బినామీ ఆస్తుల కేసులో బబన్‌కు మూడేళ్ల జైలు
సాక్షి, ముంబై: తిరుగుబాటుదారులతో సతమతమవుతున్న శివసేనకు మరో షాక్ తగిలింది. ఈ సారి శివసేనకు తిరుగుబాటుదారులతోకాకుండా కోర్టు నుంచి ఆ పార్టీకి తేరుకోలేని దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ఆ పార్టీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో షిరిడీ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా ప్రకటించిన మాజీ మంత్రి బబన్‌రావ్ ఘోలప్పై 14 ఏళ్ల కిందట నమోదైన బినామీ ఆస్తుల కేసుకు సంబంధించి శుక్రవారం కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ మేరకు బబన్‌రావ్ ఘోలప్‌కు మూడేళ్లపాటు జైలు శిక్షతోపాటు రూ. లక్ష జరిమానా విధించింది. 1995-99 మద్యకాలంలో శివసేన-బీజేపీలు అధికారంలో ఉండగా బబన్‌రావ్ ఘోలప్ మంత్రిగా విధులు నిర్వహించారు.
అదే సమయంలో ఆయన అనేక బినామీ ఆస్తులను సంపాదించారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై మిలింద్ యావత్కర్ ఫిర్యాదు చేశారు. అలాగే ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే కూడా ఆయనపై విమర్శలు గుప్పించారు. అదే సమయంలో బబన్‌రావ్ మంత్రి పదవిని కూడా కోల్పోయారు. గత 14 ఏళ్లుగా కోర్టులో కేసు విచారణ కొనసాగుతోంది. ఎట్టకేలకు శుక్రవారం కోర్టు తీర్పు వెలువడింది. తన తీర్పులో నిందితుడైన బబన్‌రావ్ ఘోలప్‌కు మూడేళ్లపాటు జైలు శిక్షతోపాటు రూ. ఒక లక్ష జరిమానా విదించింది.
బబన్‌రావ్ రాజకీయ జీవితానికి ముప్పు..?
కోర్టు తీర్పు అనంతరం బబన్‌రావ్ రాజకీయజీవితానికి ముప్పు ఏర్పడిందని చెప్పవచ్చు. సుప్రీంకోర్టు గతంలో ప్రకటించిన ఆదేశాల మేరకు రెండేళ్లకంటే అధికంగా శిక్షపడినవారు ఎన్నికల్లో పోటీ చేయరాదు. దీంతో బబన్‌రావ్ ఘోలప్ అభ్యర్థిగా ఉంటారా లేదా శివసేన మరో అభ్యర్థిని ప్రకటిస్తుందా అనేది వేచిచూడాల్సిందే.
ఆస్తులను జప్తుచేయాలి... అన్నా హజారే
బబన్‌రావ్ ఘోలప్‌కు కోర్టు వేసిన శిక్షపై అన్నా హజారే హర్షం వ్యక్తం చేశారు. రాజకీయపార్టీలకు కూడా ఇది ఒక గుణపాఠం కావాలన్నారు. అవినీతి రాజకీయనాయకులను అసెంబ్లీ, పార్లమెంట్‌కు పంపొద్దన్న సందేశానికి ఈ తీర్పు బలం చేకూరేలా చేసింది. ఇలాంటి అవినీతికి పాల్పడేవారి ఆస్తులను ప్రభుత్వం జప్తు (స్వాధీనం) చేసుకోవాలి.