Bala Chander
-
Abhaya Foundation: పేదలకు అభయం బాలచంద్రుని ఆనంద నిలయం
పరాన్న జీవులుగా కాదు.. పరమాత్మ జీవులుగా మనమంతా ఎదగాలి’ అంటారు సుంకు బాలచంద్ర. పదిహేడేళ్లుగా సేవారంగంలో వేలాది మందికి అండగా ఉంటున్నారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉంటున్న యాభై ఏళ్ల బాలచంద్ర. అభయ ఆనంద నిలయం పేరుతో నిరుపేదలకు ఆశ్రయం కల్పిస్తున్నారు. ఉద్యోగం చేస్తూ వచ్చిన ఆదాయాన్ని పేదలకు పంచుతూ మొదలుపెట్టిన సేవామార్గం ఇప్పుడు ఎంతో మందికి నీడనిస్తుంది. అనాథ వృద్ధులను చేరదీస్తూ, విద్యార్థుల చదువుకు అవసరాలను సమకూరుస్తూ, రోగులకు వైద్యచికిత్సను అందజేస్తూ, నిరుద్యోగుల ఉపాధికి కావల్సిన నైపుణ్యాలను అందిస్తున్నారు. స్కూల్ పిల్లలను కలుస్తూ, వారి ప్రశ్నలకు సమాధానాలను పుస్తక రూపంలో తీసుకువచ్చారు. పది వేల రూపాయలతో మొదలుపెట్టిన సేవా మార్గం నేడు ఎంత మందికి చేరవయ్యిందో తెలియజేస్తూ మనం తలుచుకుంటే సమాజంలో పేదరికం, కష్టాలు, కన్నీళ్లు లేకుండా చేయచ్చు అని వివరిస్తున్నారు. పద్దెనిమిదవ వసంతంలోకి అడుగు పెడుతున్న తన సేవా ప్రస్థానాన్ని ఇలా ముందుంచారు. ‘‘ఎనిమిదేళ్ల క్రితం ఓ రోజు నాగర్‌కర్నూలు నుంచి ఫోన్ వస్తే అక్కడకు వెళ్లాను. ఎనభై ఏళ్ల ముసలాయన బాగోగులు చూడలేక వారి పిల్లలు ఇంటి నుంచి అతన్ని రోడ్డు మీదకు తోసేస్తే కొన్ని రోజులుగా చెత్త కుప్ప వద్ద ఉన్నాడు. అతన్ని ఆశ్రమానికి తీసుకువచ్చిన ఆరునెలలకు ఆయన భార్య కూడా వచ్చింది. ఇద్దరూ ఎనిమిదేళ్లపాటు నాతోనే ఉన్నారు. నాకు కరోనా వచ్చి ఆసుపత్రిలో ఉంటే ఆవిడ బెంబేలెత్తిపోయి తన మెడలో ఉన్న మంగళసూత్రాలు, కమ్మలు ఇచ్చి ‘అమ్మి, ఆ బాబును బతికించడయ్యా’ అని వేడుకుంది. కోలుకుని వచ్చాక విషయం తెలిసి కళ్ల నీళ్లు వచ్చాయి. పన్నెండేళ్ల క్రితం పాతికేళ్లమ్మాయి రోడ్డు ప్రమాదంలో హిప్బాల్ దెబ్బతిని మంచానికి పరిమితం అయ్యింది. హైదరాబాద్ గాంధీ నగర్లో ఉండే ఆమెను గుండె నొప్పితో బాధపడే తల్లి తప్ప చూసుకునేవారు ఎవరూ లేరు. నాలుౖగైదేళ్లు ఆ అమ్మాయి బెడ్‌మీదే ఉండిపోయింది. ఆమెకు పలుమార్లు ఆపరేషన్ చేయిస్తే ఏడెనిమిదేళ్లకు కోలుకుంది. ఇప్పుడు పెళ్లి చేసుకొని కుటుంబంతో సంతోషంగా ఉంది. మా అమ్మాయి బాగా చదువుకుంటుంది. డాక్టర్ కావాలన్నది తన కల. కానీ, చదివించే స్థోమత మాకు లేదని బాధపడుతూ వచ్చారు ఒకమ్మాయి తల్లిదండ్రులు. ఆ బిడ్డ ఈ రోజు డాక్టర్ అయి పేదలకు సేవలందిస్తోంది. ఈ పదిహేడేళ్లలో ఇలాంటి కథనాలు ఎన్నో... స్వచ్ఛందంగా ఎంతో మంది కదిలివచ్చి ‘అభయ ఫౌండేషన్’తో చేయీ చేయీ కలిపారు. ఉపనయనం డబ్బులతో... పుట్టి పెరిగింది అనంతపురం జిల్లా తాడిపత్రిలో. బీఎస్సీ ఎల్ఎల్బీ చేశాను. ఇరవై నాలుగేళ్ల క్రితం నాకు ఉపనయనం చేసినప్పుడు బంధువుల ద్వారా పది వేల రూపాయలు వచ్చాయి. ఆ డబ్బుతో నలుగురికి మేలు కలిగే పని చేయాలనుకుంటున్నాను అని మా కుటుంబంలో అందరికీ చెప్పాను. అందరూ సరే అన్నాను. వారందరి మధ్యనే ‘అభయ’ అనే పేరుతో ఫౌండేషన్‌ను ఏర్పాటు చేస్తున్నాను అని, తమకు తోచిన సాయం అందిస్తూ ఉండమని కోరాను. అక్కణ్ణుంచి హైదరాబాద్ వచ్చి, ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు చేశాను. నా ఖర్చులకు పోను మిగతా జీతం డబ్బులు, బంధుమిత్రులు ఇచ్చినదానితో ఫుట్‌పాత్‌ల మీద ఉండే నిరాశ్రయులకు సాయం చేస్తూ ఉండేవాణ్ణి. నైపుణ్యాల వెలికితీత.. ఏ మనిషి అయినా ఎవ్వరి మీదా ఆధారపడకుండా బతకాలి. అందుకు తగిన నైపుణ్యం కూడా ఉండాలి. దీంతో వారాంతాలు స్కిల్ ప్రోగ్రామ్‌లు ఏర్పాటు చేస్తుండేవాడిని. చదువుకున్న రోజుల్లో నేను మా బంధువుల నుంచి పుస్తకాలు, ఫీజులు, బట్టల రూపంలో సాయం పొందాను. వారందరిలోనూ ఒక ఎఫెక్షన్ చూశాను. నాలాగే ఎంతో మంది సాయం కోసం ఎదురుచూస్తుండవచ్చు అనే ఆలోచనతో విద్యార్థుల చదువుకు ఊతంగా ఉండాలనుకున్నాను. పుట్టి పెరిగిన జిల్లాతో పాటు ఇప్పుడు దాదాపు 17 రాష్ట్రాలలో నిరుపేద విద్యార్థుల చదువుకు అండగా ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను. తెలుగు రాష్ట్రాలతో పాటు మరో మూడు రాష్ట్రాల్లో 12 వేల మంది యువతకు ఉపాధి అవకాశాలకు శిక్షణ ఇస్తున్నాం. వీరిలో మహిళలూ ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. కర్ణాటక రాష్ట్రంలో నాదస్వరం స్కూల్‌ను కూడా ఏర్పాటు చేశాం. ఏ వృత్తుల వారికి ఆ వృత్తులలో ప్రత్యేక శిక్షణ ఇచ్చి, వారి కాళ్ల మీద వారు నిలబడేలా సాయంగా ఉంటున్నాం. సేవకు చేయూత ఒక మంచి పని చేస్తే ఎంత దూరమున్నవారినైనా ఆకట్టుకుంటుందని ఓ సంఘటన నాకు అర్థమయ్యేలా చేసింది. పదేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో ఒక సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అక్కడకు 75 ఏళ్ల ఆవిడ వచ్చి ‘నేనూ మీ సేవలో పాలు పంచుకుంటాను, నెలకు 5వేల రూపాయలు ఇవ్వగలను’ అంది. ఆశ్చర్యంగా చూస్తే ‘నేను రిటైర్డ్ ప్రిన్సిపాల్‌ను. 20 వేల రూపాయల పెన్షన్ వస్తుంది. ప్రతి నెలా ఐదు వేల రూపాయలు సేవకు నా జమ’ అంది. నోటమాటరాలేదు. ఎక్కడ సేవ రూపంలో వెళితే అక్కడకు పది, వంద రూపాయలు సాయం అందించినవారున్నారు. ఇంతమందిలో మానవత్వం ఉంటే ఇక మనకు కొరతేముంది అనుకున్నాను. ఎవరికి సాయం అందిందో తిరిగి వాళ్లు ఎంతో కొంత సాయం అందిస్తూ వచ్చారు. కొంతమంది పిల్లలు తమ కిడ్డీ బ్యాంకులో దాచుకున్న డబ్బును కూడా సాయంగా ఇచ్చారు. స్వచ్ఛందంగా ముందుకు.. నేపాల్ కరువైనా, ఉత్తరాఖండ్ వరదలైనా, ఆంధ్ర, తమిళనాడు, కేరళలలో అకాల వర్షాలు ముంచెత్తినా.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సాయం అవసరమున్నవారికి అండగా ఉంటే చాలు అన్న తపన నన్ను చాలా మందికి చేరువ చేసింది. నాతో పాటు ఎలాంటి స్టాఫ్ లేదు. ప్రత్యేకించి ఆఫీసు లేదు. అందరూ స్వచ్ఛందంగా తమ చేయూతను ఇస్తున్నారు. దీనికి నేను చేస్తున్నదల్లా సాయం చేసే చేతులను కలపడం. ఈ సేవా ప్రస్థానంలో ఇప్పుడు వేల మంది జమ కూడారు. అంతా నా కుటుంబమే! సేవ మార్గమే నా ప్రయాణం కాబట్టి, పెళ్లి, కుటుంబం వద్దనుకున్నాను. హైదరాబాద్‌లో ఒక ప్లాట్ ఉంది. ఇటీవల ఆ ఇంటిని అభయ ఫౌండేషన్‌కు ఇచ్చేశాను. ఆరేళ్ల క్రితం ఇబ్రహీంపట్నంలో వృద్ధులకు, వైద్య సాయం అవసరమైన పేదలకు అభయ ఆనంద నిలయం ఏర్పాటు చేశాను. నేను మరణించేదాకా, మరణించాక కూడా నలుగురిని బతికించే ప్రయత్నం చేయాలన్నది తపన. ఈ ప్రయాణంలో ఎన్నో ఆవేదనలు చుట్టుముట్టాయి. ఎందరి కష్టాలనో దగ్గరుండి చూసి, దుఃఖం కలిగేది. చేసే ప్రతి పనినీ దైవాంశగా భావిస్తూ వచ్చాను. పిల్లల కోసం కంపాస్ రేపటి తరం బాగుండాలంటే విద్యార్థుల్లో మానవతా స్పృహ కలగాలి. అందుకే, ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి చిన్నారులకు మన దేశ నాయకుల గురించి, సంస్కార పాఠాలు అందించే ప్రయత్నం చేస్తున్నాను. పిల్లలు అడిగిన ఎన్నో ప్రశ్నలకు సమాధానంగా ‘కంపాస్’అనే పేరుతో పుస్తకం తీసుకువచ్చాను. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రతి రోజూ ఉదయం నుంచి 10 వేల మందికి టచ్‌లో ఉంటాం. నేను కోరేది ఒక్కటే ... వాలంటీర్లుగా వారంలో ఒక్క రోజు మాకివ్వండి. సేవా మార్గంలో తోడవ్వండి. అంకితభావంతో ఉన్న యువత ఇలాంటి సంస్థలలో పనిచేయడం వల్ల వారిలో జీవన నైపుణ్యాలు పెరుగుతాయి. సమాజం బాగుండాలంటే యువత చేతులు ఏకమవ్వాలి’’ అని తెలియజేస్తున్నారు బాలచంద్ర. – నిర్మలారెడ్డి -
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న రజనీకాంత్
Rajinikanth Receives Dadasaheb Phalke Award : సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘దాదాసాహెబ్ ఫాల్కే’ లభించింది. గత నాలుగు దశాబ్దాలుగా ఆయన సినీ పరిశ్రమకు చేస్తున్న విశేష సేవలకు గాను కేంద్రప్రభుత్వం ఆయన్ని ఈ పురస్కారంతో సత్కరించింది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. కాగా ఇదే అవార్డుల ప్రధానోత్సవంలో హీరో ధనుష్ అసురన్ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు. దీంతో ఒకే ఏడాదిలో రజనీకాంత్, ఆయన అల్లుడు ధనుష్ అవార్డులు అందుకోవడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా అవార్డుల ప్రధానోత్సవానికి వెళ్లేముందు రజనీకాంత్ స్థానిక ఫోయెస్‌గార్డెన్‌లోని తన నివాసంలో మీడియాతో ముచ్చటించారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు తనకు లభించడం సంతోషంగా ఉందని రజనీకాంత్ పేర్కొన్నారు. ఈ అవార్డును తాను ఊహించలేదన్నారు. ఈ సమయంలో తన గురువు కె.బాలచందర్ లేకపోవడం బాధగా ఉందన్నారు. ఇక మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో.. సోమవారం రెండు సంతోషకరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని, అందులో ఒకటి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకోనుండటం, రెండవది కూతురు సౌందర్య రజనీకాంత్ విశాకన్ హూట్ పేరుతో సోషల్ మీడియా యాప్ ప్రారంభించనుండటం అని పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: టాలీవుడ్లో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత పూరి జగన్నాథ్ కన్నీళ్లు పెట్టుకున్నారు : డైరెక్టర్ -
ఆ విషయంలో...ఆయనే నాకు స్ఫూర్తి: దాసరి
బాలచందర్ గారి లాంటి ఒక మహాదర్శకుడు కన్నుమూయడంతో భారతదేశంలో ఒక గొప్ప క్రియేటివ్ మ్యాన్ తన శకం ముగించినట్లయింది. నాకు ఆనాటి మద్రాసులో మొట్టమొదటి దర్శక మిత్రుడు బాలచందర్ గారు. మేము ఎప్పుడు కలసి మాట్లాడుకున్నా మా కబుర్లు నాటకాలు, సినిమాల గురించే సాగేవి. నిజానికి, మా ఇద్దరి జీవితాలూ చాలా ప్యారలల్‌గా నడిచాయి. సినిమాల కోసం ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. నేనూ అలాగే సినిమా కోసం నా ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఇద్దరం నాటకాల నుంచి సినిమాల్లోకి వచ్చినవాళ్ళమే. రంగస్థలంపై నటుడిగా, దర్శకుడిగా కొన్ని వందల ప్రదర్శనలు చేశారాయన. నేనూ అలాగే చేశాను. సినిమాల్లో ఆయన మొదట మాటల రచయితగా ప్రారంభించి ఆ తరువాత దర్శకుడయ్యారు. నేనూ అంతే! అందుకే, నా కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథి అయితే, ఆయన కార్యక్రమాలకు నేను ముఖ్య అతిథిగా వెళ్ళేవాణ్ణి. ఆయనను చివరిసారిగా శిల్పకళావేదికలో మా కార్యక్రమానికి వచ్చినప్పుడు కలిశాను. ఆయన చాలాసార్లు ‘నారాయణరావు గారూ! మీరంటే నాకు చాలా ఇష్టం’ అనేవారు. కారణం ఏమిటని అడిగితే... ‘మీరూ స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి ఇష్టపడరు. నేనూ స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి ఇష్టపడను. ఇద్దరం కొత్తవాళ్ళ కోసం, చిన్నవాళ్ళ కోసం కథలు రాసుకొని సినిమాలు తీస్తుంటాం. అలాగే తీసుకుందాం’ అనేవారు. నిజం చెప్పాలంటే, అలా కొత్తవాళ్ళతో, చిన్నవాళ్ళతో కొత్త తరహా కథలు రాసుకొని సినిమాలు తీయడంలో నాకు స్ఫూర్తి ఆయనే! బాలచందర్ సినీ జీవితాన్ని గమనిస్తే, ఆయన తీసుకొచ్చిన నటీనటులు స్టార్స్ అయ్యేవారు. అలా తన స్కూల్ నుంచి వచ్చిన స్టార్స్‌తో ఆయన సినిమాలు తీశారే తప్ప, ఒక్క శివాజీ గణేశన్ మినహా పెద్ద స్టార్లతో ఎప్పుడూ తీయలేదు! గమనిస్తే - ఆయన తీసుకొచ్చిన నటులు రజనీకాంత్, కమలహాసన్లు భారతదేశానికే సూపర్‌స్టార్లయ్యారు. అలాగే, ప్రకాశ్‌రాజ్ కూడా! ఇలా ఎంతోమంది ఆర్టిస్టుల్ని స్టార్స్‌ను చేశారాయన. సమాజంలో జరుగుతున్న అంశాలనూ, కొన్ని చేదు నిజాలనూ మనం సినిమా ద్వారా చెప్పాలని బాలచందర్ గారు నాతో ఎప్పుడూ అంటూ ఉండేవారు. నా సినిమాల్లో నేనూ ఆ పని చేస్తుండేవాణ్ణి కాబట్టి, ఆయన సంతోషించేవారు. మనిద్దరి కోణాలూ ఒకేలా ఉన్నాయనేవారు. ఆయన నాటకాలు ‘మేజర్ చంద్రకాంత్’ లాంటివి ఆయనతో కలసి కూర్చొని, చూసేవాణ్ణి. నా ప్రతి సినిమా ఆయనకు చూపించేవాణ్ణి. నాకు బాగా గుర్తు. నా ‘మేఘసందేశం’ చిత్రం చూసిన ఆయన ‘నారాయణరావ్! నేను ఇన్‌సై్పర్ అయ్యాను’ అన్నారు. ఒక దర్శకుడి నుంచి మరో దర్శకుడికి దక్కే అరుదైన ప్రశంస అది. ఆ మాటతో ఆగకుండా ఆయన ఆ కథలోని ఆత్మ తీసుకొని, తమిళంలో ‘సింధుభైరవి’ చిత్రం తీశారు. ‘మేఘసందేశం’ మోడల్లో, దానికి బాగా దగ్గరగా ఉండేలా ఆ సినిమా తీయడమే కాక, ఆ మాట చెప్పే చేయడం దర్శకుడిగా ఆయన సంస్కారం, గొప్పదనం. ఇక, ఆయన సినిమాల్లో నాకు బాగా నచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా, ఆయన తొలి రోజుల్లో తమిళంలో తీసిన సంచలనాత్మక ‘అరంగేట్రం’ చిత్రం చాలా బాగుంటుంది. ఇక, ఆయన సినిమా చూసి, ఆ కథ తెలుగులో నేను చేయాలనుకున్న సందర్భాలూ ఒకటి రెండు లేకపోలేదు. ఆయన అద్భుతంగా తీసిన తమిళ చిత్రం ‘అపూర్వ రాగంగళ్’ను తెలుగులో నేను ‘తూర్పు - పడమర’గా తీశా. పోస్టర్ మీద దర్శకుడి పేరు ప్రత్యేకంగా కనిపించేలా వేయడమనే సంస్కృతిని ఆయన తమిళంలో, నేను తెలుగులో తెచ్చాం. ఆయన మాత్రం సెంటిమెంట్‌గా తన పేరును కిందే వేసుకొనేవారు. నేను మాత్రం ‘అందరి కన్నా డెరైక్టరే టాప్ కాబట్టి, నా పేరు పోస్టర్లో పైనే వేసుకుంటా’ అని ఆయనతో అంటుండేవాణ్ణి. ఆయననూ, నన్నూ, కన్నడ దిగ్దర్శకుడు పుట్టణ్ణ కణగల్నూ ‘డెరైక్టర్స్ ఆఫ్ ది సౌత్’ అంటూ అప్పట్లో అందరూ గొప్పగా ప్రస్తావించేవారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా... ఒక పెద్ద హీరోకు ఉండేంత క్రేజున్న దర్శకుడు - బాలచందర్ గారు. ఆయనను చూసి ఈ తరం ఏం నేర్చుకోవాలంటే... దర్శకుడనేవాడు ఎప్పుడూ ఏ హీరో మోకాళ్ళ దగ్గరా ఉండకూడదని నేర్చుకోవాలి. మొదటి నుంచి చివరి దాకా అలాగే సింహంలా జీవించిన అలాంటి ఒక మహా వ్యక్తి ఈ రోజున లేరన్న నిజాన్ని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ చిత్ర పరిశ్రమలు జీర్ణించుకోలేవు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. (సంభాషణ - రెంటాల జయదేవ) -
ఆయన నుంచి...ఎవరూ సరిగ్గా నేర్చుకోలేదేమో!
సి. మృణాళిని ప్రముఖ రచయిత్రి, విశ్లేషకురాలు తెలుగు సినిమాల్లో స్త్రీలను బాగా చూపించడం (అంటే అందంగా కాదు) అనేది ఎవరూ పెద్దగా ఆశించే విషయం కాదు. అలా ఆశించిన వారికి ఆశాభంగమే. కాకపోతే ‘‘స్త్రీలను కంటతడి పెట్టించే సినిమాల’’నే స్త్రీ ప్రాధాన్య సినిమాలుగా భావించే సంప్రదాయం మనది. అలా ఏడ్పించే సినిమాలకు ఏమీ కొదవలేదు. అయితే, అలా ఏడిపించడం కంటే, దుఃఖించే సందర్భాల్లోనూ మనోనిబ్బరంతో, పరిణతితో ప్రవర్తించే స్త్రీలను సృష్టించిన అపురూప దర్శకుడు కె. బాలచందర్. ఆయన సినిమాలన్నిటిలోనూ ఆధునిక స్త్రీలో ఉన్న ఆత్మవిశ్వాసం, పరిణతితో కూడిన ఆలోచనా విధానం కనిపిస్తాయి. బాలచందర్‌గారికి స్త్రీల పట్ల అపారమైన గౌరవం, స్త్రీలకు ఈ సమాజంలో ఎదురవుతున్న పరిస్థితుల పట్ల అసహనం, వారి పట్ల సానుభూతి పుష్కలంగా ఉన్నాయి. అయితే, బహుశా ఆ సానుభూతి మాత్రమే ఉండి ఉంటే, ఈ రోజు మహిళా ప్రేక్షకులు ఆయన్ని అంతగా గుర్తు పెట్టుకోనవసరం లేదు. కానీ స్త్రీలను వ్యక్తులుగా చూసిన, అర్థం చేసుకున్న ఒక అపూర్వమైన దృష్టి ఆయనలో ఉంది. స్త్రీలలోని సున్నితత్వాన్ని ఇతరులు బలహీనతగా చూపిస్తే, ఆయన అదే సున్నితత్వాన్ని ఆమె బలంగా చూపారు. ఇతర దర్శకులకూ, ఆయనకూ బహుశా తేడా ఇక్కడే ఉంది. ముఖ్యంగా అంతులేని కథ, ఇది కథకాదు, గుప్పెడు మనసు, మరో చరిత్ర (మాధవి పాత్ర) మొదలైన సినిమాలు చూసినప్పుడు ఈ అభిప్రాయం బలపడుతుంది.స్త్రీ పాత్రల చిత్రణలో ఆయన ప్రత్యేకత వారిని దేవతలుగా కాక మనుషులుగా చూపడం. 1976లో వచ్చిన ‘అంతులేని కథ’ ఆనాటి స్త్రీలెందరి జీవితాలకో ప్రాతినిధ్యం వహించిన చిత్రం. అప్పుడప్పుడే స్త్రీలు కుటుంబ భారాన్ని మోయడం ప్రారంభమైంది. బహుశా మరో దర్శకుడైతే ఆ స్త్రీ (జయప్రద)ని సంపూర్ణ విషాదజీవిగా, స్వీయకరుణతో కుమిలిపోయేదానిగా, ఇంటిల్లిపాదినీ ఒక్క మాటా అనని సహనశీలిగా... అంటే అతిమానుష జీవిగా (లార్జర్ దేన్ లైఫ్) చూపించేవారేమో. కానీ బాలచందర్ ఆమెను రక్తమాంసాలున్న, ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన స్త్రీగా, అత్యంత సహజంగా చిత్రించారు. ఇంట్లో వాళ్లకు ఆమె ‘పెద్ద పులి’, పిల్లలకైతే ‘రాక్షసి’ కూడా. బయటకు వెళ్లి పదిమందిలో కూర్చుని పని చేసే తనకు మంచి దుస్తులు వేసుకోవాల్సిన అవసరం, హక్కూ కూడా ఉన్నాయని భావించే వాస్తవిక దృష్టిని చూపడం మరవలేదు దర్శకుడు. ఇంతకూ ఆమె చేసిన త్యాగాలు చిన్నవేమీ కాదు. తన ప్రేమను, వివాహాన్ని, విరామాన్ని అన్నిటినీ కోల్పోతుంది; తన శ్రమను సునాయాసంగా తక్కిన వాళ్ల కోసం ఖర్చు చేస్తుంది. కానీ ఒక త్యాగమూర్తిలాగా ప్రవర్తించదు; కుటుంబం పట్ల తన బాధ్యతను స్వీకరించాలని నిర్ణయించుకున్నాక, దాని నిర్వహణలో కలిగే మనస్తాపాలు వంటివి కూడా ప్రతి స్త్రీ అనుభవిస్తుందనీ, కుటుంబం, తన జీవితం - ఈ రెండింటి మధ్య ఉన్న సంఘర్షణను మనో నిబ్బరంతో ఎదుర్కొంటుందనీ చిత్రించడం ఆయన చేసిన గొప్ప పని. అంతేకానీ, స్త్రీ అంటే భూదేవి వంటి సహనమూర్తి అనే టైప్స్ లాగా ఆయన చిత్రించలేదు.ఇదే దృక్పథం ‘గుప్పెడు మనసు’ చిత్రంలో సుజాత పాత్రలో కూడ కనిపిస్తుంది. సుజాత ప్రసిద్ధ రచయిత్రి. తన నవలల్లో స్త్రీ పాత్రలకు ఆమె పేరు పొందింది. అభిమానులు కూడా చాలా మందే ఉన్నారు. కానీ నిజ జీవితంలో సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు తనలోని రచయిత్రి, తనూ వేర్వేరేమో అనుకుంటుంది. తను ఎంతగానో ప్రేమించే భర్త, తామిద్దరు కూతురిగా భావిస్తున్న యువతితో క్షణాకావేశంలో దైహిక సంబంధం పెట్టుకోవడాన్ని సహించలేకపోతుంది. క్షమించలేకపోతుంది. అతనితో కాపురం చేయలేకపోతుంది. అయితే సుజాతలో ఉన్న రచయిత్రి, సరితను మాత్రం అర్థం చేసుకోగలుగుతుంది. ఆ అమ్మాయి తప్పులేదనీ, తప్పంతా తన భర్తదేననీ భావిస్తుంది. తన కలలో సరితను చనిపోయినట్లుగా ఊహించుకుని ఆనందించినందుకు జాగ్రదావస్థలో తనని తానే అసహ్యించుకుంటుంది. సరితలో కూడ సుజాత పట్ల గౌరవం అమితంగా ఉన్నందువల్లే, శరత్‌బాబుతో ఒక్కరాత్రి సంబంధం వల్ల తనకు పుట్టిన పాపకు విద్య (సుజాత పేరు) అని పేరు పెట్టుకుంటుంది. అన్నిటికంటే ఇక్కడ చెప్పదగ్గ విషయం సరిత పాత్ర. తన తండ్రి వయస్సుగలిగిన వ్యక్తి అతను; అతను తనను లోబరచుకోవడానికి పూనుకున్నప్పుడు లొంగిపోయింది. అది పరిపక్వత లేని తన తప్పు కాదని ఇతరులు చెప్పినా, ఒప్పుకోదు. తనకు కూడ మనసులో ఎక్కడో అతని పట్ల కోరిక లేకపోతే వ్యతిరేకించి ఉండేది కదా. కానీ ఎందుకు ఆనందంగా లొంగిపోయింది? కనక తప్పు తనలోనూ ఉందని అనుకుంటుంది. అందుకే ఈ సంఘటనను పట్టించుకోకుండా తనని వివాహం చేసుకుంటానని వచ్చిన సుజాత తమ్ముడిని తిరస్కరిస్తుంది. అందరూ మంచి వాళ్లే. కానీ ఒకే బలహీన క్షణం ఇంతమంది జీవితాలనూ నాశనం చేసింది. పితృస్వామ్య వ్యవస్థలో సహజంగానే ఏ ఆపద జరి గినా, ఎక్కువ బాధపడేది స్త్రీలే. కానీ ఆ స్త్రీలిద్దరూ ఈ దుర్భరమైన సన్నివేశంలోనూ, ఎంత హుందాగా ప్రవర్తిస్తారో చూసినపుడు, బాలచందర్ వంటి దర్శకులు మనకెంత అవసరం కదా అనిపిస్తుంది. ఇక మూడో చిత్రం ‘ఇది కథ కాదు’. ఇది నిజంగా సంచలనాత్మక చిత్రమే అన్ని విధాలా. పురుషులతో స్త్రీ సంబంధాల్లో ఎన్ని సంక్షిష్టతలున్నాయో అన్నిటినీ చూపిస్తూ (చిరంజీవి, శరత్‌బాబు, కమల్‌హాసన్‌లతో జయసుధ అనుబంధం), స్త్రీల మధ్య అత్యంత సహజంగా ఉండ గలిగిన స్నేహబంధాన్ని (ముఖ్యంగా జయసుధ, అత్తగారి మధ్య) మనకు గుర్తు చేస్తూ, అత్యంత ఆలోచనాత్మకమైన సినిమాగా దీన్ని రూపొందించారు. ఇక్కడ కూడ జయసుధ పాత్ర కరుణాస్పదమై మాత్రమే ఉండేది మరో దర్శకుడి చేతిలో. కానీ బాలచందర్ చేతుల్లో మనందరి గౌరవం పొందేలా ఆమె ఉంటుంది. అసాధారణమైన ఇందులోని అత్తగారి పాత్ర ఈనాడు స్త్రీవాదులు చెప్పే ‘స్త్రీల ఐక్యత’కు ప్రోటోటైపా అన్నట్టుంటుంది. జయసుధ కృంగిపోయే పరిస్థితులు ఇందులో చాలానే వస్తాయి. కానీ ప్రతి సన్నివేశం నుంచీ మళ్లీ తనని తాను పునరుజ్జీవింపజేసుకునే ఒక సహజమైన ధైర్యం ఆమెలో చూపించి, ఆమె పట్ల మనకు అపారమైన గౌరవం కలిగిస్తారు దర్శకుడు. బహుశా మరో రకం దర్శకుడైతే, తనని ఎంతగానో ప్రేమించే కమలహాసన్‌ను ఆమె జీవిత భాగస్వామిని చేసుకున్నట్టు చిత్రించేవారేమో. కానీ, ఏ మగవాడూ అక్కర్లేకుండా తన జీవితాన్ని కొనసాగించగలనన్న ఆత్మ విశ్వాసాన్ని ఈమెలో చూపించి, ఒక ఆధునిక స్త్రీ ఎలా ఉండగలదో ఆయన మనకు చెప్పారు. చివర అత్తగారు ఆమెకు తోడుగా నిలవడంతో బంగారానికి తావి అబ్బినట్టే అయింది. ‘మరో చరిత్ర’లో మాధవి పాత్రలోనూ, ‘ఆకలిరాజ్యం’లో శ్రీదేవి పాత్రలోనూ ఒక ఆధునిక స్త్రీ జీవితంలోని సంఘర్షణ, దాన్ని ఆమె సంయమనంతో, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్న తీరు ఆయనకు స్త్రీల పట్ల ఎంత గౌరవం, నమ్మకం ఉన్నాయో తెలియజేసేవే. సింధుభైరవి, అపూర్వ రాగంగళ్ (తెలు గులో దాసరి గారి ‘తూర్పు పడమర’), ఆడవాళ్లూ మీకు జోహార్లు, జీవితరంగం మొదలైన మరెన్నో సినిమాలు ఆయన స్త్రీలను తను ఎంత వాస్తవిక దృష్టితో, అవగాహనతో చిత్రించారో రుజువు చేస్తాయి. సినిమాల్లో నాయికల ఆహార్యంలో కూడ ఆయన ఎంత సహజత్వాన్ని, హుందాతనాన్ని పాటించడానికి శ్రద్ధ తీసుకునేవారో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.బాలచందర్‌గారిని అభిమానించేవారు, గురువుగా భావించేవారూ చాలా మందే ఉన్నారు. కానీ ఆయన నుంచి, స్త్రీలను ఎలా చిత్రించాలో మాత్రం బహుశా ఎవ్వరూ సరిగ్గా నేర్చుకోలేదేమో! ఆయన ఓ చరిత్ర! ‘‘సినీ రంగంలో ఆయన కన్నా ఎంతో సీనియర్‌నైన నన్ను ఏరికోరి తన అసోసియేట్‌గా తీసుకున్నారు. నన్ను ‘తమ్ముడి లాంటి వాడు’ అనేవారు. తమిళ పత్రికలూ మా గురించి అన్నదమ్ములని ప్రస్తావిస్తూ రాసేవి. ‘భలే కోడళ్ళు’ మొదలు ‘మూణ్రామ్ ముడిచ్చు’ దాకా 16 చిత్రాలకు ఆయన దగ్గర పనిచేశా. రొటీన్‌కు భిన్నమైన చిత్రాలు చేయడం ఆయన గొప్పదనం. అందుకే, ఆయన పేరు అంతగా దేశవ్యాప్తమైంది. ఆయన గ్రేట్ లెజెండ్. మళ్ళీ అలాంటి మేధావి కానీ, అంత క్రియేటివ్ జీనియస్‌లు కానీ సినిమా రంగానికి రావడం కష్టం.’’ - ఈరంకి శర్మ, ‘చిలకమ్మ చెప్పింది’ దర్శకుడు - బాలచందర్‌కు సన్నిహితుడు ‘‘బాలచందర్‌గారి మరణం భారతీయ చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటు.’’- కె. రాఘవేంద్రరావు, దర్శకుడు ‘‘దక్షిణాది దిగ్గజ దర్శకుల్లో కె. బాలచందర్ ముందు వరుసలో ఉంటారు. సినీ రంగానికి తన దర్శకత్వ ప్రతిభతో కొత్త మార్గం చూపించిన - మార్గదర్శకుడు.’’ఙ- మోహన్‌బాబు, నటుడు, నిర్మాత ‘‘మధ్యతరగతి జీవిత చీకటి కోణాల్ని అద్భుతంగా తెరకెక్కించిన par ఘనుడాయన.’- త్రివిక్రమ్ , దర్శకుడు, రచయిత ‘‘బాలచందర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.’’- రామ్‌చరణ్, నటుడు ‘‘చిరంజీవిగారితో ‘రుద్రవీణ’లాంటి సందేశాత్మక చిత్రం చేశారు బాలచందర్. ఎందరో నటీనటుల్ని స్టార్స్ చేసిన ఘనులు.’’ - అల్లు అర్జున్, నటుడు ‘‘సినీ సీమకు ఆయనో అద్భుతం’’ - బోయపాటి శ్రీను, దర్శకుడు ‘‘బాలచందర్ గారి ‘డ్యూయట్’ చిత్రానికీ,‘గుప్పెడు మనసు’ సహా అనేక టీవీ సీరియల్స్‌కూ తెలుగులో డబ్బింగ్ రచన చేసే అదృష్టం నాకు వచ్చింది. నా పని తీరు నచ్చి, ఆయన తన ‘కల్కి’ చిత్రాన్ని తెలుగులోకి స్వీయ నిర్మాణంలో డబ్ చేస్తూ ప్రత్యేకంగా నాకప్పగించారు. అలాగే, కమలహాసన్ ‘అవ్వై షణ్ముఖి’ చిత్రం తెలుగు అనువాదం ‘భామనే సత్యభామనే’ చూసిన బాలచందర్ ఆ చిత్ర శతదినోత్సవంలో వేదికపై అందరి ఎదుటా నన్ను ప్రత్యేకంగా మెచ్చుకొన్నారు. అది నాకు అత్యుత్తమ అవార్డు. ఆయనన్నా, ఆయన సృజన అన్నా నాకు అపార గౌరవం. అలాంటి మహానుభావుడు మళ్ళీ పుట్టడు!’’ - వెన్నెలకంటి, సినీ రచయిత