లెక్చరర్ల డిమాండ్లను నెరవేర్చాలి
ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి
రొద్దం : కాంట్రాక్టు లెక్చరర్ల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని వైఎస్సార్ సీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దాదాపు నెల రోజులుగా వారు సమ్మె చేస్తుంటే పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం తగదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులను కలిసి మద్దతు కోరారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సమ్మెలో ఉన్న కాంట్రాక్ట్ లెక్చరర్లను తొలగిస్తామంటూ ప్రభుత్వం నోటీసులు జారీ చేయడం దారుణమన్నారు. వారి సమ్మెకు మద్దతు తెలుపుతూ కాంట్రాక్ట్ లెక్చరర్లను రూలాఫ్ రిజర్వేష¯ŒSలోకి తీసుకొచ్చి కొత్త పీఆర్సీ వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే సీపీఎస్ రద్దుపై పోరాటం చేస్తామన్నారు. తాను సుదీర్ఘకాలం ఉద్యోగ సంఘాల నాయకుడిగా నిస్వార్థంగా పని చేశానన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అందరి సహకారంతో పోరాడినట్లు తెలిపారు.
10వ పీఆర్సీ కమిష¯ŒSను సకాలంలో నియమించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి విజయం సాధించామన్నారు. తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే రానున్న రోజుల్లో సమస్యలపై పోరాడేందుకు ముందుటానన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ శ్రీరాములు, వైఎస్ఆర్ టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు అశోక్‌కుమార్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు గుర్రం గోవర్ధన్, ఉపాధ్యాయులు రామచంద్రరెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.