ఆటో బావిలో పడి...నలుగురి మృతి
ఖమ్మం: ఖమ్మం జిల్లాలో శుక్రవారం రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తిరుమలాయపాలెం మండలం బచ్చోడు వద్ద ఓ ఆటో అదుపుతప్పి బావిలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో నవ వరుడు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
వివరాల్లోకి వెళ్లితే..నల్లగొండ జిల్లా కోదాడ మండల తుమ్మర గ్రామానికి చెందిన లక్ష్మణ్ (25)కు, తిరుమలాయపాలెం మండలం వాంకుడోతు తండాకు చెందిన బుల్లితో గత నెల 20న వివాహం జరిగింది. శనివారం పుట్టింట్లో ఓ శుభకార్యక్రమం ఉండడంతో బుల్లి తన భర్త లక్ష్మణ్‌తోపాటు బంధువులతో కలసి ఆటోలో బయల్దేరింది.
వేగంగా వెళుతున్న ఆటో బచ్చోడు తండా దాటిన తర్వాత అదుపుతప్పి కాల్వలోకి దూసుకువెళ్లి అక్కడే ఉన్న బావిలో పడిపోయింది. లక్ష్మణ్‌తో పాటు జ్యోతి (45), లింగ (50) దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. బుల్లితోపాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ దేవేందర్ (25) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.