పిసినారి కోటీశ్వరులు..
జల్సాలకు కోట్లు కోట్లు ఖర్చు చేసే వారితో పాటు కోట్లు గడించినా.. పైసా పైసా లెక్క చూసుకునే కోటీశ్వరులూ కొంత మంది ఉన్నారు. డబ్బు విలువ తెలియడం చేత ఆచి తూచి ఖర్చు చేసినా... పొదుపు, ఆదాను మరీ పీక్లెవెల్స్కి తీసుకెళ్లి పిసినారులు అనే బిరుదులు కూడా తెచ్చుకున్నారు. అలాంటి కొందరు ఆల్టైమ్ పిసినారి కోటీశ్వరులు, డబ్బును ఆదా చేసే విషయంలో వారి విచిత్ర అలవాట్లు చూడండి..
హెటీ గ్రీన్
ప్రపంచంలోనే అత్యంత పిసినారిగా గిన్నిస్ బుక్లోకి ఎక్కిన ఘనత హెటీ గ్రీన్ది. అత్యద్భుతమైన వ్యాపార దక్షతతో విచ్ ఆఫ్ వాల్స్ట్రీట్గా పేరొందిన ఆమె తన జమానాలో పెద్ద కోటీశ్వరురాలు. ఇక, ఆమె పీనాసితనం విషయానికొస్తే.. అర్ధణా కూడా విలువ చేయని స్టాంపు కోసం ఒక రాత్రంతా ఆమె తన వాహనంలో వెతుక్కుంటూ గడిపారు. ఒక డ్రెస్ కొంటే అది చిరిగిపోయేదాకా ప్రతి రోజూ దాన్నే వాడేవారు. ఉతికేటప్పుడు కూడా ఎక్కడెక్కడ మురికిగా ఉందో ఆ భాగాన్ని మాత్రమే ఉతుక్కుని సబ్బును ఆదా చేసేవారు. వైద్యం ఖర్చులను ఆదా చేసేందుకు కొడుకు కాలు విరిగినా సొంత వైద్యమే చేశారు. చివరికి ఆ కాలు తీసేయాల్సి వచ్చింది.
మైఖేల్ బ్లూమ్బర్గ్
ఈయన సంపద 27 బిలియన్ డాలర్ల పైగానే ఉం టుంది. అయినా కూడా పదేళ్ల క్రితం నుంచి రెండే జతల షూలను వాడుతున్నారు. వాటిపై లేబుల్స్ చెరిగిపోయి.. రంగు వెలిసిపోయినా వాటిని విడిచిపెట్టలేదు. ఇక కాఫీలాంటివి తాగాల్సి వస్తే.. వీలైనంత తక్కువ పరిమాణం కొనుక్కుంటారట.
డేవిడ్ షెరిటన్
ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్లో తొలినాళ్లలో ఇన్వెస్ట్ చేసిన కోటీశ్వరుడు షెరిటన్. హోటల్లో భోంచేసినప్పుడు.. అందులో కొంత భాగం మిగిలిపోతే వదిలేసి వచ్చేయడు షెరిటన్. దాన్ని ప్యాక్ చేయించుకుని ఇంటికి పట్టుకెళ్లి, మర్నాడు తింటాడు. పదిహేనేళ్లుగా బార్బర్ ఖర్చులు లేకుండా తన జుత్తును తనే కట్ చేసుకుంటున్నాడు.