యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ
బేసిక్స్.. బీమా
యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీలకు సంక్షిప్త రూపమే యులిప్స్. మ్యూచవల్ ఫండ్స్ కేవలం పెట్టుబడి సాధనాలు కాగా.. యులిప్స్ పథకాలు ఇటు బీమా రక్షణతో పాటు అటు పెట్టుబడి ప్రయోజనాలు కూడా కల్పిస్తాయి. పెట్టుబడులపైనా, మధ్యకాలిక రాబడులపైనా దృష్టి ఉన్నవారికి ఫండ్స్ అనువైనవి. కాగా దీర్ఘకాలికంగా పెట్టుబడి ప్రయోజనాలతో పాటు బీమా రక్షణ కూడా ఒకే సాధనం ద్వారా కావాలనుకునే వారికి యులిప్స్ అనువైనవి.
మార్కెట్లో వివిధ అవసరాలకు అనుగుణమైన అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయి. రిటైర్మెంట్ కోసం, సంపద పెంచుకునేందుకు, పిల్లల చదువు అవసరాలు.. మొదలైన వాటన్నిం టికీ వివిధ రకాల పాలసీలు ఉన్నాయి. ఈ పాలసీలకు కట్టే ప్రీమియంలలో కొంత భాగాన్ని బీమా కంపెనీ స్టాక్ మార్కెట్లు తదితర సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఫలితంగా ఆయా సాధనాల్లో రిస్కులను బట్టి మనకి వచ్చే రాబడులు ఆధారపడి ఉంటాయి.
యులిప్ పథకాన్ని ఎంచుకునే ముందు.. మీ రిస్కు సామర్థ్యం ఎంత ఉందనేది మీకు మీరు అంచనా వేసుకోవాలి. వివిధ పథకాల్లో చార్జీలు ఏ మేర ఉంటున్నాయో పోల్చి చూసుకోవాలి. మీరు కట్టే ప్రీమియంలో ఎంత భాగం బీమా కవరేజికి పోతోంది.. ఎంత మొత్తం ఇతర సాధనాల్లో ఇన్వెస్ట్‌మెంట్‌కి వెళుతోంది తెలుసుకోవాలి. పన్నులపరంగా ప్రయోజనాలేమైనా ఉన్నాయేమో చూసుకోవాలి.