లౌకిక శక్తుల ఐక్యత బాధ్యత లెఫ్ట్దే
సీపీఐ ఆవిర్భావం ఆకస్మిక పరిణామం కాదు: బర్ధన్
సాక్షి, హైదరాబాద్: దేశం అన్నివిధాలా సంక్షోభంలో కూరుకుపోయిన తరుణంలో వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తుల ఐక్యతే కమ్యూనిస్టుల ముందున్న సవాలని సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి ఏబీ బర్ధన్ చెప్పారు. ఈ శక్తులన్నింటినీ కలిపి ఉంచి వాటి స్థాయిని పెంచాల్సిన బాధ్యత వామపక్షాలదేనన్నారు. సీపీఐ 88వ వ్యవస్థాపక దినోత్సవం, కమ్యూనిస్టు యోధుడు చండ్ర రాజేశ్వరరావు శత జయంతి సందర్భంగా గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన అరుణపతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. వచ్చే రెండు నెలల కాలం చాలా కీలకమైందని, సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చాలా తీవ్రంగా ఉంటుందన్నారు. దేశంలో రెండు పార్టీల సిద్ధాంతాలే రాజ్యమేలుతున్నాయన్నారు.
అధికార పక్షం ఓడితే ప్రతిపక్షం, ప్రతిపక్షం పోతే అధికారపక్షమే గద్దెనెక్కాలనుకుంటున్నాయని, వాస్తవానికి ఈ రెండింటి మధ్య పెద్దగా తేడాలు లేవన్నారు.కాంగ్రెస్ పార్టీ అంతోఇంతో లౌకిక పార్టీగా చెప్పుకుంటుండగా ప్రతిపక్షం పచ్చిమతోన్మాద పార్టీ అని విమర్శించారు. ఆరు దశాబ్దాల స్వేచ్ఛా భారతంలోనూ సామాన్యుడి కష్టాలు కడతేరలేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. కమ్యూనిస్టు ఉద్యమంలో దురదృష్టవశాత్తు చీలిక వచ్చినప్పటికీ అందరి లక్ష్యం సోషలిజమేనన్నారు. కమ్యూనిస్టుల ఐక్యతే సమస్యలకు పరిష్కారమన్నారు. అయితే అది ఆషామాషీ కాదని, బూర్జువా పార్టీల మాదిరి ఈవేళ కలిసిపోయి,మరునాడు విడిపోవడం జరగదన్నారు. సైద్ధాంతిక, నిబద్ధత ప్రాతిపదికన కమ్యూనిస్టుల విలీనానికి సీపీఐ తన వంతు ప్రయత్నం చేస్తుందన్నారు. 1925 డిసెంబర్ 26న చారిత్రక పరిణామాల మధ్య సీపీఐ పుట్టిందే గానీ ఆకస్మికంగా ఏర్పడలేదన్నారు. 1917 నాటి సోవియెట్ విప్లవం భారతీయ యువ విప్లవకారులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు. తమ పోరాటం ఫలితంగానే ఆనాటి కాంగ్రెస్ కూడా ‘పూర్ణ స్వరాజ్’ ఉద్యమాన్ని ప్రకటించాల్సి వచ్చిందన్నారు. తెలంగాణ సాయుధ పోరు వంటి అనేక చారిత్రక పోరాటాలను నడిపిన ఘనత కమ్యూనిస్టులదేనని చెప్పారు. ఎన్ని సమస్యలున్నా తమ నుంచి మార్క్సిజాన్ని దూరం చేయలేరన్నారు.
నిబద్ధత కమ్యూనిస్టులదే : నారాయణ
సభకు అధ్యక్షత వహించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ మాట్లాడుతూ,రాష్ట్రాన్ని వివిధ రకాల మాఫియాలు పాలిస్తున్నాయే తప్ప ముఖ్యమంత్రి కాదన్నారు.కమ్యూనిస్టులకు చట్టంపై నమ్మకం లేదనే వారే రాజకీయ వ్యవస్థల్ని, చట్టసభల్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇచ్చిన మాటకు, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడేది కమ్యూనిస్టు పార్టీలేనన్నారు. బూర్జువా పార్టీల మాదిరి తాము పూటకో మాట మాట్లాడడం లేదని నారాయణ చెప్పారు. జేసీ బ్రదర్స్ వంటి ప్రైవేటు బస్సు మాఫియాను నియంత్రించే స్థాయి ముఖ్యమంత్రికి లేదన్నారు. నాయకులు పార్టీలు మారుతున్న తీరు ఇసుకతక్కెడ, పేడ తక్కెడగా ఉందని, వాళ్లలో వాళ్లే పార్టీలు మారుతూ ఎక్కడున్నా అధికారం తమకే దక్కేలా చూసుకుంటున్నారని ఆరోపించారు. సభలో పి.నరసింహ నేతృత్వంలో ప్రజా నాట్యమండలి కళాకారులు విప్లవగేయాలను ఆలపించారు. రెడ్గార్డ్స్ అరుణపతాకానికి వందనం చేశారు.