స్ట్రాంగ్ రూములకు ఈవీఎంలు.. ఇకపై పటిష్ఠ నిఘా!
సాక్షి, కరీంనగర్: ఎన్నికల క్రతువు ముగియడంతో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల సామగ్రిని ఎస్సారార్ కళాశాలలోని స్ట్రాంగ్ రూంలకు తరలించారు. వాటిని వచ్చే అయిదేళ్ల వరకు కాపాడాల్సి ఉంటుంది. రిటర్నింగ్ అధికారులు ఈవీఎంలు, వీవీప్యాట్లు, పోస్టల్ బ్యాలెట్ పేపర్లు, వీవీప్యాట్లలోని స్లిప్పులు, మాక్‌పోల్ ధ్రువపత్రాలు, పీవో డైరీ, టెండర్ బ్యాలెట్ పేపర్ తదితరాలను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచి, తాళాలు, సీల్ వేశారు.
56 రోజులు.. సామాన్యుల పాట్లు!
గత అక్టోబర్ 9న ఎన్నికల షెడ్యూల్ ప్రకటన నుంచి కోడ్ అమలులోకి రాగా 56 రోజులపాటు సామాన్యుల నానాపాట్లు పడ్డారు. రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లాలంటే వ్యాపార, వాణిజ్య వర్గాలతోపాటు పేద, మధ్య తరగతి ప్రజలు భయపడ్డారు. మంగళవారం సాయంత్రం నుంచి కోడ్ ఎత్తివేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
స్ట్రాంగ్ రూములపై నిఘా..
ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూములపై ఎన్నికల అధికారులు పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశారు. వాటిని నిరంతరం పర్యవేక్షించడానికి సీసీ కెమెరాలు బిగించడంతోపాటు కేంద్ర బలగాలు మోహరించాయి. తిరిగి ఎన్నికల సంఘానికి అప్పగించేవరకు జిల్లా ఎన్నికల అధికారి బాధ్యత వహించాల్సి ఉంటుంది.
ఎప్పుడైనా ఫిర్యాదు చేయొచ్చు..
ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత గెలిచిన అభ్యర్థిపై పరాజితులు ఎప్పుడైనా ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. ఓట్ల లెక్కింపు సమయంలో అవకతవకలు జరిగాయని భావించినా న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. ఇలాంటి సందర్భాల్లో అభ్యర్థులకు న్యాయం చేయడానికి ఈవీఎంల కంట్రోల్ యూనిట్లలో నిక్షిప్తమైన ఓట్లను మళ్లీ లెక్కించాలని కోర్టు ఆదేశించవచ్చు.
అలాంటప్పుడు ఏ నియోజకవర్గంలో ఫిర్యాదు అందితే దానికి సంబంధించిన కంట్రోల్ యూనిట్లలో ఓట్లను తక్షణమే లెక్కించడానికి వీలుగా అధికారులు ఈవీఎంలను భద్రపరిచారు. ఎన్నికల ఫలితాలు వెల్లడించిన తర్వాత 45 రోజులపాటు జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో ఈవీఎంలకు భద్రత కల్పిస్తారు. అనంతరం వాటిని ఎన్నికల సంఘానికి అప్పగించి, గోదాములకు చేర్చుతారు. అక్కడ ఈవీఎంలను ఐదేళ్లపాటు భద్రపరుస్తారు. అనంతరం ఎన్నికల సంఘం నియమించిన ఇంజినీర్లు వచ్చి, వాటిలోని డేటాను తొలగించి, అవసరాన్ని బట్టి దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడికి తీసుకెళ్లి, ఉపయోగిస్తారు.
కంట్రోల్ యూనిట్లే కీలకం!
అభ్యర్థుల మధ్య ఎన్నిక పోటాపోటీగా జరిగినప్పుడు గోదాముల్లో భద్రపరిచిన ఈవీఎంల కంట్రోల్ యూనిట్లు కీలకమవుతాయి. అతి తక్కువ ఓట్లతో ఓడిపోయినవారు ఎప్పుడైనా ఓట్లను మళ్లీ లెక్కించాలని న్యాయస్థానాలను ఆశ్రయిస్తారు. ఆ సందర్భంలో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయి. 2018 ఎన్నికల్లో 441 ఓట్లతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ధర్మపురి నియోజకవర్గం నుంచి కొప్పుల ఈశ్వర్ (టీఆర్ఎస్) గెలిచారు.
ఆయన దొడ్డిదారిన విజయం సాధించారని కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే, ఈసారి జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గంలో 3,163 ఓట్లతో గంగుల కమలాకర్ గెలవగా హుజూరాబాద్, చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎక్కువ మెజారిటీతో విజయం సాధించారు. దీంతో ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఎన్నికల అధికారులు చెబుతున్నారు.
8 వారాలు ప్రజావాణి నిర్వహించలే..
ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజావాణిని ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి నిలిపివేసిన విషయం విధితమే. 8 వారాలుగా ప్రజావాణి లేకపోవడంతో ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా ఎలక్షన్ కోడ్ ఎత్తివేయడంతో వచ్చే సోమవారం కార్యక్రమం నిర్వహించనున్నారు. దీంతో వందల సంఖ్యలో అర్జీలు రానున్నాయి.
ఇవి చదవండి: 'డిసెంబర్ 31'లోగా అని మాటిచ్చారు.. మరవకండి!