జయప్రదపై ఎస్పీ నేత అభ్యంతరకర వ్యాఖ్యలు
లక్నో : బీజేపీలో చేరిన మాజీ ఎంపీ, నటి జయప్రదపై ఎస్పీ నేత ఆజం ఖాన్ సన్నిహితుడు, ఆ పార్టీ సంభాల్ జిల్లా అధ్యక్షుడు ఫిరోజ్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో జయప్రద యూపీలోని రాంపూర్ నుంచి ఎస్పీ నేత ఆజం ఖాన్‌తో తలపడతారని భావిస్తున్న సంగతి తెలిసిందే. రాంపూర్ ప్రజలను జయప్రద తన నృత్యాలతో ఆకట్టుకుంటారని ఫిరోజ్ ఖాన్ వ్యాఖ్యానించారు. జయప్రదను చూసేందుకు తమ జిల్లా ప్రజలు రాంపూర్‌కు తరలివెళతారని చెప్పుకొచ్చారు.
జయప్రద గతంలో ఎస్పీ నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. ఆమె ప్రస్తుతం బీజేపీలో చేరి గతంలో తమ పార్టీ సహచరుడు ఎస్పీ నేత ఆజం ఖాన్‌పై రాంపూర్ నుంచి పోటీ చేయనున్నారు. కాగా గతంలో ఆజం ఖాన్ సైతం జయప్రదపై అభ్యంతరకర వ్యాక్యలు చేశారు. మరోవైపు జయప్రదను ఎస్పీలోకి తీసుకువచ్చి రాంపూర్ లోక్‌సభ స్ధానం నుంచి గెలుపొందేలా ఆజం ఖాన్ చొరవ చూపడం గమనార్హం. అయితే జయప్రద ఎస్పీ మాజీ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ వర్గంలో చురుకుగా వ్యవహరించడంతో వీరిద్దరి మధ్య విభేదాలు నెలకొన్నాయి. 2009 లోక్‌సభ ఎన్నికల్లో జయప్రదకు వ్యతిరేకంగా ఆజం ఖాన్ వర్గీయులు ప్రచారం చేశారు. ఇక ఆజం ఖాన్ తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తుండగా జయప్రద ఇప్పటికే రాంపూర్ నుంచి రెండు సార్లు గెలుపొందారు.