వాయిదాలు మానుకోండి
లాయర్లకు సీజేఐ జస్టిస్ మిశ్రా హితవు
సాక్షి, చెన్నై: కేసుల వాయిదా, సాగదీయడం వంటి వ్యాధులతో ఏ న్యాయవాది బాధపడకూడదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అన్నారు. మద్రాసు హైకోర్టు వారసత్వ భవంతి 125వ వార్షికోత్సవంలో శనివారం ఆయన ప్రసంగిస్తూ..సమయపాలన న్యాయ నియమావళి లక్షణమని పేర్కొన్నారు.
‘సమయపాలన తప్పనిసరి బాధ్యతగా ధర్మాసనంలోని సభ్యులు, న్యాయవాదులు అర్థం చేసుకోవాలి. న్యాయవాది కేసు వాయిదా, సాగదీయడం చేస్తుంటే.. న్యాయమూర్తి సరైన సమయానికి ధర్మాసనంపైకి రావడం లేదు. వారిద్దరు న్యాయ నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నారు’ అని జస్టిస్ మిశ్రా అన్నారు. ఒకవేళ న్యాయమూర్తి వాయిదాకు మొగ్గు చూపితే.. కేసుతో తాను సిద్ధమని.. విచారణ కొనసాగించాలని మర్యాదపూర్వకంగా న్యాయవాది చెప్పాలని జస్టిస్ మిశ్రా సూచించారు.
పెండింగ్ కేసుల సత్వర పరిష్కారంపై న్యాయవాదులు, న్యాయమూర్తులు దృష్టి పెట్టాలని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పిలుపునిచ్చారు. పదేళ్లకు పైగా సాగుతున్న పెండింగ్ కేసుల్ని పరిష్కరించేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా 1894 నాటి అతి పెద్ద లైట్ హౌస్‌ను జస్టిస్ మిశ్రా ప్రారంభించారు. ఈ లైట్హౌస్కు ఇటీవలే మరమ్మతులు చేసి పునరుద్ధరించారు. కార్యక్రమంలో తమిళనాడు సీఎం పళనిస్వామి, రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి షణ్ముగం, మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ, సీనియర్ న్యాయవాది భానుమతి, జడ్జీలు, లాయర్లు పాల్గొన్నారు