రాజుకుంటోంది
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఫిబ్రవరిలో సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనే వార్తల నేపథ్యంలో జిల్లాలో రాజకీయం రాజుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను గుర్తించేందుకు అధికార పార్టీ పరిశీలకులు శుక్రవారం జిల్లాకు వస్తున్నారు. వీరు మూడు రోజుల పాటు జిల్లా కేంద్రంలో మకాం వేస్తుండటంతో ‘బయోడేటా’లతో ఔత్సాహిక నేతలు సిద్ధమవుతున్నారు. అయితే జిల్లాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా మిగతా చోట్ల కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినా ఒకటి రెండు రోజుల్లో తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలంటూ నేతలు విజ్ఞాపనలు సమర్పించనున్నారు.
మహారాష్ట్రకు చెందిన శాసన సభ్యులు గడ్డం ఆనందరావు, బస్వరాజ్ పాటిల్‌లు సభ్యులుగా ఉన్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) మూడు రోజుల పాటు జిల్లాలో మకాం వేయనుంది. ఈ ఇద్దరు నేతలు సంగారెడ్డి ఐబీ అతిథిగృహం కేంద్రంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నేతల నుంచి వినతులు స్వీకరించనున్నారు. ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలకులు వినతులు స్వీకరించేలా షెడ్యూలు సిద్ధం చేసినట్లు సమాచారం.
జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని స్థానాలకు ఆనందరావు, మెదక్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని స్థానాలకు బస్వరాజ్ పాటిల్ పరిశీలకులుగా వ్యవహరిస్తారు. ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల నుంచి టికెట్లు ఆశిస్తున్న ఔత్సాహిక అభ్యర్థులు పరిశీలకులను కలిసి తమ బలాబలాలు, తాము ఏ రకంగా అర్హులమో వివరించే అవకాశం ఉంది. తమ పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రులు గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డితో పరిశీలకులు హైదరాబాద్‌లో భేటీ అవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
పరిశీలకులు సమర్పించే నివేదిక ఆధారంగా ఫిబ్రవరి పదో తేదీలోగా అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం ఓ స్పష్టతకు వచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు భావిస్తున్నారు. సుమారు మూడు నెలల క్రితం ఏఐసీసీ పరిశీలకుడు అమర్ కాలే జిల్లాకు వచ్చిన ఔత్సాహిక నేతల నుంచి విజ్ఞాపనలు స్వీకరించిన విషయం తెలిసిందే.
సిట్టింగులున్నా పోటాపోటీ
ప్రస్తుతం జహీరాబాద్ లోక్‌సభ స్థానంతో పాటు జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మెదక్‌లో టీడీపీ, సిద్దిపేటలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను తప్పించి ఇతరులకు అవకాశం ఇవ్వడం కష్టమే అయినా తమ వంతు ప్రయత్నాలు చేసేందుకు కొందరు నేతలు సన్నద్ధమవుతున్నారు. మెదక్, సిద్దిపేటతో పాటు పటాన్చెరు, దుబ్బాకలో ఈ రకమైన ప్రయత్నాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు బీసీ కోటాలో నందీశ్వర్కే మరోమారు అవకాశం ఖాయమనే ప్రచారం వినిపిస్తోంది.
అయితే డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి భవిష్యత్ ప్రణాళికపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. దుబ్బాకలో ముత్యంరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నా, ఇతర నేతలు కూడా తమ ప్రయత్నాలు ముమ్మరం చేసే యోచనలో ఉన్నారు. దుబ్బాక విషయంలో తనకు పార్టీ అధిష్టానం నుంచి అనుకూలత ఉందనే ధీమాలో రఘునందన్ రావు ఉన్నారు. మెదక్‌లో మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి మరోమారు టికెట్ ఆశిస్తున్నా పీసీసీ సభ్యుడు సుప్రభాతరావు మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.
ఎంపీ అభ్యర్థిగా భూపాల్?
జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ సురేశ్ షెట్కార్ అభ్యర్థిత్వంపై ఎలాంటి పోటీ ఉండకపోవచ్చని అందరూ భావిస్తున్నారు. అయితే 2009 ఎన్నికల్లో మెదక్ ఎంపీగా పోటీ చేసిన నరేంద్రనాథ్ పార్టీని వీడటంతో...డీసీసీ అధ్యక్షుడు భూపాల్‌రెడ్డికి పార్టీలో అంతర్గత మద్దతు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. టికెట్ ఆశిస్తున్న నేతలంతా పరిశీలకుల ఎదుట వాదన వినిపించేందుకు, బల ప్రదర్శన జరిపేందుకు మద్దతుదారులను సమీకరించుకుంటుండటంతో జిల్లా కాంగ్రెస్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.