Badibata scheme
-
ఇక బడిబాట
పాపన్నపేట(మెదక్): బడీడు పిల్లలంతా బడిలో ఉండేలా అవగాహన కల్పించేందుకు.. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల వైపు మళ్లించేందుకు విద్యాశాఖ ‘బడిబాట’కు మరోసారి సన్నద్ధమైంది. ఈనెల 14 (శుక్రవారం) నుంచి 19 వరకు పండుగ వాతావరణంలో ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించేం దుకు ఆదేశాలిచ్చింది. ఇటీవల పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ బడులు సాధించిన మెరుగైన ఫలితా లను విస్తృతంగా ప్రచారం చేసి నమోదు శాతం పెంచేందుకు పక్కా ప్రణాళిను అమలు చేయబోతున్నారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు సన్మానాలు చేయనున్నారు. ప్రభుత్వ బడిని బతికించుకునేందుకు ప్రైవేటును తలదన్నే ప్రచార వ్యూహాలు సిద్ధం చేశారు. ప్రతి గ్రామంలో ‘గ్రామ విద్యా రిజిస్టర్’ (ఏఈఆర్)తప్పకుండా నిర్వహించాలని తద్వారా బడి బయట ఉన్న విద్యార్థుల వివరాలు గుర్తించవచ్చని భావిస్తున్నారు. బడీడు పిల్లలు బడిలో ఉండడమే ఉద్దేశం.. ప్రభుత్వ బడుల్లో నమోదు శాతం పెంచేందుకు దశాబ్ద కాలంగా విద్యాశాఖ బడిబాట కార్యక్రమాన్ని చేపడుతోంది. విద్యాసంవత్సరం ఆరంభం నుంచి వారం రోజుల పాటు నిర్దేశించిన షెడ్యూల్ కనుగుణంగా పండుగ వాతావరణంలో బడిబాట నిర్వహిస్తున్నారు. జిల్లాలో 902 ప్రభుత్వ పాఠశాలలుండగా సుమారు 83 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇప్పటికీ కొంత మంది పిల్లలు అక్కడక్కడ ఇటుక బట్టీల్లో.. యాచక వృత్తిలో.. పశువుల కాపరులుగా.. హోటళ్లు, కిరాణ దుకాణాల్లో బాల కార్మికులుగా బతుకీడుస్తున్నారు. బడీడు గల పిల్లలందరినీ బడిలో చేర్పించడం.. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం ‘బడిబాట’ ప్రధాన ఉద్దేశం. అందుకే అంగన్వాడీ పూర్తి చేసిన పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించడం.. బాలికల విద్యను ప్రోత్సహించడం.. హాజరు నమోదు తక్కువగా ఉన్న పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టడం.. పోషకుల సమావేశం నిర్వహించడం.. గుణాత్మక విద్యా సాధనకు చేస్తున్న కృషి వివరించి స్వచ్ఛంద సంస్థలు, పూర్వ విద్యార్థులు, గ్రామ పెద్దలు, దాతల సాయాన్ని తీసుకొని పాఠశాల అభివృద్ధికి పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకోవడం, పదో తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థులను, ఉపాధ్యాయులను సన్మానించడం లాంటివి ప్రాధాన్య అంశాలుగా గుర్తించారు. 10 జీపీఏ సాధించిన విద్యార్థులు, హెచ్ఎంలతో కలసి కలెక్టర్ ధర్మారెడ్డి, జేసీ నగేశ్, డీఈఓ రవికాంత్‌రావు ఇప్పటికే విందు కార్యక్రమాన్ని పూర్తి చేశారు. బడిబాట షెడ్యూల్ .. ఈనెల 14న ‘మన ఊరి బడి’: పాఠశాలలకు రంగులు వేయించడం, ఇంటింటి సర్వే నిర్వహించడం, కరపత్రాలు పంచడం, ర్యాలీలు నిర్వహించడం, బడీడు పిల్లలందరినీ బడిలో చేర్పిండం, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలతో కలసి పాఠశాల అభివృద్ధి కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవడం చేయాలి. నాణ్యమైన విద్యను అందించేందుకు, విద్యాప్రమాణాలు పెంపొందించేదుకు తీర్మానాలు చేయాలి. 15న ‘బాలిక విద్యా’ కార్యక్రమాలు: బాలికల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న హెల్త్, హైజిన్ కిట్స్ పంపిణీ, వాటి ప్రాధాన్యత, కస్తూర్బా బాలికల పాఠశాల ప్రవేశం, అక్కడి సౌకర్యాలు, విద్యార్థినులకు పాఠశాలల్లో నేర్పుతున్న మార్షల్ ఆర్ట్స్, మహిళా సాధికారత విషయాలు తెలియజేయాలి. 17న ‘సామూహిక అక్షరాభ్యాసం’: గ్రామపెద్దలను, ప్రజాప్రతినిధులను పిలిచి విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించాలి. అందుకు కావాల్సిన పలకలు, బలపాలు సమకూర్చుకోవాలి. పండుగ వాతావరణంలో కార్యక్రమాన్ని నిర్వహించాలి. 18న ‘స్వచ్ఛ పాఠశాల’ (హరితహారం): పాఠశాల ప్రాంగణాన్ని, తరగతి గదులను, పాఠశాలలో తాగునీటి ట్యాంకులను, మరుగుదొడ్లను శుభ్రం చేసుకోవాలి. తరగతుల్లో బోధనాభ్యసన చార్టులు అంటించాలి. హరితహారం నిర్వహించడం చేయాలి. 19న ‘పాఠశాల యాజమాన్య కమిటీ (బాల కార్మికుల విముక్తి) సమావేశాలు’: బాల కార్మికుల విముక్తికి పాఠశాల యాజమాన్య కమిటీ తగిన చర్యలు తీసుకోవాలి. ప్రతి పాఠశాలలో ఎస్ఎంసీ సమావేశాలను నిర్వహించాలి. టాస్క్‌ఫోర్స్ కమిటీ, ఎస్ఎంసీ కమిటీలతో కలసి, బాలకార్మికులు ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడికి వెళ్లి వారిని పాఠశాలల్లో చేర్పించాలి. పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులను పాఠశాలకు పిలిచి వారిని సన్మానిం చాలి. టెన్త్, ఏడో తరగతి ఫలితాలు వివరిం చాలి. మౌలిక వసతుల వివరాలు, మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు స్కాలర్ షిప్‌లు, ఎన్ఎంఎంఎస్ స్కాలర్‌షిప్‌లతో ఒక పాఠశాల ప్రొఫైల్ తయారు చేసుకోవాలి. -
మూన్నాళ్ల ముచ్చటగా బడికొస్తా
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేసేందుకుటీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘బడికొస్తా’ పథకం మూన్నాళ్ల ముచ్చటగా మారింది.దూర ప్రాంతాల నుంచి పాఠశాలలకు నడిచి వచ్చే బాలికలు.. దూరం కారణంగా బడిమాని వేయకూడదనే ఉద్దేశంతో 9వ తరగతి చదివే విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేయాలని భావించింది. ఏటా సైకిళ్లు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. ఆచరణలో మాత్రం శూన్యం. కడప ఎడ్యుకేషన్: రాష్ట్రం ప్రభుత్వం 2016–17లో 9వ తరగతి బాలికలకు ‘బడికొస్తా’ పథకం కింద సైకిళ్లను పంపిణీ చేసింది. తరువాత దీని గురించి పట్టించుకోకపోవడంతో మారుమూల గ్రామాల్లోని విద్యార్థినులకు బడికి రాకపోకలు కష్టంగా మారాయి. మొదటి సంవత్సరం జిల్లా వ్యాప్తంగా 9297 మంది బాలికలకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ ఏడాది పాఠశాలలు ప్రారంభమైæ నాలుగు నెలలు దాటినా ఇంత వరకు సైకిళ్లు ఇవ్వలేదు జిల్లావ్యాప్తంగా వేలమంది బాలికలకు ఎదురు చూపులు తప్పడం లేదు. రవాణా సదుపాయలు సరిగాలేక, ప్రభుత్వంసైకిళ్లు కూడా ఇవ్వకపోవడంతో వారు రోజూ స్కూలుకు రావడానికి అవస్థలు పడుతున్నారు. పాఠశాలల వివరాలు ఇలా :జిల్లాలో 3225 పాఠశాలలు ఉన్నాయి.ఉన్నత పాఠశాలలు 391 ఉన్నాయి. వీటిలో 19,100 మంది 8,9 తరగతులు చదువుతున్నారు. వీరందరికి ప్రభుత్వం సైకిళ్లను పంపిణీ చేయాల్సి ఉంది. విద్యా సంవత్సరం సగం పూర్తయినా సైకిళ్లు రాలేదు.దీంతో ఈ ఏడాది ఇస్తారా..లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై విద్యాశాఖాధికారులను అడిగిదే జాబితాను ప్రభుత్వానికి పంపామని సైకిళ్లు ఎప్పడొస్తాయో తెలియదని సమాధానం చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరగా సైకిళ్లు పంపిణీ చేయాలని కోరుతున్నారు. సందిగ్ధత:ఈ ఏడాది 8,9 తరగతులకు సైకిళ్లు ఇస్తామని చెప్పి విద్యాశాఖ అధికారులను వివరాలు అడిగారు. ఇప్పడేమో 9వ తరగతికే ఇస్తామని అంటున్నట్లు తెలిసింది. 9వ తరగతి విద్యార్థులకు ఇవ్వవలసి వస్తే 9471 మంది విద్యార్థులు ఉన్నారు. త్వరగా సైకిల్ ఇవ్వాలి నాపేరు రంగవేణి. మాది నగర శివార్లలోని వైఎస్సార్‌కాలనీ. నేను మున్సిపల్ హైస్కూల్ మొయిన్‌లో 9వ తరగతి చదువుతున్నాను.రోజు రూ. 30 పెట్టి ఆటోలో పాఠశాలకు వస్తున్నా. కష్టంగా ఉంది. ప్రభుత్వం త్వరగా సైకిల్ ఇస్తే బాగుంటుంది. – రంగవేణి, 9వ తరగతి. వర్షాకాలంలో ఇబ్బందులు మాది నగరంలోని ముత్యంజయకుంట. మేము అక్కచెల్లెళ్లం ఇద్దరం కలిసి ఒకే సైకిళ్లో పాఠశాలకు వస్తాం. వర్షాకాలంలో రావాలంటే ఇబ్బంది ఉంటుంది.ప్రభుత్వం సైకిల్ ఇస్తే బాగుంటుంది. – షబీనా, 9వతరగతి. మున్సిపల్ హైస్కూల్ మొయిన్. సైకిళ్లు రాగానే ఇస్తాం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థినులకు సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి పంపాం. ప్రభుత్వం నుంచి సైకిళ్లు రాగానే పంపిణీ చేస్తాం.– పి ౖశైలజ, జిల్లా విద్యాశాఖ అధికారి -
బడికొస్తా..బంక్ కొట్టింది
‘బాలికలపై తల్లిదండ్రులు వివక్ష చూపొద్దు.. బాలికా విద్యను ప్రోత్సహించాలి.. ఒక్క బాలిక కూడా మధ్యలో చదువు మానడానికి వీల్లేదు.. బాలికల విద్యాభివృద్ధికి ఎంత ఖర్చయినా భరిస్తాం’.. ఇది మన ప్రభుత్వం నుంచి తరచూ వచ్చే ప్రకటన. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆచరణలో మాత్రం శూన్యం. బాలికల డ్రాపౌట్స్‌ను తగ్గించడానికి ప్రవేశపెట్టిన బాలికలకు సైకిళ్లు అందించే ‘బడికొస్తా’ పథకం రెండేళ్లుగా పత్తాలేకుండాపోవడమే ఇందుకు నిదర్శనం. చిత్తూరు, మదనపల్లె టౌన్ : రాష్ట్రం ప్రభుత్వం 2016–17లో 9వ తరగతి బాలికలకు ‘బడికొస్తా’ పథకం కింద సైకిళ్లను పంపిణీ చేసింది. ఆ తరువాత పథకం గురించి పట్టించుకోకపోవడంతో మారుమూల గ్రామాల్లోని విద్యార్థినులకు బడికి రాకపోకలు కష్టంగా మారాయి. ప్రభుత్వం సైకిళ్లు పంపిణీ చేస్తుందని ఆశించిన విద్యార్థినులకు నిరాశే మిగిలింది. జిల్లాలో 506 ఉన్నత పాఠశాలలు ఉండగా, అందులో 1.20 లక్షల మందికి పైగా 9, 10 తరగతుల విద్యార్థినులు ఉన్నారు. 2016లో టీడీపీ ప్రభుత్వం బడికొస్తా పథకాన్ని ప్రవేశపెట్టగా, 17 విద్యాసంవత్సరం ముగిసే సమయంలో కొంతమందికి మాత్రమే సైకిళ్లను అందజేసి చేతులు దులుపుకున్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఇంతవరకు పంపిణీ చేయలేదు. విద్యాసంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు పూర్తయినా సైకిళ్లను పంపిణీ చేయకపోవడంతో.. విద్యార్థినుల్లో ఆశలు సన్నగిల్లాయి. విద్యార్థినుల తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన డ్రాపౌట్స్.. గ్రామీణ విద్యార్థినులకు ఉన్నత పాఠశాలలు దగ్గరలో లేకపోవడంతో సుదూర ప్రాంతాలకు నడచి వెళ్లలేక డ్రాపౌట్స్‌గా మిగులుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు 19 వేల మందికి పైగా బడిమానేసిన వివిధ తరగతుల బాలికలు ఉన్నట్లు సమాచారం. విద్యార్థినులకు తప్పని కష్టాలు.. పట్టణ శివారు ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు వచ్చిపోయే విద్యార్థినులు రోజూ 3 నుంచి 10 కిల్లోమీటర్ల మేర నడవాల్సి వస్తోంది. మండలంలోని మాలేపాడు పంచాయతీలోని ఆవులపల్లె నుంచి చెంబకూరుకు రావాలంటే 7 కిల్లోమీటర్లు కాలినడకన అడవిలో ప్రయాణం సాగించాల్సి ఉంది. వన్యమృగాలు తారసపడడం, వాటి అరపులతో భయభ్రాంతులకు గురై కొందరు స్కూలుకు వెళ్లడం మానేస్తున్నారు. సరిౖయెన సమయానికి స్కూలుకు పోలేని విద్యార్థినులు అనేకమార్లు గైర్హాజరై పరీక్షల సమయంలో హాజరు తక్కువతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితి జిల్లా అంతటా ఉంది. సైకిళ్ల పంపిణీకి ఉత్తర్వులివ్వలేదు.. గ్రామీణ ప్రాంతాల్లో బాలికల డ్రాపౌట్స్‌ను తగ్గించడానికి సైకిళ్ల పంపిణీ ఎంతగానో దోహదపడుతుంది. బడికొస్తా పథకం అమలుకు ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. – పాండురంగస్వామి, డీఈఓ, చిత్తూరు -
నడిచే బడికొస్తా
అనంతపురం ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేసేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘బడికొస్తా’ పథకం ఏడాది ముచ్చటగా మారింది. సుదూర ప్రాంతాల నుంచి పాఠశాలలకు నడిచి వచ్చే బాలికలు.. దూరం కారణంగా బడిమానివేయకూడదనే ఉద్దేశంతో టీడీపీ ప్రభుత్వం 9వ తరగతి చదివే విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేయాలని భావించింది. ఏటా సైకిళ్లు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. కానీ 2016–17 విద్యాసంవత్సరానికి మాత్రమే పంపిణీ చేసి...ఆ తర్వాత పట్టించుకోలేదు. 15,388 సైకిళ్లు పంపిణీ ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో 9వ తరగతి చదువుతున్న ఆడపిల్లలకు ‘‘బడికొస్తా’’ సైకిళ్లు పంపిణీ చేస్తామనే ప్రభుత్వ ప్రకటనలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సంబరపడ్డారు. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆడపిల్లలు డ్రాపౌట్స్‌గా తగ్గించవచ్చనుకున్నారు. అయితే ప్రభుత్వం ఒక్క ఏడాది మాత్రమే పంపిణీ చేసి తర్వాత పట్టించుకోలేదు. జిల్లాకు 2016–17లో 15,581 సైకిళ్లు మంజూరయ్యాయి. వీటిలో 15,388 మంది బాలికలను సైకిళ్లు పంపిణీ చేశారు. వివిధ కారణాల వల్ల బడికి రాని కారణంగా 193 సైకిళ్లు అధికారుల వద్దే మిగిలిపోయాయి. ఆ తర్వాత 2017–18 సంవత్సరంలో పంపిణీ చేయలేదు. 17,388 సైకిళ్లు అవసరం అని జిల్లా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. బాలికలు, వారి తల్లిదండ్రులు సైకిళ్లు కోసం ఎదురుచూశారు. జిల్లా అధికారులు కూడా ప్రభుత్వం సరఫరా చేస్తుంది... అదిగో... ఇదిగో ఉంటూ చెప్పుకొచ్చారు. కానీ ప్రభుత్వం మాత్రం ఒక్క సైకిలూ పంపలేదు. ప్రస్తుత విద్యా సంవత్సరం (2018–19) దాదాపు సగం గడిచిపోతున్నా ఇప్పటిదాకా స్పష్టత లేదు. 8వ తరగతి విద్యార్థినులకూ... గత రెండేళ్లలో ఒకసారి మాత్రమే సైకిళ్లు పంపిణీ చేసిన ప్రభుత్వం... ఈ ఏడాది 9వ తరగతి విద్యార్థులతో పాటు 8వ తరగతి విద్యార్థినులకూ సైకిళ్లు పంపిణీ చేస్తామని గొప్పగా ప్రకటించింది. స్వయంగా మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పలు సమావేశాల్లో ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రధానోపాధ్యాయుల నుంచి 8, 9 తరగతుల విద్యార్థినుల వివరాలు సేకరించారు. జిల్లాలో సుమారు 30 వేల పైచిలుకు బాలికలు ఉన్నారు. తరచూ మీడియాలో వస్తున్న ప్రకటనలతో వారంతా సైకిళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సంస్థ సైకిళ్లు సరఫరా చేసే టెండరును రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సంస్థ దక్కించుకుంది. స్కూల్ పాయింట్‌కు చేర్చాల్సిన బాధ్యత వారిదే. అయితే రాష్ట్రం నుంచి జిల్లా కేంద్రానికి ఇక్కడి నుంచి మండలం, అక్కడి నుంచి స్కూల్ పాయింట్‌కు చేర్చడంలో మరింత జాప్యం జరిగింది. దీనికితోడు సైకిళ్లు నాణ్యత కూడా అంతంతమాత్రంగా ఉన్నట్లు ఉపాధ్యాయులు వాపోతున్నారు. ప్రచార ఆర్భాటం ప్రభుత్వ స్కూళ్లలో 9వ తరగతి విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ అంతా ప్రచార ఆర్భాటం. అందుకే అమలు గురించి పట్టించుకోవడం లేదు. మూడేళ్లలో ఒక్కసారి ఇచ్చేసి చేతులెత్తేశారు. ఈ ఒక్కటే కాదు.. విద్యాభివృద్ధి కార్యక్రమాలన్నింటిలోనూ ఇదే పరిస్థితి. ఫలితంగా ప్రభుత్వ విద్య కుంటు పడుతోంది. – కె.ఓబుళపతి, వైఎస్సార్టీఎఫ్రాష్ట్ర ప్రధానకార్యదర్శి నాకు తెలీదు బడికొస్తా పథకం ద్వారా ఈ సారి 8, 9 తరగతుల విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేస్తామని చెప్పారు. జిల్లాకు సుమారు 30 వేలుకు పైగా సైకిళ్లు అవసరం. ప్రతిపాదనలు పంపాం. ఇప్పటిదాకా ఎలాంటి సమాచారం లేదు. రాష్ట్రస్థాయిలో తీసుకునే నిర్ణయం. ఇంతకు మించి నాకు తెలీదు.– జనార్దనాచార్యులు, జిల్లా విద్యాధికారి -
అటకెక్కిన బడికొస్తా పథకం
తెలుగుదేశం ప్రభుత్వం కొత్త పథకాలను ప్రారంభించినప్పుడు చూపెడుతున్న శ్రద్ధ వాటిని కొనసాగించడంలో మాత్రం విస్మరిస్తోంది. ఫలితంగా అనేక కార్యక్రమాలు ఆరంభ శూరత్వంలా మిగిలిపోతున్నాయి. ఇప్పటికే అనేక పథకాలకు మంగళం పాడేసిన టీడీపీ సర్కారు.. తాజాగా ‘బడికొస్తా’ పథకం కొనసాగింపులో కూడా అదే వైఖరి అవలంబిస్తోంది. కొత్త విద్యాసంవత్సరం ఆరంభమై నాలుగు నెలలు గడిచినా విద్యార్థినులకు ఇంతవరకూ సైకిళ్లు పంపిణీ చేయలేదు. శ్రీకాకుళం, ఆమదాలవలస: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన బడికొస్తా పథకం పడకేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న తొమ్మిదో తరగతి విద్యార్థులకు సైకిళ్లను అందజేయాలనే ఉద్దేశంతో 2017 ఏప్రిల్ 16న ఈ పథకం ప్రవేశపెట్టారు. ప్రతి మండల కేంద్రం, మున్సిపాలిటీ కేంద్రాల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి 9వ తరగతి చదువుతున్న విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. అప్పట్లో నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల సమక్షంలో జిల్లావ్యాప్తంగా 56 వేలుసైకిళ్లు పంపిణీ చేశారు. 2016–17లో తొమ్మిదో తరగతి చదివిన విద్యార్థులకు మాత్రమే వీటిని అందజేశారు. తర్వాత పథకాన్ని పట్టించుకోవడం మానేశారు. ప్రస్తుతం 2017–18, 2018–19 విద్యా సంవత్సరాలలో చదువుతున్న విద్యార్థినులకు సైకిళ్లు అందజేయాల్సి ఉంది. ప్రస్తుతం వీరంతా దూరప్రాంతాల నుంచి ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాల్లో కిక్కిరిసి వస్తున్నారు. మరికొందరు కాలిబాటన కిలోమీటర్ల మేర నడుస్తూ పాఠశాలకు చేరుకుంటున్నారు. ఇంకొందరు పాత సైకిళ్లపై వస్తున్నారు. నాలుగు నెలలుగా కొత్త సైకిళ్ల కోసం ఎదురుచూస్తున్నామని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ పరిస్థితి.. జిల్లా వ్యాప్తంగా 450 జిల్లా పరిషత్, మున్సిపల్ ఉన్నత పాఠశాలల్లో సైకిళ్లు అందుకునేందుకు అర్హహ కలిగిన విద్యార్థినులు సుమారు 54,000 మంది ఉన్నారు. బడికొస్తా పథకం కోసం ఎవరిని అడిగినా సరైన సమాధానం ఉండటం లేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా సైకిళ్లు అందిస్తే కాస్త భరోసాగా ఉంటుందని విద్యార్థినుల తల్లిదండ్రులు అంటున్నారు. బడికొస్తా పథకం అమలుకు తమకు ఎటువంటి ఆదేశాలు గానీ, ఉత్తర్వులు గానీ రాలేదని ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి సైకిళ్లు ఇస్తారా.. లేదా అన్న అంశంపై స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. సైకిళ్ల కోసం ఎదురుచూపు.. ప్రభుత్వం గత ఏడాది తొమ్మిదో తరగతి విద్యార్థులకు బడికొస్తా పథకం కింద సైకిళ్లు ఉచితంగా అందించారు. ఈ ఏడాది మాకు అందిస్తారని ఎంతగానో ఎదురుచూశాం. అయినా ఇప్పటివరకు ఏ ప్రకటనా లేదు. – జొన్నాడ ప్రియాంక, విద్యార్థిని,ఆమదాలవలస -
సైకిల్‌కు బ్రేకులు
ప్రభుత్వ బడుల్లో ప్రతి విద్యార్థినికి ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేస్తాం... నడిచి సూళ్లకు వెళ్లే అవస్థలు తప్పిస్తామని టీడీపీ సర్కారు చెప్పింది. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తి అవుతున్నా ఒక్కసారి మాత్రమే సైకిళ్లు అందజేసి చేతులు దులుపుకుంది. జిల్లాలో చాలా గ్రామాలకు బస్సుల సౌకర్యం సరిగ్గా లేదు. బస్సు వెళ్లని గ్రామాలూ ఉన్నాయి. కాలినడకన హైస్కూళ్లకు చేరుకోవడం విద్యార్థులకు దూరాభారమవుతోంది. ప్రాథమిక స్థాయి వరకు చదివించి, దూరప్రాంతాలకు పంపే దారి లేక ఆడపిల్లలను మధ్యలోనే తల్లిదండ్రులు చదువును నిలిపేస్తున్నారు. చిత్తూరు ఎడ్యుకేషన్: బడికొస్తా పథకం కింద జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు టీడీపీప్రభుత్వం అధికారంలోకి వచ్పినప్పటి నుంచి ఒక్కసారి మాత్రమే సైకిళ్లను పంపిణీ చేసింది. 2016–17లో 9వ తరగతి బాలికలకు సైకిళ్లను అందజేసింది. ప్రభుత్వ యాజమాన్య పరిధిలో నడుస్తున్న పాఠశాలల్లో అప్పట్లో చదువుతున్న 16,722 మంది బాలికల కోసం సైకిళ్లను పంపారు. ఆ సైకిళ్లను మండల కేంద్రాల్లో ఎంఈఓలకు అప్పజెప్పి సంబంధిత హైస్కూల్ విద్యార్థి నులకు అందజేశారు. అప్పట్లో సైకిళ్లు పూర్తి స్థా యిలో అర్హులైన విద్యార్థినులకు అందలేదన్న వి మర్శలున్నాయి. ఆధార్‌కార్డు, వెబ్సైట్లో ఫోటో ల అప్లోడ్ తదితర నిబంధనలు పెట్టడంతో చా లా మంది పేద విద్యార్థినులు సైకిళ్లను పొందలేకపోయారు. సరఫరా చేసిన సైకిళ్లను క్షేత్రస్థాయిలో అర్హులైన విద్యార్థినులకు అందజేశారా... లేదా అన్న అంశంపై విద్యాశాఖ పట్టించుకోలేదు. దీం తో పలు సైకిళ్లు పక్కదారిపట్టాయన్న ఆరోపణలు న్నాయి. ఈ ఏడాది విద్యాసంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడిచినా ఇప్పటివరకు సైకిళ్ల ఊసే లేదు. పర్సంటేజీల కోసమేనా బాబు.. 2016–17లో జిల్లాలో సరఫరా చేసిన సైకిళ్లు విద్యార్థుల కోసం అనుకుంటే పప్పులోకాలేసినట్లే... ఇక్కడే ఉంది అసలైన తిరకాసు.. సం బంధించి కొన్ని ప్రయివేట్ సంస్థలకు సైకిళ్లసరఫరా బాధ్యత అప్పజెప్పారు. అప్పట్లో చిత్తూరు జిల్లాకు హీరో కంపెనీకి సంబంధించిన సైకిళ్లను అందజేశారు. రాష్ట్రస్థాయిలో కొందరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు కమీషన్ల కోసం కక్కుర్తి పడ్డారనే ఆరోపణలున్నాయి. ఫలితంగా నాణ్యత లేని సైకిళ్లను అందజేశారు. ఆ∙సైకిళ్లు సంవత్సరం కూడా తిరక్కముందే పాడైపోయాయని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 2016–17లో చిత్తూరు డివిజన్లో 5,534 , పుత్తూరు డివిజన్లో 3,981, మదనపల్లె డివిజన్లో 4,258, తిరుపతి డివిజన్లో 2,949 మంది బాలికలకు సైకిళ్లను ఇచ్చారు. ఇందులో దాదాపు 40 శాతం సైకిళ్లు పక్కదారి పట్టాయని ఆరోపణలున్నాయి. కొన్ని సైకిళ్లను మూలపడేశారు. ఏ విద్యార్థినికి సైకిల్ ఇచ్చారో కూడా జిల్లా విద్యాశాఖ వివరాలు లేకపోవడం గమనార్హం. టీడీపీ సర్కారు బాధ్యతలు చేపట్టి ఐదో సంవత్సరం నడుస్తోంది. ఐదేళ్లకు ఒక్కసారి మాత్రమే నాణ్యత లేని సైకిళ్లను ఇచ్చి మిన్నకుండటం సరికాదని విద్యార్థుల తల్లిదండ్రులంటున్నారు. కొత్త సైకిళ్లు వస్తాయని చాలామంది విద్యార్థులు ఇప్పటికీ ఎదురుచూస్తున్నారు. -
బడి బాట.. కాలి బాటే..!
- అరకొరగా రవాణా భత్యం - గతేడాది విద్యార్థులకే అందలేదు - ఈ ఏడాది ఇంకా ఊసేలేదు - తెరపైకి వచ్చిన సైకిళ్ల పంపిణీ..! సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఉద్దేశిం చిన బడిబాట పథకం అమలులో రాష్ట్ర ప్రభు త్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఆర్థిక భారం కారణంగా దూరప్రాంతాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులు మధ్యలో బడి మానకుండా ఉండడానికి కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్ల నుంచి రవాణాభత్యం అందజేస్తోంది. అయితే, ఏటా అరకొర కేటాయింపులు, నామమాత్రపు పంపిణీతో విద్యాశాఖ నెట్టుకోస్తోంది. గతేడాది నిధులు విడుదలై విద్యాసంవత్సరం గడిచినా విద్యార్థులకు రవాణా భత్యం అందలేదు. అయితే, రవాణా భత్యం సొమ్ముతో సైకిళ్లు కొనుగోలు చేద్దామనే రాష్ట్ర సర్వశిక్ష అభియాన్ అధికారుల ఆలోచనకు ఇంతవరకు క్షేత్ర స్థాయిలో కార్యరూపం దాల్చలేదు. అంతేకాక రవాణాభత్యం పంపిణీ పారదర్శకంగా జరగడానికి విద్యార్థుల బ్యాంకు ఖాతాలలో నేరుగా భత్యం సొమ్ము వేద్దామనే ఆలోచనకు విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా లక్షల సొమ్ము రాజీవ్ విద్యామిషన్ ఖాతాలో మూలుగుతోంది. దీంతో క్షేత్రస్థాయిలో ని నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లా ల్లో వందలాది మంది విద్యార్థులకు భత్యం అంద క చదువులు భారంగా సాగుతున్నాయి. ఈ ఏడాదైనా మొత్తం ఇచ్చేరా.... తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు రాష్ట్ర రాజీవ్ విద్యామిషన్ అధికారులు సెప్టెంబర్‌లోనే రూ. 2 కోట్ల వరకు సొమ్ము విడుదల చేశారు. కానీ విద్యాసంవత్సరం పూర్తయినా విద్యార్థులకు ఇప్పటి వరకు భత్యం మాత్రం అందలేదు. నిజామాబాద్ జిల్లాలో గతేడాది 480 విద్యార్థులకు రూ.10.01 లక్షల సొమ్ము రావాలి. అలాగే 2012-13 సంవత్సరంలో 143 మందికి, 2013-14 , 2014 సంవత్సరానికి 191 మందికి ఒక్కొక్కరికి రూ.300 చొప్పున 10 నెలల భత్యం అందింది. జిల్లాలో మారుమూల గ్రామాల్లో అర్హులైన విద్యార్థులకు అందలేదు. ఆదిలాబాద్ జిల్లాలో గతేడాది 213 పాఠశాలలకు చెందిన 2,672 మంది విద్యార్థులకు అందాల్సి ఉంది. జిల్లాకు రూ.80 లక్షలు విడుదలైనా రాజీవ్‌విద్యామిషన్ ఖాతాలో మూలుగుతున్నాయి. 2013-14కు సంబంధించి ఈ జిల్లాలో నిధులు విడుదల చేయలేదు. కరీంనగర్ జిల్లాలో 723 మంది విద్యార్థులకు గత విద్యాసంవత్సర భత్యం అందించాల్సి ఉంది. దీనికిగాను జిల్లాకు రూ. 21.69 లక్షలు విడుదలయ్యాయి. కానీ, ఇంత వరకు విద్యార్థుల ఖాతాలలోకి చేరలేదు. సైకిళ్ల పంపిణీ పేరుతో జరుగుతున్న జాప్యం ఉన్నత తరగతుల విద్యార్థులకు ప్రయాణ భత్యం కింద వచ్చే నిధులతో సైకిళ్లను అందించాలని ఐదు నెలల క్రితం రాష్ట్ర సర్వశిక్ష అభియాన్ అధికారులు నిర్ణయించారు. కానీ వాటికి ఇంతవరకు అతీగతీలేదు.