‘నా వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నా..’
సాక్షి, హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమ టాలీవుడ్‌పై టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు దుమారం రేపాయి. ప్రత్యేక హోదా ఉద్యమంలో టాలీవుడ్ హీరోలు, నటీనటులు ఎందుకు కలిసి రావడం లేదని ప్రశ్నిస్తూ.. వారిపై అక్కస్సు వెళ్లగక్కేలా రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తమైంది. ఆయన తీరుపై పలువురు సినీ నటులు మండిపడ్డారు. పోసాని మురళికృష్ణ, సినీ కవిత, సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్ తదితరులు రాజేంద్రప్రసాద్ టాలీవుడ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుబట్టారు.
దీంతో టాలీవుడ్‌పై తాను చేసిన వ్యాఖ్యలను రాజేంద్రప్రసాద్ వెనుకకు తీసుకున్నారు. తన వ్యాఖ్యలు కొందరినీ బాధించాయని, ఎవరినీ బాధపెట్టడం తన ఉద్దేశం కాదని ఆయన చెప్పారు. అందుకే తన వ్యాఖ్యలను వెనుకకు తీసుకుంటున్నట్టు తెలిపారు. సినిమావాళ్లు కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడాలని కోరారు.
సినిమావాళ్లు కూడా హోదా ఉద్యమంలోకి వస్తే.. రాష్ట్రానికి మేలు జరుతుందని తన ఉద్దేశమన్నారు. చంద్రబాబుకు అండగా నిలువాలనే తాను టాలీవుడ్‌పై ఆ వ్యాఖ్యలు చేశానని, తన వ్యాఖ్యల్లోని స్ఫూర్తిని అర్థం చేసుకోవాలని ఆయన కోరారు.