బంగర్ స్థానంలో సెహ్వాగ్?
ముంబై:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)ఆరంభమైన నాటి నుంచి పేలవమైన ఫామ్‌తో ఇప్పటివరకూ టైటిల్ సాధించలేకపోయిన కింగ్స్ పంజాబ్ తమ ప్రదర్శనను మెరుగు పరుచుకోవాలనే యోచనలోఉంది. ఈ మేరకు వచ్చే సీజన్లో కింగ్స్ పంజాబ్ కొన్ని మార్పులకు శ్రీకారం చుట్టాలని భావిస్తోంది. ప్రధానంగా కింగ్స్ పంజాబ్ కోచ్ సంజయ్ బంగర్ స్థానంలో వీరేంద్ర సెహ్వాగ్‌ను నియమించుకునేందుకు సన్నాహాలు చేస్తోంది.
గత రెండు ఐపీఎల్ సీజన్లో లీగ్ దశలోనే పోరును ముగించిన పంజాబ్.. ఈసారి ఎలాగైనా టైటిల్ దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది. దీనిలో భాగంగానే గతంలో కింగ్స్ పంజాబ్ సభ్యుడిగా ఉన్న సెహ్వాగ్‌ను కోచ్‌గా నియమించడానికి కసరత్తులు చేస్తోంది. ఐపీఎల్ తొలి ఎడిషన్(2008)లో సెమీ ఫైనల్ వరకూ వెళ్లిన కింగ్స్ పంజాబ్.. ఆ తరువాత 2014లో మాత్రమే ఫైనల్ వరకూ వెళ్లింది. మిగతా సీజన్లలో కింగ్స్ ఘోరంగా విఫలమై లీగ్ స్టేజ్‌ను దాటలేకపోయింది. దాంతో కనీసం కొన్నిమార్పులు చేసి, తమ తలరాతను మార్చుకోవాలని కింగ్స్ పంజాబ్ వ్యూహాలు రచిస్తోంది. దీనిలో భాగంగానే కొత్త కోచ్ గా సెహ్వాగ్ పేరును తెరపైకి తీసుకొచ్చారు.