Bejjanki
-
మద్యం మత్తులో ఎస్సై వీరంగం.. స్నేహితులతో కలిసి పోలీసులపై దాడి
సాక్షి, మంచిర్యాల: మంచిర్యాలక్రైం: ఓ పోలీస్ ఆఫీసర్ బాధ్యతలు విస్మరించి మద్యంమత్తులో వీరంగం సృష్టించారు. బ్లూకోల్ట్స్ సిబ్బందిపై దాడిచేసి గాయపరిచారు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగింది. హాజీపూర్ మండలం వేంపల్లికి చెందిన ఆవుల తిరుపతి సిద్దిపేట జిల్లా బెజ్జంకి పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. దీపావళి సెలవుపై స్వగ్రామానికి వచ్చిన ఆయన మంగళవారం రాత్రి మంచిర్యాలలో రోడ్డుపై కారు ఆపి తన ఏడుగురు స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తూ హల్చల్ చేశారు. దీంతో స్థానికులు డయల్ 100కు ఫోన్‌చేసి సమాచారం అందించగా బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ ఉస్మాన్, హోంగార్డు సంపత్ ఘటనాస్థలానికి చేరుకున్నారు. వారిని చూసిన తిరుపతి మరింత రెచ్చిపోయి దురుసుగా ప్రవర్తించారు. ‘‘నేను బెజ్జంకి ఎస్ఐని. మీరు ఆఫ్ట్రాల్ కానిస్టేబుళ్లు. ఇక్కడి నుంచి వెళ్లిపోండి’’అని బెదిరించారు. కానిస్టేబుళ్లు ఈ దృశ్యాలను చిత్రీకరించేందుకు ప్రయత్నించగా వారివద్ద ఉన్న ట్యాబ్‌ను, సెల్‌ఫోన్ ఎస్ఐ లాక్కుని నేలకేసి కొట్టారు. ఉస్మాన్‌పై దాడి చేశారు. అడ్డుకోబోయిన హోంగార్డును కొట్టారు. దీంతో మరింత మంది పోలీసులు రావడంతో తిరుపతి పారి పోయారు. బుధవారం తిరుపతితోపాటు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. -
బతుకమ్మ పండగ వేళ విషాదం.. మరొకరితో సహజీవనం చేస్తోందని..
సాక్షి, సిద్దిపేట: బతుకమ్మ పండగ వేళ మండలంలోని వీరాపూర్‌లో విషాదం నెలకొంది. ఆదివారం రాత్రి బతుకమ్మ ఆడుతుండగా మామిడి స్వప్న(45)ను ఆమె భర్త ఎల్లారెడ్డి రాడ్డుతో తలపై మోదడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలు తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు వివరాలు ఇలా ఉన్నాయి. బెజ్జంకి వీరాపూర్ గ్రామానికి చెందిన మామిడి ఎల్లమ్మ, గోపాల్‌రెడ్డి దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు మంగ, స్వప్న ఉన్నారు. అదే గ్రామంలోని యాల్ల ఎల్లారెడ్డితో పెద్ద కూతురు మంగ వివాహం 20 ఏళ్ల క్రితం జరిగింది. పెళ్లి జరిగిన నెలకే మంగ ఆత్మహత్య చేసుకుంది. తరువాత రెండో కూతురు స్వప్నను ఎల్లారెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. ఆరేళ్ల వరకు వారు అనోన్యంగానే ఉన్నారు. వారికి కుమార్తె సుశ్మిత, కుమారుడు శ్రీజన్ ఉన్నారు. భార్యాభర్త తరుచు గొడవ పడేవారు. కాగా 14 ఏళ్ల నుంచి అదేగ్రామానికి చెందిన ఓ వ్యక్తితో స్వప్న సహజవనం చేస్తోంది. తనను వదిలి మరో వ్యక్తితో ఉంటోందని మనుసులో పెట్టుకున్న ఎల్లారెడ్డి బతుకమ్మ ఆడుతున్న స్వప్నను రాడ్‌తో తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. కూతురును హత్య చేసిన ఎల్లారెడ్డిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని తల్లి ఎల్లమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ ఆవుల తిరుపతి తెలిపారు. చదవండి: లోయలో పడ్డ టెంపో ట్రావెలర్.. ఏడుగురు దుర్మరణం -
రసమయి బాలకిషన్‌పై కేసు నమోదు.. ఫిర్యాదు చేసిన రెండేళ్లకు
సాక్షి, సిద్ధిపేట: మానకొండూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై కేసు నమోదైంది. ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణహాని ఉందని, చర్యలు తీసుకోవాలని సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలానికి చెందిన రాజశేఖరరెడ్డి అనే వ్యక్తి 2020లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాదాపు రెండేళ్ల తర్వాత ఈ కేసుపై స్పందించిన పోలీసులు .. తాజాగా ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. ఐపీసీ 209, 506 సెక్షన్ల కింద రసమయిపై కేసు నమోదు చేశారు. విచారణ కోసం కేసుకు సంబంధించిన సాక్ష్యాలను వారం రోజుల్లో అందించాలని పోలీసులు కోరారు. అయితే ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసిన రెండేళ్ల తర్వాత పోలీసులు రసమయి బాలకిషన్‌పై కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. కాగా కళాకారుడిగా గుర్తింపు సాధించిన రసమయి 2014లో మానుకొండూరు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018 ఎన్నికలలోనూ ఆయన విజయం సాధించారు. ఏడాది క్రితం తెలంగాణ ప్రభుత్వం ఆయన్ను రాష్ట్ర సాంస్కృతిక మండలి చైర్మన్‌గా నియమించింది. చదవండి: ఊపందుకున్న ఆపరేషన్ ఆకర్ష్.. బీజేపీలోకి జయసుధ? -
ఎగిసిపడిన ‘భగీరథ’
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గాగిళ్లాపూర్ – తోటపల్లి రాజీవ్ రహదారి సమీపంలో మంగళవారం మిషన్ భగీరథ పైప్‌లైన్ పగిలింది. దీంతో నీరు ఉవ్వెత్తున్న ఎగిసిపడింది. పెద్దలైన్ కావడం.. ప్రెషర్ ఎక్కువగా ఉండటంతో రాజీవ్ రహదారికి ఇరువైపులా నీళ్లు విరజిమ్మాయి. దీంతో కొంతసేపు ప్రయాణానికి ఆటంకం కలిగింది. సమీపంలోని శనగ పంట పూర్తిగా నీట మునిగింది. సమాచారం తెలుసుకున్న అధికారులు నీటి సరఫరాను నిలిపివేశారు. చదవండి: (హమ్మయ్య.. ఎల్ఆర్ఎస్ ఉపశమనం) -
‘తోటపెల్లి’ వరప్రదాయిని
సాక్షి, బెజ్జంకి(సిద్దిపేట): మెట్టప్రాంత రైతులకు వరప్రదాయిని తోటపెల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయరని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్‌బాబుతో కలిసి మంగళవారం మండలంలోని తోటపెల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో పూజలు చేసి జలహారతి ఇచ్చారు. అనంతరం తిమ్మాపూర్ చిగురుమామిడి, కోహెడ మండలాలకు నీళ్లు వదిలేందుకు స్విచ్ ఆన్‌చేసి షటర్ ద్వారా గోదావరి జలాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కృషితో మిడ్ మానేరు ద్వారా గోదావరి జలాలు అందుతున్నాయని తెలిపారు. తోటపెల్లి రిజర్వాయర్ పనులు దాదాపుగా పూర్తయ్యాయని మిగితా పనులు త్వరలోనే పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఈ రిజర్వాయర్‌కు బెజ్జంకి మండలంలోని చెరువులను అనుసంధానం చేసి నీళ్లతో నింపుతామన్నారు. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో నీటి మట్టం పెరుగుతందని మరో మూడు నెలల్లో గౌరవెల్లి వరకు నీళ్లు వస్తాయని చెప్పారు. కల సాకారమైంది: ఎమ్మెల్యే ఒడితెల హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీశ్‌బాబు మాట్లాడుతూ దశాబ్దలుగా వరద కాలువ ద్వారా నీళ్లు వస్తాయనే ఆశతో ఎదురు చేశామని, ఇప్పుడు సీఎం కేసీఆర్ కృషితో కల సాకారమయిందని పేర్కొన్నారు. ఈ రిజర్వాయర్ నుంచి హుస్నాబాద్, కోహెడ, చిగురుమామిడి, తిమ్మాపూర్ మండలాలకు నీళ్లు అందుతాయన్నారు. అనంతరం రిజర్వాయర్ పనులను, నీటి మట్టాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు మిడ్ మానేరు నుంచి 1.6735 టీఎంసీల నీల్లు వచ్చాయని అందులో నుంచి కాలువ ద్వారా 200 క్యూక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ రాయిరి రాజిరెడ్డి, తన్నీరు శరత్‌రావు, ఈఈ రాములు, జెడ్పీటీసీ కనగండ్ల కవిత, ఎంపీపీ లింగాల నిర్మల, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. -
సంక్షేమ పథకాల అమల్లో విఫలం
బెజ్జంకి: సంక్షేమ పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం బీజేపీ ఆధ్వర్యంలో మండలకేంద్రంలో చేపట్టిన తిరంగ యాత్ర ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. 2019లో అధికారమే లక్ష్యంగా గ్రామ స్థాయి నుంచి బీజేపీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో మానకొండూర్ నియోజకవర్గ ఇన్చార్జీ నాగరాజు, రాష్ట్ర కార్యవర్గసభ్యుడు సుభాష్, మండల అధ్యక్షులు నాగరాజు, పార్లమెంట్ కోకన్వీనర్ చంద్రారెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ మహిపాల్‌రెడ్డి, నాయకులు జనార్దన్‌రెడ్డి, మల్లేశం, శంకర్, నారాయణరెడ్డి, రాజు, మల్లేశం, శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు. -
అప్పు దొరకలేదని రైతు ఆత్మహత్య
బెజ్జంకి : కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం చీమలకుంటపల్లెలో చొప్పరి లక్ష్మయ్య(45) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇల్లంతకుంట మండలం అనంతారం గ్రామానికి చెందిన చొప్పరి లక్ష్మయ్య అత్తగారి ఊరైన చీమలకుంటపల్లెలో 25 ఏళ్లుగా నివాసం ఉంటున్నాడు. మూడేళ్ల క్రితం ఉపాధి కోసం గల్ఫ్‌కు వలస వెళ్లి ఇటీవలే గ్రామానికి వచ్చాడు. అనంతారంలో తనకున్న 3.20 ఎకరాలు భూమితో పాటు చీమటకుంటపల్లెలో రెండెకరాల భూమిని కౌలుకు తీసుకుని ఖరీఫ్‌లో పత్తి పంటను సాగు చేశాడు. పెట్టుబడి, ఇతర ఖర్చులతో కలిపి రూ.3లక్షల వరకు అప్పులు చేశాడు. మళ్లీ పెట్టుబడి కోసం చేతిలో చిల్లి గవ్వలేకపోవడంతో బ్యాంకు రుణం కావాలని ఇల్లంతకుంట, బెజ్జంకి మండలాల్లోని బ్యాంకులను సంప్రదించాడు. బ్యాంకుల్లో అప్పు పుట్టకపోవడంతో మనస్తాపం చెందిన లక్ష్మయ్య గురువారం ఉదయం ఇంటి నుంచి పాడి పశువును తీసుకుని పొలం వద్ద వెళ్లి చెట్టుకు ఉరివేసుకున్నాడు. అతనికి భార్య కనకవ్వ, కుమార్తెలు కవిత(19), నవీన(17) ఉన్నారు. పిల్లలు డిగ్రీ చదువుతున్నారు. -
జెడ్పీ ఎన్నికల్లో గెలుపు మాదే..!
బెజ్జంకి, న్యూస్‌లైన్ : జెడ్పీటీసీ ఎన్నికల్లో వై ఎస్సార్సీపీదే విజయమని, మానకొండూర్ ని యోజకవర్గంలోని నాలుగు స్థానాలతోపాటు జి ల్లాలో మరో ఎనిమిది స్థానాల్లో గెలుస్తామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి అ న్నారు. బెజ్జంకి జెడ్పీటీసీ అభ్యర్థిగా పార్టీ తరఫు న పోటీచేస్తున్న కాల్వ కొమురయ్యకు మద్దతు గా శనివారం గుండ్లపల్లిలో ప్రచార రథాలను ప్రారంభించారు. అనంతరం ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వై ఎస్.రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలను వివరిం చారు. ఫీజురీయంబర్స్‌మెంట్, పెన్షన్లు, వృ ద్ధాప్య పింఛన్లతో లక్షలాది మంది లబ్ధిపొందార ని, ఈ నేపథ్యంలో ప్రజలంతా పార్టీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రాజన్న రాజ్యం మళ్లీ రావాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అభ్యర్థి కాల్వ కొమురయ్య, జిల్లా స్టిరింగ్ కమిటీ సభ్యుడు సొల్లు అజయ్‌వర్మ, అనిల్, సంతోష్, రాజు, మహేశ్, మధు, రాజు, రమేశ్, రామకృష్ణ, కిట్టు, అంజి, శ్రీను, తిరుపతి, ప్రవీణ్‌కుమార్, ఓదెలు, పర్శరాములు పాల్గొన్నారు. -
చిరుత చిక్కింది
బెజ్జంకి, న్యూస్‌లైన్ : కొన్నేళ్లుగా ఈ ప్రాంత ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న చిరుత అనూహ్యంగా ఉచ్చులో చిక్కింది. వేటగాళ్లు అడవిపందుల కోసం అమర్చిన ఉచ్చులో ప్రమాదవశాత్తు చిక్కిన చిరుత కాసేపు నానా హంగామా సృష్టించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎనిమిది గంటల ఉత్కంఠ పరిస్థితుల అనంతరం చిరుతను బంధించి తరలించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. బెజ్జంకి మండలం హన్మాజిపల్లెకు చెందిన తోటపల్లి లచ్చయ్య అనే గొర్లకాపరి సోమవారం ఉదయం 11.30 ప్రాంతంలో గొర్లమందను గ్రామ శివారు పంతుళ్ల కొండాపూర్ ల్యాగల గుట్ట సమీపానికి మేతకు తీసుకెళ్లాడు. అటువైపు వెళ్తుండగానే గొర్లు ఒక్కసారిగా బెదిరిపోయాయి. కాసేపటికి తోటపల్లి చిన్నచంద్రయ్య గొర్లు కూడా అక్కడివరకు వెళ్లి బెదిరి చెల్లాచెదురయ్యాయి. గొర్లకాపరులు వెళ్లి చూడగా వారికి చిరుత కనిపించడంతో ఒక్కసారిగా బెదిరిపోయారు. అడవిపందుల కోసం వేటగాళ్లు అమర్చిన ఉచ్చులో చిరుత చిక్కుకుందని గుర్తించి, వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించారు. సర్పంచ్ హన్మండ్ల నర్సవ్వ, గ్రామస్తులు అక్కడకు చేరుకుని ఎస్సై ఉపేందర్‌రావు, తహశీల్దార్ కిష్టయ్యకు సమాచారం అందించారు. వారు ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. 8 గంటలు ఉత్కంఠ చిరుత చిక్కిందనే సమాచారం మండలవ్యాప్తంగా వ్యాపించడంతో ప్రజలు భారీగా తరలివచ్చారు. ఫారెస్ట్ అధికారులు డీఎఫ్ ఏఎస్పీ జోజీ, డీఎఫ్‌వో నర్సయ్య, కరీంనగర్ రేంజ్ అధికారి వాహబ్ 2 గంటల ప్రాంతంలో అక్కడకు చేరుకున్నారు. 6 గంటల ప్రాంతంలో వరంగల్ ఫారెస్ట్ రేంజ్ అధికారి రాజరాం, డాక్టర్ ప్రవీణ్‌కుమార్, రెస్క్యూ టీం సభ్యులు బాలాజీ, కృష్ణ, సదానందం, చారి చేరుకున్నారు. డాక్టర్ ప్రవీణ్‌కుమార్ చిరుతకు మత్తు ఇంజక్షన్ వేయగా మూడు సార్లు గురితప్పింది. నాలుగోసారి ఇంజక్షన్ చిరుతకు తగిలినా మత్తు ఎక్కలేదు. మరోసారి ప్రయత్నంలో చిరుతకు మత్తు ఎక్కడంతో దాని దగ్గరికి వెళ్లిన అధికారులు చిరుత ముందరికాలుకు ఉన్న ఉచ్చును తొలగించారు. బోనులోకి ఎక్కించి చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని జూపార్క్‌కు తరలించారు. డీఎస్పీ రవీందర్ ఎప్పటికప్పుడు పరిస్థితి పర్యవేక్షించారు. ఊపీరి పీల్చుకున్న ప్రజలు మండలంలోని మైలారం, హన్మాజిపల్లె, గోపాల్పూర్ గ్రామాల్లో చిరుత సంచారంతో రెండేళ్లుగా ప్రజలు భయాం దోళనకు గురవుతున్నారు. రైతులు రాత్రివేళ వ్యవసాయ బావుల వద్దకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. గతేడాది ముచ్చతల లక్ష్మారెడ్డి అనే రైతుకు చెందిన లేగదూడ బావి వద్ద ఉండగా చిరుత తినేసింది. మూడురోజుల క్రితం హన్మాజీపల్లికి చెందిన పురుషోత్తం రాజయ్య గొర్రె పిల్లను, రెండు రోజుల క్రితం మైలారం గ్రామానికి చెందిన మడికట్టు అశోక్ లేగదూడను తినేసింది. దీంతో భయాందోళన పెరిగిపోయింది. అడవిపందుల బెడద కూడా ఎక్కువగానే ఉంది. అయితే వేటగాళ్లు అడవిపందుల కోసం ల్యాగలగుట్ట సమీపంలో అమర్చిన ఉచ్చులో అనూహ్యంగా చిరుత చిక్కుకోవడంతో ఆయా గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. చిరుత బం ధించే విషయంలో ఫారెస్టు అధికారుల తీరుకు ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. 12 గంటల సమయంలో సమాచారం అందిస్తే చాలా ఆలస్యంగా చేరుకోవడంపై మండిపడ్డారు.