బీసీ డిక్లరేషన్ అమలుచేయాలి
నెల్లూరు(బృందావనం):
రాష్ట్రంలో బీసీల సంక్షేమం కోసం ప్రభుత్వం ‘బీసీ డిక్లరేషన్’ అమలు చేయాలని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జి.గంగాధర్ అన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగేళ్ల క్రితం అధికారంలో లేని సమయంలో టీడీపీ బీసీలకు డిక్లరేషన్‌తోపాటు 120 వాగ్దానాలు చేసిందన్నారు. అయితే అధికారంలోకి రాగానే ఆ విషయాన్ని పాలకులు మరిచిపోయారన్నారు. బీసీలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్, నామినేటెడ్ పోస్టుల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని, ఇప్పుడున్న 25 శాతం బీసీ రిజర్వేషన్లును 33 శాతానికి పెంచుతామని, స్థానిక సంస్థల్లో బీసీలకు ఇప్పడున్న 34 శాతం రిజర్వేషన్లును 50 శాతానికి పెంచుతామని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ కల్పిస్తామని చెప్పినట్లు డాక్టర్ గంగాధర్ వివరించారు. బీసీ డిక్లరేషన్ డిమాండ్ చేస్తూ డిసెంబరు మొదటివారంలో రాష్ట్ర రాజధాని విజయవాడలో 72 గంటలపాటు నిరాహార దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. 2017జనవరి మూడోవారంలో విజయవాడలో రెండులక్షల మందితో బీసీ ప్రభంజనమ సభను నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సమావేశంలో బీసీ జనసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కనకట్ల రఘురామ్ ముదిరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి జి.కల్యాణ్‌కుమార్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట కె.మురళీమోహన్, రాజు పాల్గొన్నారు.