు డెరైక్టర్‌ను కలిసి బయోమెట్రిక్ విధానం వల్ల కలిగే ఇబ్బందులను వివరించేందుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు ఆధ్వర్యంలో 21 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నారుు. వాటి పరిధిలో 4,244 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నారుు. వీటి పరిధిలో ప్రస్తుతం 31 వేల మంది గర్భిణులు, 30 వేల మంది బాలింతలు, ఆరునెలల నుంచి మూడేళ్లలోపు చిన్నారులు లక్షా 27 వేల మంది, మూడు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు 97 వేల మంది ఉన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు ప్రతినెలా 25 రోజులకు సరిపడే విధంగా 3 కేజీల బియ్యం, అరకేజీ కందిపప్పు, 400 గ్రాముల వంటనూనె, వారానికి నాలుగు కోడిగుడ్లు చొప్పున అందిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లోని మూడు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు వారానికి నాలుగు కోడిగుడ్లు అక్కడే వండి పోషకాహారం కింద అందిస్తుంటారు. ఆందోళన కలిగిస్తున్న హాజరు విధానం... అంగన్వాడీ కేంద్రాల్లో అమలు చేయనున్న బయోమెట్రిక్‌లో హాజరు విధానం అంగన్వాడీలను ఆందోళనకు గురిచేస్తోంది. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ప్రతిరోజూ మూడుసార్లు హాజరు విధానాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. ఉదయం తొమ్మిది గంటలకు, మధ్యాహ్నం ఒంటిగంటకు, సాయంత్రం నాలుగు గంటలకు కచ్చితంగా బయోమెట్రిక్ ద్వారా హాజరు తీసుకోనున్నారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని చిన్నారులకు కూడా బయోమెట్రిక్ ద్వారా హాజరు తీసుకోనున్నారు. సరిగ్గా ఉదయం తొమ్మిది గంటలకు చిన్నారుల హాజరు తీసుకోనున్నారు. ఆ సమయానికి ఎంతమంది చిన్నారులు అంగన్వాడీ కేంద్రాల్లో ఉంటే వారికి మాత్రమే పోషకాహారం అందించాలని ఆదేశాలు ఉన్నారుు. ఈ నేపథ్యంలో అంగన్వాడీలు మాత్రం ఠంచనుగా తమకు సూచించిన సమయానికి హాజరు వేసినప్పటికీ చిన్నారులను కేంద్రాలకు తీసుకురావడం మాత్రం కష్టతరమని అంగన్వాడీలు అంటున్నారు. ప్రభుత్వ నిర్ణయం కారణంగా చిన్నారులను సరిగ్గా తొమ్మిది గంటలకు కేంద్రాలకు తీసుకురావడం కష్టమని వాపోతున్నారు. చిన్నారులకు సంబంధించి బయోమెట్రిక్ విధానంలో వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు. గర్భిణులు, బాలింతలకు తప్పని తిప్పలు... ప్రైవేట్ కాన్వెంట్లకు ధీటుగా అంగన్వాడీ కేంద్రాల్లో కూడా విద్యనందించాలని ప్రభుత్వం నిర్ణరుుంచింది. అందులో భాగంగా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులకు సంబంధించి ఒకేచోట విద్యనందించేందుకు కసరత్తు చేస్తున్నారు. అంటే ఒక ప్రాంతంలో విడివిడిగా ఉంటున్న మూడు అంగన్వాడీ కేంద్రాలను ఒకేచోటకు తీసుకువచ్చి అక్కడ నిర్వహించాలని అన్ని జిల్లాలకు ఆదేశాలు అందారుు. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాలను ఒకచోటికి తీసుకువచ్చే కసరత్తు జిల్లాలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్న వాటిని మరోచోటకు మార్చడం వల్ల ఆ కేంద్రం పరిధిలోని గర్భిణులు, బాలింతలకు సంబంధించిన బయోమెట్రిక్ హాజరు కూడా కష్టంగా మారనుంది. వారిని దూర ప్రాంతాల్లో ఉండే అంగన్వాడీ కేంద్రాలకు తీసుకువచ్చి బయోమెట్రిక్ ద్వారా నిత్యవసర సరుకులు అందించాల్సి ఉంటుంది. అరుుతే గర్భిణులు, బాలింతలు అంతదూరం రాలేకపోతే వారికి నిత్యవసర సరుకులు దూరం కానున్నారుు. ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని అంగన్వాడీలు కోరుతున్నారు. -
విద్యా కార్యక్రమాలు అన్నింటిలోనూ బయోమెట్రిక్
ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరేకాదు.. మధ్యాహ్న భోజనం తదితర పథకాలన్నింటికీ వర్తింపు ఆధార్‌తోనూ అనుసంధానం, నిర్వహణకు ప్రత్యేక సర్వర్ చర్యలు చేపడుతున్న విద్యాశాఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల రోజువారీ హాజరు కోసం బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టిన విద్యాశాఖ.. తాజాగా అన్ని విద్యా కార్యక్రమాలు, విద్యార్థుల మధ్యాహ్న భోజనం, ఉచిత యూనిఫారాలు, పాఠ్య పుస్తకాలు, రవాణా సదుపాయం వంటి ప్రయోజనాలకు కూడా బయోమెట్రిక్‌ను అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. దీనిని ఆధార్‌తోనూ అనుసంధానం చేసి తప్పుడు సమాచారానికి ఆస్కారం లేకుండా, విద్యా ప్రయోజనాలు దుర్వినియోగం కాకుండా చూడాలని భావిస్తోంది. వీటితోపాటు అకడమిక్ అంశాలు, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు వంటి అన్నింటిలోనూ బయోమెట్రిక్ హాజరు, ఆధార్ అనుసంధానంతో పక్కాగా చర్యలు చేపట్టాలని భావిస్తోంది. ఇందుకోసం విద్యాశాఖ ప్రత్యేక సర్వర్‌ను ఏర్పాటు చేసి, నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ (ఎన్ఐసీ) ఆధ్వర్యంలో నిర్వహించేందుకు చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలోని 61 లక్షల మంది విద్యార్థుల ఆధార్ సమాచారాన్ని అథెంటికేషన్ యూజర్ ఏజెన్సీ(ఏయూఏ) కింద తమకు ఇవ్వాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ)కు విద్యాశాఖ లేఖ రాసింది. ఇప్పటికే పూర్తయిన 60 శాతం ఆధార్ రాష్ట్రంలో ఇప్పటికే 60 శాతానికిపైగా విద్యార్థుల ఆధార్ సమాచారాన్ని సేకరించిన విద్యాశాఖ.. రెండు నెలల్లో మిగతా విద్యార్థుల ఆధార్ సమాచారాన్ని సేకరించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 61 లక్షల మంది విద్యార్థులు ఉండగా ఇప్పటికే 40 లక్షల మందికిపైగా విద్యార్థుల ఆధార్ పూర్తయింది. ఆధార్ నెంబరు లేని వారు తీసుకునేలా చర్యలు చేపట్టాలని అన్ని పాఠశాలల అధికారులు, యాజమాన్యాలను ఆదేశించింది. రాష్ట్రంలో 25,561 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, అందులో మొదట 6,391 పాఠశాలల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసేలా చర్యలు చేపట్టింది. మిగతా 19,170 ప్రభుత్వ పాఠశాలలతోపాటు ప్రైవేటు పాఠశాలల్లోనూ బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేసేందుకు చర్యలు ప్రారంభించింది. దీని ద్వారా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ఎంత మంది విద్యార్థులకు అందాయన్నది స్పష్టంగా తెలియనుంది. విద్యార్థుల వయసు పెరిగే కొద్దీ వేలిముద్రలు మారే అవకాశం ఉన్నందునా బయోమెట్రిక్ డాటాను ఐదేళ్లకోసారి అప్డేట్ చేస్తామని విద్యాశాఖ తెలిపింది.